New CEO
టెక్ ప్రపంచంలో ఒక సుదీర్ఘమైన, అత్యంత విజయవంతమైన శకానికి ఇక తెరపడుతోంది. ప్రపంచ ప్రఖ్యాత ఐఫోన్ తయారీ సంస్థ యాపిల్ లీడర్షిప్ బాధ్యతల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. 15 ఏళ్లుగా యాపిల్ కంపెనీని టాప్‌లో నడిపించిన టిమ్ కుక్ తన సీఈఓ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించడం ఇప్పుడు పారిశ్రామిక వర్గాల్లోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కాగా టిమ్ కుక్ స్థానంలో యాపిల్ హార్డ్‌వేర్ ఇంజినీరింగ్ విభాగం సీనియర్ వైస్ ప్రెసిడెంట్‌గా ఉన్న జాన్ టెర్నస్ యాపిల్ కొత్త సీఈఓ(New CEO)గా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ఈ నియామకం సెప్టెంబర్ 1 నుంచి అమలులోకి రానుంది. టిమ్ కుక్ పూర్తిగా కంపెనీని వీడకుండా, ఇకపై ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా కొనసాగుతూ కొత్త సీఈఓకు తన సూచనలు , సలహాలు అందించనున్నారు.
ఇక టిమ్ కుక్ ప్రస్థానం యాపిల్ చరిత్రలోనే ఒక అద్భుతమని చెప్పొచ్చు. 1998లో సంస్థలో చేరిన కుక్, 2011లో స్టీవ్ జాబ్స్ తర్వాత సీఈఓగా బాధ్యతలను చేపట్టారు. టిమ్ కుక్ లీడర్ షిప్‌లో యాపిల్ సాధించిన ఆర్థిక పురోగతి ఊహాతీతం అన్న సంగతి తెలిసిందే.
టిమ్ కుక్ బాధ్యతలు తీసుకున్నప్పుడు యాపిల్ కంపెనీ మార్కెట్ విలువ 350 బిలియన్ డాలర్లు ఉంటే, అది ఈరోజు 4 ట్రిలియన్ డాలర్ల మైలురాయిని చేరుకోవడం వెనుక కుక్ నిరంతర శ్రమ, పట్టుదల,దూరదృష్టి ఉన్నాయి. ఆయన హయాంలోనే యాపిల్ వాచ్, ఎయిర్ ప్యాడ్స్ వంటి విప్లవాత్మక ప్రొడక్ట్స్ మార్కెట్లోకి వచ్చాయి.
కేవలం హార్డ్‌వేర్ మాత్రమే కాకుండా యాపిల్ మ్యూజిక్, యాపిల్ టీవీ , ఐక్లౌడ్ వంటి సేవల ద్వారా ఆదాయ మార్గాలను పెంచడంలో కుక్ విజయాన్ని సాధించారు. ముఖ్యంగా చైనాపై ఆధారపడిన సరఫరా వ్యవస్థను భారత్ వంటి దేశాలకు విస్తరించి ప్రొడక్షన్ ఖర్చు తగ్గించడంలో టిమ్ కుక్ తీసుకున్న నిర్ణయాలు కంపెనీకి ఎంతో మేలు చేశాయి.
ఇక కొత్త సీఈఓగా బాధ్యతలు స్వీకరించబోతున్న జాన్ టెర్నస్ గురించి చెప్పుకోవాలంటే, ఆయన యాపిల్ అంతర్గత వ్యవహారాలపై పూర్తి పట్టున్న వ్యక్తి. 25 ఏళ్లుగా జాన్ యాపిల్ కంపెనీలోని వివిధ కీలక ప్రొడక్ట్స్ అభివృద్ధిలో పాలుపంచుకున్నారు. ఐఫోన్, ఐప్యాడ్, మ్యాక్ వంటి పరికరాల తయారీలో జాన్ ఇంజినీరింగ్ నైపుణ్యం అపారమైనది.
టెర్నస్‌ను ఒక అద్భుతమైన ఆలోచనాపరుడిగా టిమ్ కుక్ స్వయంగా అభివర్ణించారంటేనే జాన్ గురించి అంతా అర్ధం చేసుకోవచ్చు. నాయకత్వ మార్పు ఈజీగా సాగడానికి వేసవి కాలం ముగిసే వరకు కుక్ , టెర్నస్ కలిసి పని చేయనున్నారు. యాపిల్ బోర్డు కూడా టెర్నస్ నాయకత్వంపై పూర్తి విశ్వాసం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయానికి తమ ఆమోదాన్ని తెలిపింది.
అయితే కొత్త సీఈఓ (New CEO)ముందు అనేక సవాళ్లు వేచి ఉన్నాయి. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) రంగంలో విపరీతమైన పోటీ ఉందన్న సంగతి తెలిసిందే. మైక్రోసాఫ్ట్, గూగుల్, ఎన్వీడియా వంటి సంస్థలు ఏఐలో దూసుకుపోతుంటే, యాపిల్ ఈ విషయంలో కొంత వెనుకబడి ఉందనే విమర్శలున్నాయి.
సిరి వంటి వాయిస్ అసిస్టెంట్ సర్వీసులను మెరుగుపరచడం, సొంత ఏఐ మోడల్స్‌ను డెవలప్ చేయడం ఇప్పుడు టెర్నస్ ముందున్న ప్రధాన లక్ష్యాలు. అలాగే స్టీవ్ జాబ్స్ హయాంలో వచ్చిన ఐఫోన్ స్థాయి ఆవిష్కరణలు కుక్ కాలంలో రాలేదనే అసంతృప్తి ఇప్పటికీ కొంతమంది నిపుణుల్లో ఉంది. ఆటోమేటిక్ కార్ల ప్రాజెక్ట్ (Apple Car) ఆగిపోవడం కూడా పెద్ద లోటుగా కనిపిస్తోంది.
భవిష్యత్తులో యాపిల్ మనుగడ అనేది జాన్ టెర్నస్ ఏఐ సవాళ్లను ఎలా ఎదుర్కొంటారనే దానిపైనే పూర్తిగా ఆధారపడి ఉంటుంది. టిమ్ కుక్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్‌గా ఉంటూ ప్రపంచ దేశాల ప్రభుత్వాలతో సంబంధాలను చూసుకుంటే, టెర్నస్ టెక్నాలజీ డెవలప్మెంట్‌పై దృష్టి సారించనున్నారు. వీరిద్దరి కొత్త నాయకత్వ ద్వయం యాపిల్‌ను రాబోయే రోజులలో ఏ స్థాయికి తీసుకెళ్తుందో చూడాలి మరి.
