Bigg Boss Family Week
బిగ్ బాస్ హౌస్‌లో దీపావళి తర్వాత నుంచి ఫ్యామిలీ వీక్(Bigg Boss Family Week) నడుస్తుండటంతో వాతావరణం ఆహ్లాదకరంగా అలాగే ఎంతో ఎమోషనల్‌గా మారింది. కంటెస్టెంట్ల ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌస్‌లోకి అడుగుపెడుతూ తమ వారిని ఆప్యాయంగా కలుసుకుంటున్నారు.
మరోవైపు కంటెస్టెంట్లు కూడా బిగ్ బాస్ స్కూల్ స్కిట్‌తో సందడి చేస్తూ ఆడియన్స్‌కు కావలసినంత వినోదాన్ని అందిస్తున్నారు. కాగా గురువారం ఎపిసోడ్లో ముందుగా జబర్దస్త్ రాం ప్రసాద్ కుటుంబ సభ్యులు హౌస్‌లోకి వచ్చి సందడి చేశారు. రాం ప్రసాద్ కూతురు తన ఆటపాటలతో కంటెస్టెంట్లను బాగా ఆకట్టుకుంది.
ఇక ఈ ఎపిసోడ్లో అసలైన ఎమోషనల్ హైలైట్ ఏంటంటే.. సుధీర్ తల్లి ఎంట్రీ. మొదట సుధీర్ మదర్ పంపించిన కమ్మటి వంటకాలను ముందుగా బిగ్ బాస్ హౌస్‌లోకి పంపారు. అయితే ఆ ఫుడ్ ఎవరి ఇంట నుంచి వచ్చిందో మాత్రం చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేశారు.
కానీ తన తల్లి చేతి వంటను గుర్తుపట్టిన సుధీర్..ఈ ఫుడ్ కచ్చితంగా మా ఇంటి నుంచే వచ్చింది బిగ్ బాస్.. ఈ రుచి మా అమ్మది. నాకోసం ఫుడ్ పంపించి మా అమ్మని గుర్తు చేసినందుకు థాంక్యూ అని చెబుతూ భావోద్వేగానికి గురయ్యాడు.
ఆ వెంటనే సుధీర్ తల్లి హౌస్‌లోకి అడుగుపెట్టి తన కొడుకుని చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు. గతంలో సుధీర్ కాలికి గాయమవ్వడంతో, ఆ కాలు చూసి బాగానే ఉందా అని ఆరా తీసి.. తర్వాత తన కొడుక్కి ఎంతో ప్రేమగా గోరుముద్దలు తినిపించారు.
దీని తర్వాత హౌస్‌మేట్స్‌ను పరిచయం చేస్తానన్న సుధీర్‌తో.. అందరి పేర్లు తానే చెప్తానని అన్నారు. డ్యాన్స్ కొరియోగ్రాఫర్ నీతూ మాస్టర్ని చూసి.. మా వాడు డ్యాన్స్‌లో ఎప్పుడూ లాస్ట్లోనే ఉంటాడు.. కొంచెం ముందుకు తెచ్చి మంచి స్టెప్పులు నేర్పించండని కోరారు.
అంతేకాదు తన కొడుక్కి సుధీర్ రెడ్డి అని పేరు పెట్టుకుంటే, హౌస్ మేట్స్ అంతా జిగా జిగా అంటున్నారేంటి? అంటూ ఆమె వేసిన పంచ్‌లకు అంతా పొట్టచెక్కలయ్యేలా నవ్వుకున్నారు. బిగ్ బాస్ కూడా మీ ఇంట్లో ఉన్న సుధీర్‌కి, ఇక్కడి సుధీర్‌కి తేడా ఏంటని ఆమెను అడగ్గా.. జిగా సామీ అంటూ ఫన్నీగా ఆన్సర్ చెప్పారు.
మొత్తంగా సుధీర్ తల్లి రాక అతనికి కొండంత కాన్ఫిడెన్స్‌ను నింపడమే కాక.. ఆమె అమాయకత్వం, స్వచ్ఛమైన నవ్వు, ప్రేమ ఆడియన్స్‌తో పాటు హౌస్‌లోని సభ్యుల మనసులను గెలుచుకున్నాయనే చెప్పాలి.
