Tirumala Laddu
తిరుపతి కొండెక్కి ఆ ఏడుకొండల వాడిని కళ్లారా దర్శించుకున్నాక, చేతిలో ఆ గుమగుమలాడే లడ్డూ ప్రసాదం పడితే వచ్చే ఆ తృప్తి వేరుగా ఉంటుంది. షుగర్ ఉన్నవాళ్లు కూడా ఓ రెండు నిమిషాలు తమ భయాన్ని పక్కన పెట్టి మరీ లొట్టలేసుకుంటూ తినేంత అద్భుతమైన రుచి ఆ లడ్డూకు సొంతం.
కాగా ఇన్నాళ్ల తర్వాత ఈ దివ్య ప్రసాదానికి ఇప్పుడు 310 ఏళ్ల చరిత్ర ఉందనే ఆసక్తికర విషయంపై టీటీడీ ఒక క్లారిటీకి వచ్చింది. దీనికోసం 3 శతాబ్దాల శ్రీవారి ప్రసాదం సుదీర్ఘ ప్రయాణాన్ని గుర్తు చేసుకుంటూ, తిరుమల చరిత్రలోనే నిలిచిపోయేలా ఒక పక్కా మాస్టర్ ప్లాన్‌తో తిరుమల తిరుపతి దేవస్థానం ముందడుగు వేస్తోంది.
శ్రీవారి అమృత ప్రసాదానికి ఉన్న ప్రాముఖ్యతను గుర్తించిన టీటీడీ, దీని జ్ఞాపకార్థం ఒక ప్రత్యేకమైన గోల్డ్ కాయిన్ రిలీజ్ చేయాలని ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి పంపించింది. త్వరలోనే జరగబోయే తిరుమల బ్రహ్మోత్సవాల సమయంలో, స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పించడానికి వచ్చే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు చేతుల మీదుగా ఈ గోల్డ్ కాయిన్‌ను ఘనంగా లాంచ్ చేయడానికి అధికారులు అడుగులు వేస్తున్నారు.
నిజానికి 15వ శతాబ్దంలో తిరుమల శ్రీవారికి మొట్టమొదటిగా వడను మాత్రమే ప్రసాదంగా ఇచ్చేవారని, ఆ తర్వాత వడతో పాటు బూందీ వచ్చిందని, తర్వాత మెల్లగా అది మనందరికీ ఇష్టమైన లడ్డూగా రూపాంతరం చెందిందని చరిత్ర చెబుతోంది. ఆ తర్వాత 1803లో బ్రిటిష్ కాలంలో ఈ లడ్డూ ప్రసాదాల అమ్మకాలు మొదలయ్యాయి.
రోజూ లక్షలాది మంది భక్తులు దర్శించుకునే తిరుమలలో ప్రసాదం తయారీ అంటే అదేమంత తేలికైన విషయమేమీ కాదు. దీనికోసం దిట్టం అనే పక్కా కొలతల ఫార్ములాను ఫాలో అవుతారు. నాణ్యమైన శనగపిండి, స్వచ్ఛమైన ఆవు నెయ్యి, చక్కెర, పచ్చ కర్పూరం, యాలకులు, కలకండతో పాటు జీడిపప్పు, ఎండుద్రాక్ష వంటి రిచ్ డ్రై ఫ్రూట్స్ కరెక్టు కొలతలతో కలిపి ఈ లడ్డూలను తయారు చేస్తారు.
తిరుమల శ్రీవారి లడ్డూ రుచి, నాణ్యత ప్రపంచంలో ఇంకెక్కడా దొరకవు. అందుకే 2009లోనే తిరుపతి లడ్డూకి భౌగోళిక గుర్తింపు లభించింది. పేటెంట్ హక్కులు టీటీడీ వద్దే ఉన్నాయి కాబట్టి, టీటీడీ అనుమతి లేకుండా తిరుపతి లడ్డూ పేరుతో ఎవ్వరూ దీనిని తయారు చేయకూడదు.
1803లో అప్పటి మద్రాసు ప్రభుత్వం తిరుపతి శ్రీవారి ఆలయంలో ప్రసాదాల అమ్మకాలను స్టార్ట్ చేసింది. మొదట్లో బూందీని మాత్రమే తీపి ప్రసాదంగా అమ్మేవారు. ఆ తర్వాత దానినే గుండ్రటి లడ్డూగా చుట్టడం మొదలుపెట్టారు.
శ్రీవారి గర్భాలయానికి ఆగ్నేయ దిశలో ఉండే పోటు అనే మెయిన్ వంటశాలలోనే వెంకన్న ప్రసాదాలన్నీ తయారవుతాయి. అక్కడ సిద్ధం చేసిన పదార్థాలను మొదట వకుళమాతకు చూపించిన తర్వాతే..శ్రీ వేంకటేశ్వరస్వామికి నివేదనగా సమర్పిస్తారు.
తిరుమల లడ్డూల(Tirumala Laddu) తయారీకి ఏ సరుకు ఎంత వాడాలో నిర్ణయించే నియమావళినే దిట్టం లేదా పడితరం స్కేల్ అంటారు. దీనిలో పడి అంటే 51 రకాల వస్తువుల కలయిక అని అర్ధం. మొదటిసారిగా 1950లో ఈ దిట్టాన్ని నిర్ణయించారు. దాని తర్వాత ప్రస్తుతం 2001లో సవరించిన కొలతలనే వాడుతున్నారు.
ఈ దిట్టం లెక్క ప్రకారం 5,100 లడ్డూలు తయారు చేయాలంటే 803 కేజీల ముడి సరుకులు కావాలి. ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 3.50 లక్షల లడ్డూల తయారీకి కావలసిన సరుకులను తిరుమల తిరుపతి దేవస్థాం స్టోర్స్ నుంచి పోటుకు పంపుతూ ఉంటారు.
ఒకప్పుడు ఈ లడ్డూలన్నింటినీ కూడా కట్టెల పొయ్యిల మీదే సాంప్రదాయబద్ధంగా వండేవారు. కానీ పొగ ఎక్కువై లడ్డూ తయారు చేసేవారు ఇబ్బంది పడుతూ ఉండటంతో..వాటి స్థానంలో గ్యాస్ పొయ్యిలను అందుబాటులోకి తెచ్చారు.
15 ఏళ్ల కిందట బూందీ తయారీని ఆలయం వెలుపలనున్న ఉత్తర భాగానికి మార్చారు. అక్కడ బూందీ సిద్ధం చేశాక, ఆధునిక కన్వేయర్ బెల్ట్ ద్వారా ఆలయం లోపలికి తీసుకుని వెళ్తారు. అక్కడ ఆగమ శాస్త్ర నియమాల ప్రకారం లడ్డూలు చుట్టి, తిరిగి కన్వేయర్ బెల్ట్ ద్వారానే బయట ఉన్న లడ్డూ ప్రసాదం అమ్మే కేంద్రాలకు తరలిస్తారు.
తిరుమలలో రోజూ తయారయ్యే ప్రసాదాల లెక్కలు చూస్తే ఎవరైనా షాక్ అవుతారు. సుమారు 140 నుంచి 170 గ్రాముల బరువుండే చిన్న సైజ్ లడ్డూలు రోజుకు 3.5 లక్షలు తయారవుతాయి.
ఉచితంగా ఇచ్చే మినీ లడ్డూలు అయితే రోజుకు 1,07,100 రూపుదిద్దుకుంటాయి. ఇక 700 గ్రాముల బరువు ఉండే భారీ కళ్యాణం లడ్డూలు రోజుకు 7,100, అలాగే కరకరలాడే వడలను రోజుకు 4 వేల వరకు సిద్ధం చేస్తారు.
ఇవే కాకుండా స్వామివారికి పులిహోర, చక్కెర పొంగలి, దధ్యోదనం, పొంగలి,పాయసం, అప్పం, పోలి, బెల్లపు దోశ, అమృతకలశం, కేసరిబాత్, మిరియాల అన్నం, కదంబం, కేసరి, జిలేబీ, నెయ్యి దోశ, పానకం, వడపప్పుతో పాటు ధనుర్మాసంలో ప్రత్యేక ప్రసాదాలను స్వామివారికి అత్యంత భక్తిశ్రద్ధలతో నివేదిస్తుంటారు.
ఒకప్పుడు కేవలం ఒక్క రూపాయికే లభించిన చిన్న లడ్డూ ధర మెల్లగా రూ.25కి అలా గత ప్రభుత్వ హయాంలో రూ.50కి చేరింది. అలాగే శ్రీవారి కళ్యాణం లడ్డూ ధర రూ.100 నుంచి రూ.200కు పెరిగింది.
స్వామివారి దర్శనానికి వచ్చే ప్రతి భక్తుడికి కూడా ఫ్రీగా ప్రసాదం ఇస్తుండగా, అదనంగా కావాలనుకునే వారు మాత్రం డబ్బులు చెల్లించి తమకు కావాల్సిన లడ్డూలు కొనుక్కోవాల్సి ఉంటుంది.
America : అమెరికాను వదలని గన్ కల్చర్..ముగ్గురి మృతితో మరోసారి ఉలిక్కిపడ్డ అగ్రరాజ్యం
