AP Alliance
టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి కొద్ది నెలలు కూడా కాకముందే.. బయటికి ఆల్ ఓకే అన్నట్లు కనిపిస్తున్నా లోపల మాత్రం అసంతృప్తి రాజుకుంటోందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఈగో ఘర్షణలు, పవర్ పాలిటిక్స్‌తో పాటు ఆధిపత్య పోరు.. ఇప్పుడు రాబోయే లోకల్ బాడీ సమరానికి ముందే పెద్ద యుద్ధంగా మారబోతున్నాయనే న్యూస్ వినిపిస్తోంది.
ముఖ్యంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటీవల చేసిన కొన్ని ఘాటు కామెంట్లు, ఫేస్ చాటేయడం వంటి నిర్ణయాలు ఈ అనుమానాలకు మరింత ఆజ్యాన్ని పోస్తున్నాయి. ఇది బయటకు ఒక పొలిటికల్ మూవ్ లాగా కనిపిస్తున్నా.. జనసేన తన ఒరిజినల్ ఐడెంటిటీని కోల్పోదని, టీడీపీ ఏం చెబితే దానికి ఎస్ చెప్పే మోడ్‌లో తాను లేనని పవన్ క్లియర్‌గా మెసేజ్ ఇస్తున్నట్లు తెలుస్తోంది.
గతంలో అసెంబ్లీ ఎన్నికల సమయంలో కేవలం 21 సీట్లకే జనసేన పార్టీ పరిమితమవ్వడాన్ని సొంత పార్టీలోని నేతలు ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. దీంతోనే టీడీపీ ఇచ్చే సీట్లే తీసుకోవాలా? మన భవిష్యత్తు ఏంటంటూ పదే పదే వస్తున్న ప్రశ్నలకు చెక్ పెట్టడానికి పవన్ ఇప్పుడు రూట్ మార్చినట్లు కనిపిస్తోంది.
ఆ రోజు ఉన్న సీన్ వేరు, ఇప్పటి సీన్ వేరు అని పవన్ కట్ అండ్ రైట్‌గా చెప్పేశారు. రాబోయే స్థానిక పోరులో జనసేన పార్టీ ఆత్మగౌరవాన్ని కాపాడేలా, ఎక్కువ సీట్లలో పోటీ చేసేలా నిర్ణయాలు ఉంటాయని హింట్ ఇచ్చారు. అయితే ఇదంతా కేడర్‌లో పెరుగుతున్న ఫ్రస్ట్రేషన్‌ను చల్లార్చడానికే అనేవాళ్లతో పాటు ఫ్యూచర్‌లో కూటమికి(AP Alliance) బిగ్ షాక్ తప్పదని జోస్యం చెప్పేవాళ్లు కూడా ఉన్నారు.
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కేబినెట్ భేటీలకు రాకపోవడం, అసెంబ్లీ సమావేశాలకు కూడా గైర్హాజరు కావడం వెనుక ఈ కారణాలే ఉన్నాయన్న ప్రచారం జరుగుతోంది. పవన్‌కు హెల్త్ ప్రాబ్లెమ్స్ ఉన్నాయనేది నిజమే అయినా.. సొంత పార్టీ సమీక్షలకు, శాఖల రివ్యూలకు సమయాన్ని ఇస్తూ, కేబినెట్ అండ్ అసెంబ్లీ సమావేశాలను మాత్రమే స్కిప్ చేయడం వెనుక ఇన్ డైరెక్ట్ ప్రొటెస్ట్ ఉంది అనే కామెంట్స్ వస్తున్నాయి.
పైగా ఆ ప్రాజెక్ట్, ఈ ప్రాజెక్ట్ అని తేడా లేకుండా అమరావతిలో ప్రధానమంత్రి నరేంద్రమోదీ సభకు వచ్చి వెళ్లిన పవన్ కళ్యాణ్.. ఆ తర్వాత మళ్లీ అమరావతి వైపు కనీసం చూడకపోవడం వెనుక కూటమిలోని విభేదాలే కారణమని టాక్ నడుస్తోంది.
అసలు ఈ గ్యాప్‌కి మెయిన్ రీజన్ ఏపీ ప్రభుత్వంలో నారా లోకేష్ చూపిస్తున్న ఆధిపత్యమే అనే ఆరోపణలు ఉన్నాయి. అధికారుల బదిలీల నుంచి కీలక నియామకాల విషయం వరకూ లోకేష్ ఒంటెత్తు పోకడలను పవన్ ప్రశ్నించినట్లు ఇంటర్నల్‌గా ప్రచారం సాగుతోంది.
సీఎం చంద్రబాబుతో పవన్ కళ్యాణ్‌కి మంచి ర్యాపో ఉన్నా.. లోకేష్ దూకుడు, ఏకపక్ష నిర్ణయాలు పవన్ ఈగోని దెబ్బతీస్తోందనేది ఓపెన్ సీక్రెట్. బయటకి లోకేష్ పవన్‌ను అన్నయ్యా అని పిలిచినా, డెసిషన్ మేకింగ్‌లో మాత్రం తన మార్క్ చూపిస్తుండటంతో ఈ పవర్ గేమ్ మొదలైనట్లు తెలుస్తోంది. ఇలాంటి అంతర్గత సమస్యలతో పవన్, లోకేష్ మధ్య చంద్రబాబు నలిగిపోతున్నారన్న టాక్ నడుస్తోంది.
దీనికి తోడు ఇటీవల క్రిష్ణలంక పోలీస్ స్టేషన్ కస్టోడియల్ డెత్ ఇష్యూలో లేదా యూట్యూబర్ రావణ్ విషయంలో వైఎస్సార్‌సీపీ పవన్‌ను టార్గెట్ చేసినప్పుడు లోకేష్ కానీ, మిగతా టీడీపీ మంత్రులు కానీ ఎక్కడా నోరు విప్పలేదు. చంద్రబాబు క్లాస్ పీకిన తర్వాతే లీడర్లు ఒక్కొక్కరూ రియాక్టయ్యారు.
ఇక డీఎస్సీ( DSC)ఇష్యూలో లోకేష్‌ను వైఎస్సార్‌సీపీ టార్గెట్ చేసినప్పుడు జనసేన సైడ్ నుంచి కూడా అదే రేంజ్‌లో కోల్డ్ రెస్పాన్స్ వచ్చింది. ఈ సైలెంట్ వార్ సోషల్ మీడియాలోనూ కనిపిస్తోంది. రీసెంట్‌గా ఒక జనసేన ఎన్ఆర్ఐకి పదవి ఇవ్వబోతుంటే.. గతంలో ఆయన ఎన్టీఆర్, చంద్రబాబు, లోకేష్‌లను విమర్శించారంటూ టీడీపీ తమ్ముళ్లు సోషల్ మీడియాలో హడావుడి చేశారు. దీంతో జనసేన అభిమానులు కూడా అంతే ఘాటుగా రిప్లై ఇవ్వడంతో.. రెండు పార్టీల గ్రౌండ్ లెవెల్ కేడర్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా సీన్ మారింది.
కాగా ఫ్యూచర్‌లో లోకేష్ ముఖ్యమంత్రిగా ప్రొజెక్ట్ అవ్వడానికి పవన్ కళ్యాణ్ అతి పెద్ద అడ్డంకిగా మారతారనే భయం టీడీపీలోని ఒక వర్గానికి ఉందని విశ్లేషకులు చెబుతున్నారు. అందులోనూ భవిష్యాత్‌తో పొలిటికల్ స్ట్రాటజీలు మారితే.. బీజేపీ పవన్‌ని ఫ్రంట్ ఫేస్‌గా పెట్టి.. ఏపీ పాలిటిక్స్‌ని తన కంట్రోల్‌లోకి తెచ్చుకుంటుందేమోనని భయం చాలామందిలో ఉంది. పైకి అంతా ఓకే, మేమంతా కలిసే ఉన్నాం అని కవర్ చేస్తున్నా కూడా.. లోపల మాత్రం పవర్ కోసం, ఆధిపత్యం కోసం రెండు వర్గాలు కూడా రసవత్తరమైన పొలిటికల్ దాగడుమూతలు ఆడుతున్నాయనేది గ్రౌండ్ రియాలిటీ అని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
