Ink Mark
ఎన్నికల సమయంలో ఓటు హక్కు వినియోగించుకునే ప్రతి ఒక్కరి చూపుడు వేలిపై సిరా గుర్తు కనిపిస్తుంది. అయితే ఈసారి ఏపీలో జరగనున్న గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఈ సిరా గుర్తు వేసే విషయంలో స్టేట్ ఎన్నికల సంఘం కీలక మార్పును చేసింది. సాధారణంగా ఎన్నికల్లో ఓటు వేసిన తర్వాత చూపుడు వేలికి సిరా గుర్తు(Ink Mark) వేస్తుంటారు. కానీ ఈసారి మాత్రం ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికి గుర్తు వేయాలని ఆదేశాలను జారీ చేసింది. ఇంతకీ ఎన్నికల సంఘం ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుందనే ప్రశ్న చాలామందిలో వినిపిస్తోంది.
ఏపీలో గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఏర్పాట్లు జరుగుతుండటంతో ఓటర్లకు సిరా గుర్తు(Ink Mark) వేసే విధానంపై ఎన్నికల సంఘం క్లియర్ ఆదేశాలను ఇచ్చింది. ఇకపై గ్రామ పంచాయతీ ఎలక్షన్స్‌లో ఓటు వేసిన వారికి ఎడమ చేతి చిటికెన వేలిపై సిరా గుర్తును వేయాలని నిర్ణయించింది. ఈ నిబంధనను 3 విడతల్లో నిర్వహించనున్న ఎన్నికలన్నిటికి వర్తింపజేయనున్నారు.
ఇటీవల జరిగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల సమయంలో ఓటర్ల ఎడమ చేతి చూపుడు వేలికి సిరా గుర్తును వేశారు. ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా దగ్గరలోనే ఉండటంతో ఓటర్ల వేళ్లపై గతంలో వేసిన సిరా గుర్తు ఇంకా కనిపించే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మళ్లీ అదే వేలికి సిరా గుర్తు వేస్తే అందరికీ గందరగోళం ఏర్పడే అవకాశం ఉంటుంది. అందుకే ఎన్నికల సంఘం దీనికి చెక్ పెట్టడానికి చిటికెన వేలిని ఎంచుకుంది.
కాగా ఆంధ్రప్రదేశ్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికలను 3 విడతల్లో నిర్వహించనున్నారు. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 26వ తేదీన తొలి విడత పోలింగ్ జరగనుంది. నవంబర్ 29వ తేదీన రెండో విడత, డిసెంబర్ 2వ తేదీన మూడో విడత ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈ 3 విడతల్లో జరిగే ఎన్నికలలో ఓటర్ల ఎడమ చేతి చిటికెన వేలికే సిరా గుర్తు వేయాల్సి ఉంటుంది. ఎన్నికల విధుల్లో పాల్గొనే సిబ్బంది ఈ నిబంధనను తప్పనిసరిగా పాటించాలని స్టేట్ ఎన్నికల సంఘం ఆదేశించింది.
