Maharashtra
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహారాష్ట్రకు(Maharashtra) చెందిన 19 ఏళ్ల కుర్రాడి లైంగిక వేధింపుల కేసులో పోలీసులు దర్యాప్తు వేగవంతం చేశారు. ఈ కేసు విచారణలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.పరాట్వాడా పట్టణానికి చెందిన అయాజ్ 180 మంది అమ్మాయిలను లైంగికంగా వేధించి , వారి వీడియోలను రహస్యంగా రికార్డు చేసినట్టు గుర్తించారు.
దాదాపు 350 వీడియోలను పోలీసులు గుర్తించారు. వాట్సాప్, స్నాప్ చాట్, ఇన్ స్టాగ్రామ్ లను ఉపయోగించుకుని అమ్మాయిలను టార్గెట్ చేసినట్టు గుర్తించారు. ముఖ్యంగా టీనేజ్ అమ్మాయిలే టార్గెట్ గా అయాజ్ తన ఉన్మాద చర్యలను కొనసాగించాడు. వారిని ట్రాప్ చేసి ముంబై, పుణె నగరాలకు తీసుకెళ్లేవాడని గుర్తించారు.
అక్కడ నగరమంతా తిప్పి , బస చేసే హోటల్ గదిలో వారిపై అకృత్యాలకు పాల్పడినట్టు పోలీసులు తెలిపారు. ఆ తతంగాన్ని వాళ్లకు తెలియకుండా రికార్డు చేసేవాడని, తర్వాత వాటితో బెదిరింపులకు పాల్పడినట్టు వెల్లడించారు. కొందరిని డబ్బు డిమాండ్ చేయడం, మరికొందరిని వ్యభిచారంలోకి దింపి డబ్బులు తీసుకునేవాడని పోలీసులు విచారణలో తేల్చారు. టీనేజ్ అమ్మాయిలు కావడం, ఇంట్లో చెబితే పరువు పోతుందని ఎవ్వరూ నోరు విప్పేవారు కాదనీ, ఇది చూసుకుని అయాజ్ మరింత రెచ్చిపోయినట్టు గుర్తించారు.
చాలా మంది అమ్మాయిలతో అయాజ్ సన్నిహితంగా ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో చూసి స్థానిక బీజేపీ ఎంపి అనిల్ బోండే అనుమానంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు లోతుగా దర్యాప్తు చేస్తే అయాజ్ గలీజు దందా బయపడింది. మరోవైపు అయాజ్ కు కోర్టు రిమాండ్ విధించింది.
అయితే నిందితుడి వ్యవహారం రాజకీయ రంగు పులుముకుంది. అయాజ్ కు అసదుద్దీన్ ఒవైసీ ఎంఐఎం పార్టీతో సంబంధాలున్నట్టు అక్కడి బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. గతంలో ఎంఐఎం కోసం ప్రచార కార్యక్రమాల్లోనూ పాల్గొన్నాడని చెబుతున్నారు. దీనిపై పోలీసులు ఆచితూచి స్పందించారు. దర్యాప్తు జరుగుతోందని, ఆధారాలు దొరికిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
ఇదిలా ఉంటే నిందితుడిపై మహారాష్ట్ర ప్రభుత్వం బుల్డోజర్ ట్రీట్ మెంట్ చర్యలు తీసుకుంది. అయాజ్ ఇంటిని స్థానిక మున్సిపల్ అధికారులు కూల్చేశారు. అక్రమ నిర్మాణంగా తేలిన నేపథ్యంలో భారీ బందోబస్తు మధ్య కూల్చివేతలు పూర్తి చేశారు. కాగా ఈ లైంగిక వేధింపుల కేసులో.. పోలీసులు అయాజ్ ఫ్రెండ్ ఉజర్ ఖాన్‌తో సహా పలువురిని అరెస్టు చేశారు.
