Tablet Splitting
మనకు ఫీవర్, జలుబు లేదా మరేదైనా హెల్త్ బాగోలేనపుడు .. డాక్టర్లు రాసిచ్చిన టాబ్లెట్లు వేసుకుంటూ ఉంటాం. అలాంటి సందర్భాల్లో కొన్ని టాబ్లెట్స్‌కు సెంటర్లో ఒక గీత(Tablet Splitting) కనిపిస్తూ ఉంటుంది. అసలు ఆ గీత ఎందుకు ఉంటుంది? డోస్ తగ్గించుకోవడానికి లేదా మింగడానికి ఇబ్బందిగా ఉన్నప్పుడు దాన్ని హాఫ్‌గా కట్ చేసి వేసుకోవచ్చా అనే డౌట్ చాలామందికి వస్తూ ఉంటుంది. అయితే ఈ గీత వెనుక ఉన్న అసలు సంగతేంటనేది చాలామందికి తెలీదు.
టాబ్లెట్ల మధ్య ఉండే ఈ గీతను వైద్య భాషలో స్కోర్ లైన్ అంటారు. కొన్ని రకాల టాబ్లెట్స్‌ను అవసరమైనప్పుడు రెండు సమాన భాగాలుగా విడదీయడానికి వీలుగా ఈ గీతను డిజైన్ చేస్తారు. డాక్టర్లు చిన్నపిల్లల కోసం తక్కువ డోస్ సజెస్ట్ చేసి చెప్పినప్పుడు లేదా పెద్ద టాబ్లెట్ మింగడం కష్టంగా అనిపించినప్పుడు ఇది యూజ్ అవుతుంది. అయితే ప్రతి టాబ్లెట్ మీద కనిపించే గీత కట్ చేయడం కోసమే ఉంటుందని అనుకోవడానికి వీల్లేదు.
గీత కనిపించిన ప్రతి టాబ్లెట్‌ను హాఫ్‌కు విరిచి వేసుకోవడం సరైన పద్ధతి కాదు. కొన్నిసార్లు తయారీ సమయంలో మిషన్ల వల్ల లేదా బ్రాండ్ గుర్తింపు కోసం అలాంటి గీతలు వేస్తుంటారు. కొన్ని మాత్రలను మాత్రమే కచ్చితమైన డోస్ అందేలా విడగొట్టేలా రూపొందిస్తారు. అందుకే టాబ్లెట్‌ను కట్ చేసే ముందు దాని స్ట్రిప్ కానీ ప్యాకెట్ మీద కానీ ఏమైనా సూచనలు ఉన్నాయా అని తప్పకుండా చూడాలి. అవసరమైతే డాక్టర్ లేదా ఫార్మసిస్ట్‌ను అడిగి తెలుసుకోవడం మంచిది.
అన్ని రకాల మాత్రలను సగానికి విరిచి వేసుకోకూడదు, ఎందుకంటే అలా చేస్తే ఆ మందు పనితీరు మారిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా సస్టెయిన్డ్ రిలీజ్ టాబ్లెట్స్ బాడీలోకి నెమ్మదిగా, నిర్ణీత సమయంలో మందును రిలీజ్ చేస్తాయి. వాటిని విరిస్తే ఒకేసారి ఎక్కువ మోతాదు బాడీలోకి వెళ్లి సైడ్ ఎఫెక్ట్స్ రావొచ్చు.
అలాగే ఎంటరిక్ కోటెడ్ టాబ్లెట్లకు కడుపులో కరిగిపోకుండా ప్రత్యేక పూత ఉంటుంది. దాన్ని తుంచితే ఆ కోటింగ్ పాడై కడుపులో సమస్యలు రావొచ్చు. అలాగే క్యాప్సూల్స్ లోపల ఉండే పొడి లేదా గుళికలను బయటకు తీసి వాడటం కూడా ప్రమాదకరమే అవుతుంది. ఇక హార్మోన్లకు సంబంధించిన మెడిసిన్ విషయంలో కూడా సొంతంగా డోస్ మార్చుకుంటే తేడాలు వచ్చే ఛాన్స్ ఉంటుంది.
ఒకవేళ టాబ్లెట్‌ను హాఫ్ చేయాల్సిన అవసరం వస్తే, ముందుగా అది కట్ చేయొచ్చా? అలా కట్ చేస్తే రెండు ముక్కల్లోనూ డోస్ సమానంగా ఉంటుందా అనేది కన్ఫర్మ్ చేసుకోవాలి. ముందుగానే చాలా టాబ్లెట్లను కట్ చేసి దాచిపెట్టుకోవడం కూడా మంచిది కాదు. గాలి, తేమ, వెలుతురు తగిలి మందు నాణ్యత దెబ్బతినే ఛాన్స్ ఉంటుంది. మొత్తానికి టాబ్లెట్ మీద గీత ఉందనే రీజన్‌తో దానికి సగానికి విరిచి వేసుకోవచ్చనే ఆలోచనకు స్వస్తి చెప్పండి. మెడిసిన్ స్వభావాన్ని బట్టి, డాక్టర్ సలహా ప్రకారమే ఈ నిర్ణయం తీసుకోవడం ఎప్పుడూ మంచిది.
Dining Manners : తరచూ రెస్టారెంట్, హోటల్స్‌కి వెళ్తుంటారా? అయితే ఈ 5 పనులు చేయకండి..
