Mangli
తెలంగాణ జానపద గీతాలతో పాపులర్ అయిన ప్రముఖ గాయని మంగ్లీ(Mangli )వివాదంలో చిక్కుకున్నారు. రూ.10 కోట్ల మేర ఆర్థిక మోసానికి పాల్పడ్డారంటూ, అడిగితే బెదిరిస్తున్నారని ఒక న్యాయవాది పోలీసులకు ఫిర్యాదు చేశారు. మంగ్లీ(Mangli), ఆమె సోదరుడు, కొందరు అనుచరులు కలిసి దాదాపు 150 మంది దగ్గర అధిక వడ్డీ ఇస్తామని చెప్పి రూ.10 కోట్ల వరకూ వసూలు చేసినట్టు ఆరోపణలున్నాయి.
వడ్డీ ఇవ్వకపోగా, అసలు డబ్బులు కూడా ఇచ్చేందుకు నిరాకరించడంతో బాధితుల్లో ఆందోళన మొదలైంది. దీనికి సంబంధించి సదరు బాధితులు న్యాయవాది సుబ్బారావును కలిసారు. ఆయన మంగ్లీ సోదరుడికి ఫోన్ చేసి నిలదీయగా బెదిరింపులకు పాల్పడినట్టు తెలుస్తోంది.
తనను దుర్భాషలాడడమే కాకుండా యాక్సిడెంట్ చేసి చంపేస్తామని బెదిరించినట్టు న్యాయవాది సుబ్బారావు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని ఆయన ఫిర్యాదులో పేర్కొనడంతో పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు. మంగ్లీ, ఆమె సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఉడుగులపై క్రిమినల్ కేసు నమోదైంది.
మంగ్లీ సోదరుడు శివ, డైరెక్టర్ వేణు ఉడుగుల తీవ్రంగా బెదిరించారని, తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని న్యాయవాది ఫిర్యాదులో పేర్కొన్నారు. ప్రాథమిక విచారణ అనంతరం సుబ్బారావు ఫిర్యాదుతో పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తనకు ప్రాణహాని ఉందని సుబ్బారావు పోలీసులను ఆశ్రయించగా బీఎన్ఎస్ సెక్షన్ 351(2), 352 కింద కేసు నమోదు చేశారు.
దీనిపై మంగ్ల వర్గం ఇంకా స్పందించలేదు. నిజానికి జానపద గేయాలతో బాగా పాపులర్ అయిన మంగ్లీ తర్వాత సినిమా ఇండస్ట్రీలో మంచి గాయనిగా ఎదిగారు. అయితే అప్పుడప్పుడు కొన్ని వివాదాలతో చిక్కుకోవడం ఆందోళన కలిగిస్తోంది. గత ఏడాది చివర్లో ఒక రేవ్ పార్టీ సందర్భంగా మంగ్లీ పేరు కూడా వినిపించింది.
తర్వాత తాను ఎలాంటి తప్పు చేయలేదని ఆమె వీడియో కూడా విడుదల చేసింది. ఇప్పుడు కోట్లాది రూపాయలు వసూలు చేసి మోసానికి పాల్పడినట్టు వస్తున్న ఆరోపణలు ఆమె అభిమానులను కలవరపెడుతున్నాయి. ప్రస్తుతం కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నిజంగానే అక్రమంగా డబ్బులు వసూలు చేసారా.. బెదిరింపులకు పాల్పడ్డారా వంటి అంశాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Legs Crossed : కాలు మీద కాలు వేసుకుని కూర్చుంటున్నారా? సైన్స్ ఏం చెబుతుంది? సైకాలజీ ఏం చెబుతుంది?
