Gold :మళ్లీ తగ్గిన బంగారం ధరలు.. ఇంకా తగ్గుతాయా?

Gold : అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా స్థిరంగా కొనసాగించడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక ముఖ్య కారణంగా నిపుణులు అంటున్నారు.

Gold

కొద్ది రోజులుగా బంగారం ధరలు ఏరోజుకారోజు సరికొత్త రికార్డుల వైపు పరుగులు పెడుతూనే ఉన్నాయి. ఆ మధ్య అయితే తులం బంగారం 2 లక్షల రూపాయల మార్కుకు కూడా చేరువైన సంగతి తెలిసిందే. అయితే, ఈ మధ్య మార్కెట్ పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. ఉగాది రోజు అయితే బంగారం ధరల్లో ఊహించని పతనం కనిపించింది.

అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు బంగారం(Gold) ధర భారీగా తగ్గిపోవడంతో, దేశీయంగా కూడా తులం బంగారంపై ఒక్కరోజే 8 వేల రూపాయలకు పైగా ధర తగ్గడంతో కొనుగోలుదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్యూర్ బంగారం(Gold) ధర 1.50 లక్షల రూపాయల స్థాయికి చేరుకుంది.

ముఖ్యంగా అంతర్జాతీయ పరిణామాలే ఈ భారీ పతనానికి కారణమవుతున్నాయి. పశ్చిమాసియాలో యుద్దం వల్ల నెలకొన్న ఉద్రిక్తతల వల్ల చమురు ధరలు పెరగడం, దీని ద్వారా ద్రవ్యోల్బణంపై ఆందోళనలు వ్యక్తమవ్వడం ఇన్వెస్టర్లపై ఎఫెక్ట్ చూపించింది.

దీనికి తోడు అమెరికా డాలర్ విలువ బలపడటం, అక్కడి ట్రెజరీ బాండ్లపై వడ్డీ రేట్లు ఆకర్షణీయంగా ఉండటంతో ఇన్వెస్టర్లు బంగారం నుంచి తమ పెట్టుబడులను మళ్లించి ఇతర మార్గాలను ఎంచుకుంటున్నారు. అలాగే అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా స్థిరంగా కొనసాగించడం కూడా బంగారం ధరలు తగ్గడానికి ఒక ముఖ్య కారణంగా నిపుణులు అంటున్నారు.

Gold

వెండి ధరల విషయంలో కూడా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అంతర్జాతీయంగా వెండి ధర ఔన్సుకు ఐదు డాలర్లు తగ్గడంతో, దేశీయ మార్కెట్‌లో కిలో వెండి ధర దాదాపు 16 వేల రూపాయల వరకు పడిపోయింది. ప్రస్తుతం కిలో వెండి ధర 2,37,210 రూపాయల వద్ద కొనసాగుతోంది.

మార్కెట్ నిపుణుల విశ్లేషణ ప్రకారం, డాలర్ ఇలాగే బలంగా కొనసాగితే రాబోయే రోజుల్లో గోల్డ్ ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది. పరిస్థితి ఇలాగే ఉంటే తులం పసిడి లక్ష రూపాయల స్థాయికి కూడా పడిపోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. అయితే, దీర్ఘకాలిక పెట్టుబడులను బట్టి చూస్తే మాత్రం గోల్డ్ మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. సామాన్యులకు మళ్లీ పుత్తడి అందుబాటులోకి రావడమనేది ఒక శుభ పరిణామంగా చెప్పొచ్చు.

మరిన్ని బిజినెస్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version