Lokesh VS Jagan
ఏపీ రాజకీయంలో మంత్రి నారా లోకేష్ , మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మధ్య మాటల యుద్ధం రోజురోజుకూ పీక్స్‌కు చేరుతోంది. ఒకరిపై ఒకరు చేసుకుంటున్న విమర్శలు, ప్రతి విమర్శలు, విసురుకుంటున్న సవాళ్లతో ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ హీట్ రోజురోజుకు పెరిగిపోతుంది..
ఒకవైపు ప్రతిపక్షంలో ఉన్న జగన్..కూటమి ప్రభుత్వంపై నిరుద్యోగ సమస్యలు, హామీల అమలు . విద్యావ్యవస్థలోని లోపాలపై విమర్శలను గుప్పిస్తుంటే.. మరోవైపు అధికారంలో ఉన్న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అంతే ఘాటుగా కౌంటర్లు ఇస్తూ డైరెక్టుగా చర్చకు రావాలని సవాల్ విసురుతున్నారు.
ప్రభుత్వ హయాంలో జరిగిన నిర్ణయాలపై ఏపీ సర్కార్‌ను ప్రశ్నిస్తూ దీనిపై చర్చకు సిద్ధం అని జగన్ అంటుంటే.. ఏపీపీఎస్సీకి, డీఎస్సీకి తేడా తెలియని వారు నీతులు చెబుతున్నారంటూ లోకేష్ విరుచుకుపడుతున్నారు.
ఈ పొలిటికల్ యుద్ధంలో మెయిన్‌గా డీఎస్సీ , వెలిగొండ ప్రాజెక్టుల అంశాలే రచ్చకు కేంద్ర బిందువుగా మారాయి. గత వైఎస్సార్‌సీపీ పాలనలోనే ఉద్యోగాల భర్తీ పేరుతో నిరుద్యోగులను మోసం చేశారని.. అసలు సకాలంలో నోటిఫికేషన్లే ఇవ్వలేదని ఏపీ ప్రభుత్వం విమర్శిస్తోంది.
తాము పవర్‌లోకి రాగానే గత ప్రభుత్వం వేయించిన 150 కోర్టు కేసులను అధిగమించి విజయవంతంగా డీఎస్సీ పూర్తి చేసిన విషయాన్ని గుర్తు చేస్తున్న లోకేష్.. రాబోయే మూడేళ్లలో కూడా వరుసగా నిర్వహిస్తామని స్పష్టం చేస్తున్నారు.
అలాగే వెలిగొండ ప్రాజెక్ట్ విషయంలో కూడా క్రెడిట్ వార్ నడుస్తోంది. పనులు పూర్తి కాకుండానే జగన్ జాతికి అంకితం చేసేశారని, ఇప్పుడు తమ ప్రభుత్వం ఆర్‌అండ్‌ఆర్ ప్యాకేజీలు ఇస్తూ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తుంటే క్రెడిట్ దొంగిలిస్తున్నారని కూటమి సర్కార్ విమర్శిస్తుండగా.. తమ హయాంలోనే ప్రాజెక్ట్ పనులు మెజారిటీ భాగం పూర్తయినట్లు వైసీపీ నేతలు వాదిస్తున్నారు.
రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్‌ను దృష్టిలో పెట్టుకుని సాగుతున్న ఈ పొలిటికల్ హీట్ మరిన్ని మలుపులు తిరుగుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఏపీని పూర్తిగా గాడిలో పెట్టాలంటే కూటమి మరో మూడుసార్లు గెలవాల్సిందేనని, జనసేన , బీజేపీలతో కలిసి 94 శాతం వరకూ సీట్లు గెలిచామని, ఈ ఐక్యత దెబ్బతినకూడదని టీడీపీ లెక్కలు వేస్తోంది.
