Dharmendra Pradhan Resigned
నీట్ పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి సంచలన పరిణామం చోటు చేసుకుంది. నీట్ పరీక్షల అవకతవకలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేశారు(Dharmendra Pradhan Resigned). కొద్దిసేపటి క్రితం తన రాజీనామా లేఖను ప్రధాని నరేంద్రమోదీకి పంపించారు. దీంతో కాక్రోచ్ జనతా పార్టీ చేస్తున్న పోరాటం ఫలించినట్టయింది.
నిన్న కేంద్రం తరఫున మంత్రులు జేపీ నడ్డా, జితేందర్ సింగ్‌లతో చర్చించినప్పుడు సీజేపీ ప్రతినిధులు తమ ప్రధాన డిమాండ్లలో అన్నీ అంగీకరించాల్సిందేనని తేల్చిచెప్పారు. ముఖ్యంగా నీట్ పేపర్ లీకేజీకి నైతిక బాధ్యత వహిస్తూ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో అస్సలు వెనక్కి తగ్గేదే లేదని స్పష్టం చేశారు.
నెల రోజుల క్రితమే ఈ పోరాటం మొదలుపెట్టిన సీజేపీ వారం రోజులుగా తమ ఉద్యమాన్నిఉధృతం చేసింది. సీజేపీ పిలుపుతో విద్యార్థులు, నిరుద్యోగులు ఢిల్లీకి భారీగా తరలివచ్చారు. జంతర్ మంతర్ దగ్గర, అనంతరం పార్లమెంట్ మార్చ్‌లోనూ పాల్గొని భారీ ఎత్తున నిరసనలో పాల్గొనగా.. నిరసనకారులపై లాఠీఛార్జ్ కూడా జరిగింది. అటు ప్రతిపక్షాలు సైతం నిరసన తెలిపాయి. మరోవైపు పర్యావరణ నేత్త వాంగ్‌చుక్ సైతం నిరాహారదీక్షకు దిగారు. ఆయన దీక్ష విరమించినా సీజేపీ మాత్రం తమ ఆందోళనను కొనసాగించింది.
చివరికి జాతీయ మీడియా, సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా సీజేపీ నిరసనల తీవ్రతే కనిపించింది. క్రమంగా ఇది తమ ప్రభుత్వానికి మచ్చలా మారిపోతుందని గ్రహించిన బీజేపీ అగ్రనాయకత్వం ఎమర్జెన్సీ కేబినెట్ సమావేశం నిర్వహించి చర్చించింది. అయితే రాజీనామా డిమాండ్ కు అంగీకరించకూడదని చాలా వరకూ కేంద్రం పట్టుదల కనబరిచింది. అయితే సీజేపీ తమ ఉద్యమాన్ని తీవ్రతరం చేయనున్నట్టు ప్రకటించింది.
ఇవాళ మధ్యాహ్నం 3 గంటల లోపు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డెడ్ లైన్ విధించింది. రాజీనామా చేయకుంటే మరుసటి క్షణం నుంచే నిరసనలు తీవ్రస్థాయిలో ఉంటాయంటూ హెచ్చరించింది. దీంతో కేంద్రం దిగిరాక తప్పలేదు.
సీజేపీ విధించిన డెడ్‌లైన్‌కు అరగంటకు ముందు ధర్మేంద్ర ప్రధాన్ తన రాజీనామా లేఖను సమర్పించారు.
దీంతో కాక్రోచ్ జనతా పార్టీకి చారిత్రక విజయం దక్కినట్టయింది. అలాగే మిగిలిన డిమాండ్లను సైతం కేంద్రం దృష్టికి తీసుకెళ్లింది. నీట్ పేపర్ నిర్వహణను కఠినతరం చేయడం, పేపర్ లీకేజీ ఘటనలో ఆత్మహత్య చేసుకున్న కుటుంబాలకు నష్టపరిహారం వంటివి కేంద్రం అమలు చేయాల్సి ఉంది. అటు ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో జంతర్ మంతర్ దగ్గర సీజేపీ సంబరాలు చేసుకుంది.
