Director Bharathiraja
భారతీయ చిత్రరంగంలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ దర్శకుడు భారతీరాజా(Director Bharathiraja) కన్నుమూశారు. గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. గత కొన్ని నెలలుగా ఆయన నడవలేని స్థితిలో వీల్ ఛైర్ కే పరిమితమయ్యారు.
ఇటీవల ప్రముఖ నటి రాధిక ఆయనను పరామర్శించి వీడియోను పోస్ట్ చేయగా వీల్ ఛైర్ లో గుర్తుపట్టలేని విధంగా కనిపించారు. గత ఏడాది ఆయన కుమారుడు మనోజ్ చనిపోవడంతో తీవ్రంగా కృంగిపోయారు. ఈ కారణంగానే దాదాపు మూడు నెలల పాటు అనారోగ్యం బారిన పడి హాస్పిటల్ లో చికిత్స తీసుకున్నారు. కోలుకుని తిరిగి వచ్చినప్పటి నుంచి వీల్ ఛైర్ లోనే గడుపుతున్నారు.
గత మూడు రోజులుగా వృధ్యాప్య సమస్యలు ఎక్కువవడంతో ఆసుపత్రిలో చేరారు. అనారోగ్య సమస్యలు తీవ్రమై చికిత్స పొందుతూ కన్నుమూశారు. భారతీయ చిత్రపరిశ్రమ గర్వించదగిన దర్శకుల్లో భారతీరాజా ఒకరు. సహజత్వానికి దగ్గరగా ఆయన తీసిన సినిమాలు ప్రేక్షకులను అలరించాయి. భారతీరాజా అసలు పేరు చిన్నసామి.
1941 జూలై 17న తమిళనాడులో జన్మించారు. థియేటర్ నేపథ్యంతో సినీ రంగంలోకి అడుగుపెట్టిన ఆయన.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా కెరీర్ మొదలుపెట్టారు. 1977లో విడుదలైన 16 వయతినిలే సినిమాతో రాజా దర్శకుడిగా అరంగేట్రం చేశారు. తమిళ సినిమాకు కొత్త యుగాన్ని తెచ్చిపెట్టిన ఈ చిత్రం కమల్ హాసన్, రజనీకాంత్ కెరీర్ ను మలుపు తిప్పింది.
దర్శకుడిగా ఎంతోమంది నటీనటులను చిత్రపరిశ్రమకు పరిచయం చేసిన ఘనత ఆయన సొంతం. రాధిక, రేవతి, రాధ, ముచ్చర్ల అరుణ, కార్తీక్ వంటి నటులను భారతీరాజానే పరిచయం చేశారు. నటుల నుంచి సహజమైన నటనను రాబట్టుకోవడంలో భారతీరాజాని మించినవారు లేరనే పేరుంది. కాగా భారతీరాజా ఎక్కువ శాతం తమిళ చిత్రాలకే దర్శకత్వం వహించగా అవి తెలుగులో కూడా రీమేక్ అయ్యాయి.
సీతాకోక చిలుక, ఆరాధన, కొత్త జీవితాలు, జమదగ్ని వంటి సినిమాలను స్ట్రెయిట్ గా తెలుగులో తీసి విశేష గుర్తింపు పొందారు. అలాగే ఆయన దగ్గర సహాయ దర్శకులుగా పనిచేసిన ఎంతో మంది విజయవంతమైన దర్శకులుగా మారారు. తెలుగులో సీనియర్ దర్శకుడు వంశీ, భారతీరాజా దగ్గర పనిచేసిన వారే.
గతంలో వర్ణ వివక్షను ఎదుర్కొని చిత్రసీమలో నిలదొక్కుకున్న భారతీరాజా(Director Bharathiraja) తక్కువ సమయంలోనే దేశం గర్వించే దర్శకుడిగా అత్యున్నత స్థాయికి ఎదిగారు. కొన్నాళ్ల క్రితం దర్శకత్వం నుంచి తప్పుకున్న ఆయన ఆ తర్వాత నటుడిగా పలు చిత్రాల్లో కనిపించారు.
Seethamma : సీతమ్మ కన్నీటి గాథకు సజీవ సాక్ష్యం.. కాశీ యాత్రకు వెళ్లేవారు తప్పక చూడాల్సిన క్షేత్రం
