Bhagiratha
తెలంగాణలో సంచలనంగా మారిన కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ( Bhagiratha)పై లైంగిక వేధింపుల కేసు అంశం రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని నిన్న బండి భగీరథ ఇంటికి వెళ్లిన సిట్ అధికారులు కుటుంబసభ్యులకు నోటీసులు అందజేసారు. అయితే భగీరథ విచారణకు రాలేదు. ఎక్కడ ఉన్నాడనేది కూడా పోలీసులకు తెలియడం లేదు.
భగీరథ ఫోన్ లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో ఈ కేసులో బెయిల్ కోసం భగీరథ( Bhagiratha) ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై రేపు హైకోర్టులో విచారణ జరగనుంది. బెయిల్ పిటిషన్ విచారణ పూర్తయ్యే వరకూ భగీరథను కావాలనే తప్పిస్తున్నారని బీఆర్ఎస్ పార్టీలు, మహిళా సంఘాలు ఆరోపిస్తున్నాయి.
అటు కేంద్ర మంత్రి బండి సంజయ్ తన కొడుకు తప్పు చేయలేదని చెబుతున్నాడంటూ ఇచ్చిన స్టేట్‌మెంట్‌పై మహిళా సంఘాలు, విపక్షాలు మండిపడుతున్నాయి. విచారణకు పిలిస్తే తప్పించుకుని తిరగడం ఎంతవరకూ సరైనదో బండి సంజయ్ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి.
మరోవైపు ఈ కేసు విచారణ కోసం ఏర్పాటు చేసిన సిట్ బాధితురాలు, ఆమె కుటుంబసభ్యులతో మాట్లాడింది. కూకట్ పల్లి డీసీపీ రితిరాజ్ ఆధ్వర్యంలోని అధికారుల బృందం వారిని కలిసి వివరాలు సేకరించింది. మొదట ఇచ్చిన వాంగ్మూలం సరిగా లేదన్న ఉద్దేశంతో రితిరాజ్ మరోసారి బాధితురాలితో మాట్లాడి కీలక వివరాలు సేకరించారు.
భగీరథతో పరిచయం, తర్వాత జరిగిన పరిణామాలు, ఎక్కడెక్కడ తిరిగారు…లైంగిక వేధింపుల అంశం వంటి వాటిపై బాధితురాలి వాంగ్మూలం సేకరించారు. కోర్టులో జడ్జి ముందు మరోసారి వాంగ్మూలం ఇవ్వాల్సి ఉంటుందని కూడా డీసీపీ రితిరాజ్ బాధితురాలు, ఆమె తల్లికి తెలియజేశారు. ఈ కేసును లోతుగా దర్యాప్తు చేస్తున్న సిట్ బృందం తాజాగా మరో సెక్షన్ ను జోడించారు. పోక్సో కేసులో కఠినమైన 5(1) రెడ్ విత్ 6 సెక్షన్ ను కూడా చేర్చారు. అంటే తీవ్రమైన లైంగిక వేధింపులు జరిగినట్టు ఈ సెక్షన్ చెబుతోంది.
బాధితురాలి తల్లి ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం అక్టోబర్‌లో ఒకసారి, నవంబర్‌లో మరోసారి, గత ఏడాది డిసెంబర్ లో ఫామ్ హౌజ్ లో జరిగినట్టు భావిస్తున్న లైంగిక వేధింపుల వివరాలను సిట్ బృందం సేకరిస్తోంది. ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ స్నేహితులు కూడా ఘటనలు జరిగినప్పుడు అక్కడే ఉన్నట్టు గుర్తించారు. దీంతో వారిని కూడా విచారించనున్నారు. ఇదిలా ఉంటే సిట్ విచారణకు భగీరథ గైర్హాజరవడంతో.. ముందస్తు బెయిల్ మంజూరు చేయొద్దని పోలీసులు హైకోర్టును కోరే అవకాశముంది.
