Cyberabad Traffic
హైదరాబాద్ ఐటీ కారిడార్ పరిధిలో రోజురోజుకూ పెరిగిపోతున్న వెహికల్ రద్దీకి పర్మినెంట్ సొల్యూషన్ చూపించడానికి రవాణా శాఖ, పోలీసు యంత్రాంగం కీలక అడుగులు వేస్తున్నాయి. తాజాగా గచ్ఛిబౌలిలోని టీ హబ్ వేదికగా జరుగుతున్న సైబరాబాద్ మూవ్స్–2026 సదస్సులో భాగంగా ఐటీ ఉద్యోగులు, ప్రజల జర్నీ టైమ్‌ను తగ్గించడం, పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై విస్తృత చర్చలు జరిగాయి. పీక్ అవర్స్‌లో రోడ్లపై ఊపిరాడని విధంగా మారే రద్దీని తగ్గించడానికి కాంట్రా-ఫ్లో బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్ బీఆర్‌టీఎస్ విధానాన్ని వారం రోజుల్లోనే అందుబాటులోకి తీసుకువచ్చేలా ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు.
ఈ సర్వీసులకు ముందుగా జేఎన్‌టీయూ నుంచి రాయదుర్గ్ మార్గంలో ప్రారంభించడానికి ప్రణాళికలు సిద్ధమయ్యాయి. ఈ నిర్ణయంతో కేపీహెచ్‌బీ, హైటెక్ సిటీ, రాయదుర్గ్ మెట్రో స్టేషన్ల మధ్య డైలీ ప్రయాణించే వేలాది మంది ఐటీ ఉద్యోగులకు గమ్యస్థానాలు త్వరగా చేరుకునే అవకాశం లభిస్తుంది. దీనికితోడు రాబోయే రెండేళ్ల వ్యవధిలో సైబరాబాద్(Cyberabad Traffic) ఏరియాలో బస్సుల నెంబర్స్‌ను ఏకంగా 510కి పెంచాలని ఆర్టీసీ అధికారులు భావిస్తున్నారు. ఐటీ ఉద్యోగుల షిఫ్టుల టైములకు తగినట్లుగా ప్రత్యేక స్పెషల్ బస్సులను నడిపే దిశగా ఆలోచనలు చేస్తున్నారు.
అంతేకాకుండా, హైదరాబాద్‌లోని పాఠశాల విద్యార్థులు స్కూళ్లకు వెళ్లే సమయంలో ఎదుర్కొంటున్న ట్రాన్సపోర్టేషన్ సవాళ్లు, రోడ్డు భద్రతా సమస్యలపై సదస్సులో స్పెషల్‌గా చర్చించారు. పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ను విస్తరించడం ద్వారా పర్సనల్ వెహికల్స్ వాడకం తగ్గి, ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ ఇబ్బందులు చాలావరకు తొలగిపోతాయని రవాణా శాఖ, పోలీసు యంత్రాంగం అంచనా వేస్తున్నాయి.
