Hyderabad : హైదరాబాద్ డ్రగ్స్ నెట్‌వర్క్..సినిమా లింకులు, గోవా సీక్రెట్స్

Hyderabad : సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమందికి కూడా ఈ డ్రగ్స్ అమ్మినట్లు ఈగల్ ఫోర్స్ విచారణలో బయటకు రావడం పెద్ద దుమారాన్ని రేపుతోంది

Hyderabad

హైదరాబాద్‌లో రాత్రి వేళ వెలిగిపోయే కలర్‌ఫుల్ వరల్డ్ వెనుక, చీకటి డ్రగ్స్ మాఫియా ఎంతగా పాతుకుని పోయిందో ఊహించడం ఎవరికైనా కష్టమే. పోలీసులు ఉచ్చు బిగిస్తున్నా, కొత్తకొత్త రూట్లను ఎంచుకుంటూ దూసుకొస్తున్న ఈ మాదకద్రవ్యాల ముఠాలను ఏరిపారేయడానికి తాజాగా తెలంగాణలో ఈగల్ ఫోర్స్ రంగంలోకి దిగింది.

ఈగల్ ఫోర్స్ చేపట్టిన ఈ మెరుపుదాడులు తెలంగాణలో ఈ డ్రగ్స్ సమస్య ఎంత లోతుగా పాతుకుపోయిందో మరోసారి కళ్లకద్దినట్లు చూపించాయి. హైదరాబాద్(Hyderabad), సైబరాబాద్‌తో పాటు మల్కాజిగిరి, ఫ్యూచర్ సిటీ కమిషనరేట్లు అలాగే మహబూబ్‌నగర్, నిజామాబాద్ జిల్లాల్లో కూడా ఏకకాలంలో దాడులు జరిపి 19 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు.

వీరిలో 14 మంది గంజాయి వాడుతున్నట్లు తేలగా, మరొకరికి గంజాయితో పాటు ఇతర డ్రగ్స్ కూడా పాజిటివ్‌గా తేలడం సంచలనాన్ని రేపింది. ఈ ఆపరేషన్ ద్వారా కొంతమందిని జైల్లో పెట్టడం కాదు, అసలు డ్రగ్స్ సప్లై అయ్యే దారిని పూర్తిగా కట్ చేయడమే లక్ష్యంగా సాగినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే ఇక్కడ అందరినీ వేధిస్తున్న ప్రధాన ప్రశ్న ఒక్కటే.. పోలీసులు దాడులు చేస్తున్నా, కేసులు పెడుతున్నా అసలు డ్రగ్స్ ఎందుకు తగ్గడం లేదు అనే.

పట్టుబడిన వారిలో ఎక్కువ మంది గంజాయి, డ్రగ్స్ వాడుతున్న వారే కావడంతో, పోలీసులు వారి పేరెంట్స్‌ను పిలిపించి, వ్యసనం నుంచి బయటపడేసే డీ-అడిక్షన్ సెంటర్లకు నిందితులను పంపించారు.

అయితే ఈగల్ ఫోర్స్ విచారణలో .. గోవాలోని వగటోర్ బీచ్ ఏరియాలో ఉన్న ఒక హాస్టల్‌ను మెయిన్ సెంటర్‌గా చేసుకుని కొకైన్, ఎండీఎంఏ, ఎల్‌ఎస్‌డీ, హ్యాష్ ఆయిల్ వంటి డేంజర్ డ్రగ్స్ హైదరాబాద్‌(Hyderabad)కు సప్లై అవుతున్నట్లు తేలింది.

బెంగళూరు, గోవా ప్రాంతాల నుంచే హైదరాబాద్‌(Hyderabad)కు ఈ డ్రగ్స్ రవాణా జరుగుతున్నట్లు ఈగల్ ఫోర్స్ తేల్చింది. కేవలం టెక్నికల్ అనాలిసిస్ ద్వారానే డ్రగ్స్ వాడుతున్న వారిని ఐడెంటిఫై చేశారంటే.. ఈ డ్రగ్స్ నెట్‌వర్క్ ఎంతలా విస్తరించిందో అర్థం చేసుకోవచ్చు.

ఇదే సమయంలో సినీ ఇండస్ట్రీకి చెందిన కొంతమందికి కూడా ఈ డ్రగ్స్ అమ్మినట్లు ఈగల్ ఫోర్స్ విచారణలో బయటకు రావడం పెద్ద దుమారాన్ని రేపుతోంది. అందులో ఎవరు డ్రగ్స్ వాడుతున్నారు, ఎవరు మధ్యవర్తులుగా ఉన్నారు, మెయిన్ పెడ్లర్లు ఎవరనేది చట్టబద్ధంగా నిరూపణ కావాల్సి ఉంది.

అసలు ఇన్ని జాగ్రత్తలు తీసుకున్నా డ్రగ్స్ ఎందుకు ఆగడం లేదనే ప్రశ్నకు 3 ముఖ్యమైన కారణాలున్నాయి. మొదటిది, ఈ ముఠాలు ఏవైనా సరే ఒక పెద్ద గ్యాంగ్‌లా కాకుండా..ఎక్కడికక్కడ చిన్న చిన్న యూనిట్లుగా విడిపోయి పని చేస్తుంటాయి. ఒక పెడ్లర్‌ను పట్టుకుంటే ఆ ప్లేస్‌లోకి వెంటనే ఇంకొక కొత్త వ్యక్తి వచ్చేస్తాడు.

డిజిటల్ పేమెంట్స్ , కమ్యూనికేషన్ అనేది రెండోది. ఈ కేసులో డ్రగ్స్ కొనుగోలు కోసం వాడుతున్నవారు.. చక్రపాణి, హర్షిత్ రెడ్డి అనే పేర్లతో ఉన్న బ్యాంక్ అకౌంట్లకు రూ. 3.13 లక్షలకు పైగా బదిలీ చేసినట్లు అధికారులు గుర్తించారు.

మార్కెట్లో వీటికి డిమాండ్ తగ్గకపోవడం మూడో కారణం. డ్రగ్స్ కొనేవాళ్లు ఉన్నంత కాలం.. సప్లై చేసేవాళ్లు వేరు వేరు మార్గాల ద్వారా మార్కెట్‌ను తిరిగి తయారు చేసుకుంటూనే ఉంటారు.

నిజానికి వినియోగదారుడిని పట్టుకోవడం ఈజీనే కానీ, ఆ సప్లై చైన్‌లో పైస్థాయిలో ఉన్న కింగ్‌పిన్‌లను పట్టుకోవాలంటే మాత్రం ఫోన్ డేటా, డిజిటల్ పేమెంట్స్, హోటల్ ,హాస్టల్ బుకింగ్స్,ట్రావెల్ రికార్డులు, సీసీటీవీ ఫుటేజ్, బ్యాంక్ ట్రైల్ వంటి అన్ని సాక్ష్యాలన్నిటినీ లింక్ చేసి కోర్టులో నిరూపించాల్సి ఉంటుంది.

Hyderabad

పైగా పెద్ద నెట్‌వర్క్‌ల లీడర్లెవరూ డైరెక్టుగా డ్రగ్స్ పట్టుకుని తిరగరు, అంతా మిడిల్ మెన్ , డిజిటల్ కాంటాక్ట్స్ ద్వారానే ఈ తతంగాన్ని నడిపిస్తారు. అందుకే పైస్థాయి వ్యక్తులపై ఇలాంటి కేసు పెట్టడానికి చాలా టైమ్ పడుతుంది.

కేవలం కేసులు పెట్టడం , అరెస్టులు చేయడం మాత్రమే సరిపోదు. పోలీసుల దాడులతో పాటు అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్, స్కూల్స్ , కాలేజీల్లో నిఘా, ఫైనాన్షియల్ ట్రాకింగ్ వంటి ప్లాన్స్‌ను స్ట్రిక్ట్‌గా అమలు చేయాలి.

అయితే డ్రగ్స్ , గంజాయి వినియోగదారులను శిక్షించడం కంటే వారిని ట్రీట్‌మెంట్ వైపు తీసుకువెళ్లడమే మంచిదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

NCPI:నాడు అనామక పార్టీ..నేడు దేశ రాజకీయాల్లో కింగ్‌మేకర్ ఎలా అయింది?

Exit mobile version