Corporation Elections
ఉత్తరాంధ్ర ప్రజల ఆరాధ్య దైవమైన శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం సమయంలో.. రాజకీయ వర్గాలలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. విజయనగరం కార్పొరేషన్ ఎలక్షన్(Corporation Elections) పోలింగ్ తేదీలో కీలకమైన మార్పు చేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషన్ అఫీషియల్‌గా పర్మిషన్ ఇచ్చింది.
ఏపీ వ్యాప్తంగా మిగిలిన మున్సిపాలిటీలతో పాటు ఇక్కడ కూడా అక్టోబర్ 28వ తేదీనే పోలింగ్ జరగాల్సి ఉంది. అయితే శ్రీ పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవం పండుగ రద్దీ.. పరిపాలనాపరమైన ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి చేసిన విజ్ఞప్తి మేరకు పోలింగ్‌ను 29వ తేదీకి మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.
అమ్మవారి సిరిమానోత్సవం అక్టోబర్ 27వ తేదీన అట్టహాసంగా జరగనుంది. ఈ చారిత్రక వేడుకను తిలకించడానికి ఏపీ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు పోటెత్తుతారు. ఉత్సవం ముగిసిన మరుసటి రోజే అంటే అక్టోబర్ 28న మున్సిపల్ ఎన్నికలను నిర్వహించడం పోలీసు యంత్రాంగానికి, అధికారులకు కత్తిమీద సాములా మారే అవకాశం ఉంటుంది.
భద్రతా ఏర్పాట్లు, ఎలక్షన్ నిర్వహణ ఒకేసారి చేయడం ఆచరణలో చాలా కష్టమవుతుందనే వాస్తవాలను కలెక్టర్ రాంసుందర్ రెడ్డి ఎస్ఈసీ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ లెటర్‌పై సానుకూలంగా స్పందించిన ఎన్నికల సంఘం అధికారులు..యంత్రాంగానికి తగినంత సమయాన్ని ఇస్తూ పోలింగ్‌ను 29వ తేదీకి మార్చారు.
అయితే ఏపీ వ్యాప్తంగా ఎలక్షన్స్ జరుగుతున్న ఇతర కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో మాత్రం ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం అక్టోబర్ 28వ తేదీన పోలింగ్ ఎప్పటిలాగే జరుగుతుంది. పోలింగ్ తేదీ ఒకరోజు మారినా కూడా, కౌంటింగ్ తేదీలో మాత్రం ఎలాంటి మార్పు లేదని, మిగతా మున్సిపాలిటీలతో పాటే అక్టోబర్ 30వ తేదీనే కౌంటింగ్ జరుగుతుందని కలెక్టర్ క్లారటీ ఇచ్చారు.
ఇదిలా ఉంటే, మున్సిపల్ ఎన్నికల(Corporation Elections) కోడ్ అమల్లో ఉండటంతో పాటు అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటం వల్ల ఈ ఏడాది ప్రతిష్టాత్మకంగా జరగాల్సిన విజయనగరం ఉత్సవాలను మాత్రం అధికారికంగా రద్దు చేశారు.
