Radha Ashtami : శ్రావణ కృష్ణాష్టమి లాగే భాద్రపద రాధాష్టమి ఉంటుందని తెలుసా? రాధాష్టమి విశిష్టత ఏంటి?

Radha Ashtami : కృష్ణుడి రూపాన్ని ఆరాధించేవారి కంటే, రాధ నామాన్ని జపించేవారిపైనే కన్నయ్య అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్ముతారు.

Radha Ashtami

శ్రీకృష్ణుడి పేరు తలచుకోగానే మనందరికీ వెంటనే గుర్తుకువచ్చే పేరు రాధ. హిందూ సనాతన ధర్మంలో శ్రీకృష్ణుడి జన్మదినాన్ని కృష్ణాష్టమిగా ఎంత వైభవంగా జరుపుకొంటారో, కన్నయ్య ప్రాణ ప్రియురాలైన శ్రీ రాధారాణి జన్మించిన దినాన్ని రాధాష్టమిగా అంతే భక్తిశ్రద్ధలతో జరుపుకొంటారు.

శ్రీకృష్ణాష్టమి ముగిసిన 15 రోజుల తర్వాత, అంటే భాద్రపద మాసంలోని శుక్ల పక్ష అష్టమి తిథి నాడు రాధాష్టమి(Radha Ashtami) వస్తుంది. ఉత్తర భారతంలో, ముఖ్యంగా బృందావనం, మథుర, బర్సానా ప్రాంతాల్లో రాధాష్టమి వేడుకలు చాలా వేడుకగా సాగుతాయి.

శ్రీకృష్ణుడు, రాధల ప్రేమ సాధారణ లౌకికమైనది కాదని అది అత్యున్నతమైన ఆత్మపరమాత్మల అనుబంధమని పురాణాలు చెబుతాయి. పురాణాలు చెబుతున్నదాని ప్రకారం రాధారాణి శ్రీకృష్ణుడి కంటే వయస్సులో పెద్దది. వీరి ప్రేమలో ఎలాంటి స్వార్థం కానీ శారీరక ఆకర్షణ కానీ ఉండవు.

శ్రీకృష్ణుడి లీలా తరంగిణిలో రాధ ఆయన ఆహ్లాదిని శక్తి అంటే ఆనందాన్ని ఇచ్చే శక్తిగా పండితులు భావిస్తారు. అంటే కృష్ణుడు పరమాత్మ అయితే, ఆ పరమాత్మలోని ఆనంద స్వరూపమే రాధ అని అర్ధం. అందుకే రాధ లేని కృష్ణుడిని, కృష్ణుడు లేని రాధను ఊహించలేము.

అందుకే ప్రపంచంలో ఎక్కడైనా , ఎవరైనా సరే కృష్ణారాధ అని అనరు, రాధాకృష్ణ అని రాధ పేరునే ముందుగా స్మరిస్తారు. ఎందుకంటే కృష్ణుడి రూపాన్ని ఆరాధించేవారి కంటే, రాధ నామాన్ని జపించేవారిపైనే కన్నయ్య అనుగ్రహం త్వరగా లభిస్తుందని నమ్ముతారు.

ఇక రాధాష్టమి ఎందుకు జరుపుకుంటారనే విషయానికి వస్తే.. భాద్రపద శుక్ల అష్టమి రోజు బర్సానా సమీపంలోని రావల్ అనే ఊరిలో వృషభానుడు, కీర్తిదేవి దంపతులకు కమలం పువ్వుపై రాధారాణి అయోనిజగా అంటే తల్లి గర్భం నుంచి కాకుండా స్వయంభూగా లభించిందని పురాణాలు చెబుతాయి. రాధారాణి జన్మించినప్పుడు కళ్లు తెరవలేదట.

కానీ, చిన్ని కృష్ణుడిని ఆమె ముందుకు తీసుకువచ్చిన వెంటనే మొదటిసారి కళ్లు తెరిచి శ్రీకృష్ణుడి ముఖాన్ని దర్శించుకుందని పురాణాలు చెబుతున్నాయి. ఆ పవిత్ర దినాన్ని పురస్కరించుకునే ప్రతి ఏటా రాధాష్టమి(Radha Ashtami)ని వేడుకగా జరుపుకొంటారు.

Radha Ashtami

రాధాష్టమి రోజు అంటే ఈరోజు సెప్టెంబర్ 19న రాధాకృష్ణులకు అభిషేకాలు చేసి, కొత్త వస్త్రాలు, అలంకారాలు సమర్పిస్తారు. ముఖ్యంగా ఈ రోజు శ్రీ రాధారాణిని పూజిస్తే భక్తుల పాపాలు తొలగిపోవడమే కాకుండా, కుటుంబంలో సంతోషం, దాంపత్య జీవితంలో అనురాగం పెరుగుతాయని నమ్ముతారు.

రాధారాణి అనుగ్రహం ఉంటే శ్రీకృష్ణుడి కృప కూడా సులభంగా దక్కుతుందని పండితులు చెబుతుంటారు. శ్రీకృష్ణుడి భక్తిలో తరించాలనుకునే ప్రతి ఒక్కరికీ కూడా రాధాష్టమి(Radha Ashtami) అత్యంత పవిత్రమైన రోజు అని చెప్పొచ్చు.

Constructive Mind Game : బంధం విడిపోవడానికి బ్రేకప్.. మరి కన్‌స్ట్రక్టివ్ మైండ్ గేమ్ గురించి తెలుసా?

Exit mobile version