Hyderabad Air Pollution
ఒకప్పుడు ప్రశాంతమైన వాతావరణానికి, ఆహ్లాదకరమైన గాలికి పేరుగా ఉన్న హైదరాబాద్ ఇప్పుడు విపరీతమైన వాయు కాలుష్యం(Hyderabad Air Pollution)తో ఉక్కిరిబిక్కిరవుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో కొన్నేళ్లుగా కనిపిస్తున్న భయానక వాతావరణ పరిస్థితులే ఇప్పుడు హైదరాబాద్‌లోనూ ప్రత్యక్షమవుతుండటం పట్ల భాగ్యనగరవాసులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
హైదరాబాద్‌లో మొత్తం మీద ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఏకంగా 410కి పడిపోవడంతో ఈ పొల్యూషన్ పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో స్పష్టం చేస్తోంది. గాలిలోని అతి సూక్ష్మ ధూళి కణాలైన పీఎం 2.5 స్థాయులు సేఫ్ లిమిట్కి మించి ఏకంగా 278 మైక్రోగ్రాములుగా గుర్తించగా, పీఎం 10 స్థాయులు కూడా సాధారణం కంటే 3,4 రెట్లు అధికంగా 326 మైక్రోగ్రాములుగా రికార్డయ్యాయి.
ఈ స్థాయిలో హైదరాబాద్‌లో పొల్యూషన్(Hyderabad Air Pollution) పెరగడం వల్ల చిన్నారులు, వృద్ధులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్నారు. నగరంలోని అన్ని ప్రాంతాల్లో కూడా కాలుష్యం ప్రభావం కనిపిస్తున్నా, ముఖ్యంగా పశ్చిమ హైదరాబాద్‌లోని ఐటీ కారిడార్ పరిధిలో మాత్రం పరిస్థితి ఇంకా దారుణంగా తయారైంది.
డిఫెన్స్ కాలనీలో AQI ఏకంగా 685కి ఎగబాకింది. అలాగే శేరిలింగంపల్లిలో 666, మణికొండలో 602, యాంబియన్స్ ఫోర్ట్‌లో 596, ఎన్బీటీ నగరంలో 582గా పొల్యూషన్ సూచీ నమోదై స్థానికులను హడలెత్తిస్తోంది. కంటిన్యూగా సాగుతున్న భారీ నిర్మాణ కార్యకలాపాలతో పాటు విపరీతంగా పెరిగిపోయిన వాహనాల రద్దీ, రోడ్లపై పేరుకుపోతున్న దుమ్ముధూళి, పారిశ్రామిక ఉద్గారాలు ఈ పొల్యూషన్ విస్ఫోటనానికి మెయిన్ కారణాలుగా మారుతున్నాయి.దీనికి తాజాగా దీపావళి మతాబుల ఎఫెక్ట్ కూడా తోడయింది.
ఈ ముప్పు నుంచి నగరాన్ని కాపాడడానికి ప్రభుత్వం వెంటనే రంగంలోకి దిగాలని, రోడ్లపై నీటిని చల్లడం, నిర్మాణ ప్రాంతాల్లో దుమ్ము లేవకుండా బారికేడ్లను ఏర్పాటు చేయడం, వెహికల్ పొల్యూషన్ టెస్ట్‌లను మరింత స్ట్రిక్టుగా అమలు చేయడం వంటి కఠిన చర్యలు వెంటనే చేపట్టాలని పర్యావరణవేత్తలు చెబుతున్నారు. లేదంటే ముందు ముందు రోజుల్లో హైదరాబాద్ కూడా నివాసయోగ్యం కాని గ్యాస్ ఛాంబర్లాగే మారిపోతుందని హెచ్చరిస్తున్నారు.
Gossips : మీరూ మూడో వ్యక్తి మాటలే నమ్ముతారా? తప్పు మానిప్యులేటర్లదా లేక అబద్దాన్ని నమ్మిన మీదా?
