Vizag
జాబ్ కోసం, కెరీర్‌లో గ్రోత్ కోసం ఇతర రాష్ట్రాలకు, మెట్రో సిటీలకు పరిగెత్తే రోజులకు మెల్లమెల్లగా కాలం చెల్లుతోందని చెబుతున్నాయి కొన్ని రిపోర్టులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే దిగ్గజ కంపెనీలు అడుగుపెడుతుండటంతో ఐటీ, టెక్నాలజీ, ఇండస్ట్రీ సెక్టార్లలో అవకాశాలు ఊహించని రేంజ్‌లో దూసుకుపోతున్నాయి.
ముఖ్యంగా వైజాగ్(Vizag) సిటీ ఇప్పుడు కేవలం టూరిజంకి మాత్రమే కాకుండా, ఉద్యోగ మార్కెట్‌లోనూ దేశంలోనే సెన్సేషన్ క్రియేట్ చేస్తోంది. నాన్-మెట్రో సిటీలలో జాబ్ అవకాశాలు వేగంగా పెరుగుతున్న లిస్టులో విశాఖపట్నం ఏకంగా మొదటి స్థానాన్ని కైవసం చేసుకుని అందరి దృష్టినీ ఆకర్షించింది.
ప్రసిద్ధ ప్రొఫెషనల్ నెట్‌వర్కింగ్ ప్లాట్‌ఫామ్ లింక్డిన్ లేటెస్ట్‌గా రిలీజ్ చేసిన ..సిటీస్ ఆన్ ది రైజ్ 2026 సర్వేలో ఈ ఆసక్తికరమైన నిజాలను బయటపెట్టింది. రెండేళ్లలో నియామకాల వేగం, జాబ్ నోటిఫికేషన్లు, ఉద్యోగుల రాకపోకలను అనాలసిస్ చేసి రూపొందించిన ఈ ర్యాంకింగ్స్‌లో విశాఖపట్నం టాప్‌లో నిలవడం విశేషం.
గూగుల్ ఏఐ హబ్, రిలయన్స్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ వంటి కొత్త భారీ ప్రాజెక్టులతో పాటు ఇన్ఫోసిస్, యాక్సెంచర్, కాగ్నిజెంట్ వంటి గ్లోబల్ టెక్ ఐకాన్స్ ఇక్కడ కొత్త క్యాంపస్‌లను ప్రారంభించడమే ఈ భారీ మార్పుకు అసలైన కారణమని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
ఐటీ, డేటా సెంటర్లతో పాటు ఫార్మా, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్లు కూడా విశాఖపట్నంలో ఉద్యోగాల వరద పారిస్తున్నాయి. డాక్టర్ రెడ్డీస్, లారస్ ల్యాబ్స్ వంటి దిగ్గజ ఫార్మా కంపెనీలు, మిరాకిల్ సాఫ్ట్‌వేర్ వంటి టెక్ కంపెనీలు పెద్ద ఎత్తున రిక్రూట్‌మెంట్లు చేపడుతున్నాయి.
మరోవైపు, వైజాగ్(Vizag)లో దొరికే ఉద్యోగాల్లో సుమారు 17 శాతానికి పైగా వర్క్ ఫ్రమ్ హోమ్ (రిమోట్), మరికొన్ని హైబ్రిడ్ మోడ్‌లోనే ఉండటం విశేషం. ఇక్కడ ఉన్న ప్రశాంతమైన లైఫ్‌స్టైల్, మెరుగైన వసతుల వల్ల ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రతిభావంతులు విశాఖ వైపు అడుగులు వేస్తున్నారు.
ఈ లింక్డిన్ రిపోర్ట్‌లో దేశంలోనే టాప్-10 డెవలపింగ్ నాన్-మెట్రో సిటీలను లెక్కిస్తే.. వైజాగ్ ఫస్ట్ ప్లేస్‌లో నిలవగా, లూధియానా రెండో స్థానంలోనూ, సూరత్ మూడో స్థానంలోనూ నిలిచాయి. ఆ తర్వాత వడోదర, ప్రయాగ్‌రాజ్, రాజ్‌కోట్, జబల్‌పూర్, రాంచీ, రాయ్‌పూర్ సిటీలు ఉన్నాయి.
ఇక విజయవాడ విషయానికి వస్తే, గతంలో మూడో స్థానంలో ఉన్న బెజవాడ ఈసారి పదో స్థానానికి చేరుకుంది. అయినా సరే ఐటీ, ఈ-గవర్నెన్స్ రంగాల ఆసక్తితో విజయవాడ కూడా కొత్త కెరీర్ హబ్‌గా వేగంగా బలపడుతోంది.
మొత్తానికి బెంగళూరు, హైదరాబాద్ వంటి మెట్రో సిటీలకే పరిమితమైన కార్పొరేట్ జాబ్స్ ఇప్పుడు ద్వితీయ శ్రేణి నగరాలకు కూడా వచ్చేస్తుండటం విశేషంగానే చెప్పొచ్చు. యూత్ తమ స్వస్థలాల్లోనే హై ప్రొఫైల్ జాబ్స్ సాధించడానికి, బెటర్ లైఫ్ అచీవ్ చేయడానికి ఇది ఒక గోల్డెన్ ఆపర్చ్యునిటీగా మారుతోందని అనొచ్చు.
