Express Way
ఏపీ వాహనదారులకు త్వరలోనే గుడ్ న్యూస్ అందబోతోంది. ఉత్తరాంధ్ర ఏజెన్సీ లోయల నుంచి అమరావతి రాజధాని రోడ్ల వరకు జర్నీని ఎంజాయ్ చేయడమే కాకుండా, సగానికి సగం తగ్గించేలా ఒక గ్రాండ్ మాస్టర్ ప్లాన్ రెడీ అయింది.
పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పూర్ నుంచి అమరావతి ఓఆర్‌ఆర్‌ను డైరెక్టుగా కలుపుతూ రూపుదిద్దుకుంటున్న నాలుగు వరుసల హైస్పీడ్ రోడ్(Express Way) కారిడార్‌కు కేంద్ర రవాణా శాఖ పరిధిలోని ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ (AAC) గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. ఏపీ పరిధిలోని 457 కి.మీటర్ల రూట్‌కు ఈ ఆమోదం లభించడంతో, ఏపీలో పనులు వేగవంతం చేయడానికి గ్రౌండ్ వర్క్ స్టార్ట్ అయిపోయింది.
ఈ మెగా ప్రాజెక్టు(Express Way) వెనుకున్న అసలు విశేషాలు పరిశీలిస్తే, ఇది కేవలం ఒక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే పరిమితమైన రోడ్డు కాదు. పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఏపీ.. ఇలా 4 మెయిన్ రాష్ట్రాలను కలుపుతూ ఏకంగా 1,107 కిలోమీటర్ల వరకూ ఈ కారిడార్ విస్తరించి ఉంటుంది. ఈ బాట ఏపీలోని గిరిజన గ్రామాలు, గోదావరి జిల్లాలతో పాటు రాజధాని ప్రాంతం అమరావతికి మధ్య రవాణా వ్యవస్థను సరికొత్త ఎత్తుకు తీసుకెళ్లబోతోంది.
ఏపీ పరిధిలో ఈ రోడ్డు రూట్ మ్యాప్ చూస్తే ..పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల మీదుగా ఈ కారిడార్ సాగనుంది. కురుపాం నుంచి మొదలై పార్వతీపురం, సాలూరు, కన్నాపురం, అరకు వ్యాలీ, పాడేరు, చింతపల్లి, జంగారెడ్డి గూడెం, గోకవరం, లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడు ప్రాంతాలను జాయింట్ చేస్తూ.. చివరికి ఆగిరిపల్లి దగ్గర అమరావతి ఔటర్ రింగ్ రోడ్డులో కలవబోతోంది.
ఇక ఈ రోడ్డు నిర్మాణం కోసం.. గంటకు 100 నుంచి 120 కిలోమీటర్ల స్పీడ్‌తో వెహికల్స్ దూసుకెళ్లేలా పక్కా హైటెక్ డిజైన్‌తో దీనిని నిర్మించబోతున్నారు. దీని కోసం ఏకంగా 90 మీటర్ల వెడల్పుతో భారీ ఎత్తున భూసేకరణ చేయాల్సి ఉంది. 4 రాష్ట్రాల పరిధిలో మొత్తం 10,630 హెక్టార్ల భూమి అవసరం కాగా, దానిలో 2,371 హెక్టార్ల అటవీ భూమి కూడా ఉంది.
భూసేకరణతో పాటు నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికే రూ. 8,982 కోట్లు ఖర్చు కానుండగా, కేవలం సివిల్ వర్క్స్ విలువనే రూ. 55,772 కోట్లుగా లెక్కగట్టారు. అన్ని రకాల అనుమతులు, ఇతర ఖర్చులతో కలిపి ఈ కారిడార్ మొత్తం ప్రాజెక్ట్ వ్యయం ఏకంగా రూ.75,629 కోట్లకు చేరనుంది. అందులో ఆంధ్రప్రదేశ్‌లో నిర్మించే 457 కిలోమీటర్ల భాగానికే సుమారు రూ.32 వేల కోట్లు ఖర్చు కాబోతుండడం విశేషం.
ఈ భారీ ప్రాజెక్టును వీలైనంత వేగంగా పట్టాలెక్కించడానికి ప్రభుత్వం ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. జిల్లాల వారీగా భూసేకరణ ప్రక్రియను పర్యవేక్షించడానికి జాయింట్ కలెక్టర్ లేదా డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులను భూసేకరణ అధికారిగా నియమిస్తున్నారు.
ఇప్పటికే మన్యం, తూర్పుగోదావరి జిల్లాలకు సంబంధించి అధికారుల సెలక్షన్ పూర్తి చేసి కేంద్ర రవాణా శాఖ ఉన్నతాధికారులకు సమాచారాన్ని పంపారు. మిగిలిన జిల్లాల అధికారుల వివరాలను కూడా త్వరలోనే ఖరారు చేయబోతున్నారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాలలో కూడా ఎలైన్‌మెంట్‌పై పూర్తి క్లారిటీ రాగానే డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (DPR) ఫైనల్ చేసి, వచ్చే మార్చి నాటికి ఈ ప్రాజెక్టుకు అఫీషియల్‌గా కేంద్రం మంజూరు సాధించాలనే టార్గెట్‌తో అడుగులు పడుతున్నాయి.
