Karthika Masam Rules
హిందూ ధార్మిక సంప్రదాయాల్లో కార్తీక మాసానికి అత్యంత విశిష్టమైన స్థానం ఉందన్న విషయం తెలిసిందే . ఈ పవిత్ర నెలంతా ఆధ్యాత్మిక చింతనతో గడపడం, ప్రత్యేక కార్తీక మాస పూజలు చేయడం ఆచారంగా వస్తోంది. అయితే ఈ మాసం రోజులు మన బాడీని, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి మన పెద్దలు కొన్ని ప్రత్యేక నియమాలతో పాటు ఆహారపు అలవాట్లను సూచించారు. వీటిని సరిగ్గా పాటిస్తే ఆధ్యాత్మిక ఫలంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా చేకూరుతుంది.
నాన్ వెజ్, మద్యపానం వంటి వాటికి కార్తీక మాసంలో నెలంతా పూర్తిగా దూరంగా ఉండాలని పెద్దలు చెబుతుంటారు. చాలా కుటుంబాల్లో ఈ మాసమంతా ఉల్లి, వెల్లుల్లి కూడా వంటకాల్లో ఉపయోగించకుండా పూర్తిగా సాత్విక భోజనం మాత్రమే స్వీకరిస్తారు. సీజన్ మారుతున్న ఈ టైమ్లో సాత్విక ఆహారం తీసుకోవడం ద్వారా జీర్ణవ్యవస్థ మెరుగుపడటంతో పాటు బాడీ తేలికగా ఉంటుంది. అలాగే మాట్లాడే విషయంలో ఎంతో జాగ్రత్తలు పాటించడం చాలా ముఖ్యం. ఇతరులను నొప్పించే కఠినమైన పదాలు మాట్లాడకుండా ఉండాలి. అలాగే అనవసరమైన కోపం, ఈర్ష్య, ద్వేషాలకు దూరంగా ఉండటం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుంది.
అయితే ఈ నెలలో ఉపవాసాల పేరుతో శరీరాన్ని నీరసంగా తయారుచేసి చేతులారా ఆరోగ్యాన్ని ప్రమాదంలో పడేయకూడదని వైద్యులు, పెద్దలు చెబుతున్నారు. ఎవరి బాడీ కెపాసిటీని బట్టి వారు సులభమైన పద్ధతిలో నిష్టను పాటించాలి. ముఖ్యంగా అనారోగ్య సమస్యలున్నవారు ఎలాంటి కఠిన ఉపవాసాలు చేయకుండా, డాక్టర్ల సలహాతో తగిన ఆహార నియమాలు పాటించడం మంచిది.
ఇక ఈ మాసంలో సాయంత్రం సమయాల్లో ఇళ్లలో, దేవాలయాల్లో దీపాలు వెలిగించే ఆచారం చాలామందిలో ఉంటుంది. అయితే దీపారాధన సమయంలో చిన్నపిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండటం అత్యంత అవసరం. ఈ నిష్టలు, ఆచారాలు ప్రాంతాలు, కుటుంబ సంప్రదాయాలను బట్టి కొద్దిగా మారుతూ ఉంటాయి. ఏది ఏమైనా శరీరాన్ని, మనసును అదుపులో ఉంచుకోవడానికి, జీవనశైలిని మెరుగుపరచుకోవడానికి కార్తీక మాస నియమాలు(Karthika Masam Rules) ప్రతీ ఒక్కిరికీ ఎంతగానో సహాయపడతాయి.
