Urine: మీ ఆరోగ్యం ఏంటో మీ మూత్రం రంగు చెబుతుంది.. ఏ కలర్ దేనికి సంకేతమో తెలుసా?

Urine: మనం రోజూ విసర్జించే మూత్రం రంగు అనేది కేవలం వేస్ట్ మాత్రమే కాదు, అది మన అంతర్గత అవయవాల పనితీరును తెలిపే ఒక హెల్త్ రిపోర్ట్.

Urine

మన శరీరంలో ఏవైనా అనారోగ్య సమస్యలు తలెత్తుతున్నాయా అని చెప్పడానికి మూత్రం రంగు (Urine Color) ఒక స్పష్టమైన ఇండికేటర్‌గా పనిచేస్తుందన్న విషయం చాలామందికి తెలీదు. ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలు నుంచి డీహైడ్రేషన్ వరకూ కూడా ఈ రంగును బట్టి మనం ముందే పసిగట్టొచ్చట. అందుకే ఏ రంగు దేనికి సంకేతమో , మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ముందుగానే తెలుసుకోవాలని డాక్టర్లు చెబుతున్నారు.

నిజానికి మన శరీరం మనతో నిరంతరం మాట్లాడుతూనే ఉంటుంది. కానీ ఆ సంకేతాలను అర్థం చేసుకోవడంలో మనమే పూర్తిగా వెనుకబడిపోతుంటాం. దీనికి ఉదాహరణగా మనం రోజూ విసర్జించే మూత్రం(Urine) రంగు అనేది కేవలం వేస్ట్ మాత్రమే కాదు, అది మన అంతర్గత అవయవాల పనితీరును తెలిపే ఒక హెల్త్ రిపోర్ట్ అని మనమంతా తెలుసుకోలేకపోవడమే అంటారు వైద్య నిపుణులు.

ఆరోగ్యవంతుడైన వ్యక్తి యూరిన్(Urine) ఎప్పుడూ కూడా సాధారణంగా లేత పసుపు రంగులో (Pale Yellow) ఉండాలి. ఇది మన శరీరం సరైన రీతిలో హైడ్రేట్ అయి ఉందని, అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయని చెప్పడానికి నిదర్శనమట. ఒకవేళ ఈ రంగులో మాత్రం మార్పులు కనిపిస్తే, అది మనం తీసుకున్న ఆహారం వల్ల కావొచ్చు అలాగే శరీరం లోపల పెరుగుతున్న ఏదైనా అనారోగ్యం వల్ల కావొచ్చు.

యూరిన్ రంగు ముదురు పసుపు , అంబర్ రంగులో ఉంటే, మీ బాడీలో నీటి శాతం తగ్గినట్లు అర్థం. అంటే మీరు తగినంత నీళ్లు తాగడం లేదని మీ శరీరం మీకు సిగ్నల్ ఇచ్చినట్లు అన్నమాట. అదే యూరిన్ రంగు తేనె కలర్ లోనో లేదా ఇంకా ముదురు రంగులోకో మారితే మాత్రం అది తీవ్రమైన డీహైడ్రేషన్‌కు దారితీస్తునట్లు లెక్క.

అయితే మూత్రం ముదురు నారింజ లేక గోధుమ రంగులోకి మారితే మాత్రం అందరూ అలర్ట్ అవ్వాల్సిన సమయం వచ్చేసినట్లే. కాలేయ సంబంధిత సమస్యలు, ముఖ్యంగా ఫ్యాటీ లివర్ ముదిరినప్పుడు , కామెర్లు (Jaundice) సోకినప్పుడు లివర్ నుంచి బిలిరుబిన్ అనే రసాయనం నేరుగా రక్తంలోకి, అక్కడి నుంచి మూత్రంలోకి చేరుతుంది. దీనివల్లే మూత్రం ముదురు రంగులో కనిపిస్తుంది కాబట్టి వెంటనే డాక్టర్ దగ్గరకు వెళ్లాలి.

మరికొన్ని సందర్భాల్లో మూత్రం ఎరుపు లేదా గులాబీ రంగులో రావొచ్చు. మీరు బీట్‌రూట్ లేదా బ్లాక్‌బెర్రీస్ వంటివి తిన్నప్పుడు ఇలా జరుగుతూ ఉండటం సహజం. కానీ ఆహారంతో సంబంధం లేకుండా ఇలా జరిగితే మాత్రం.. అది మూత్రపిండాల వ్యాధి, ఇన్ఫెక్షన్ , యూరినరీ ట్రాక్ట్‌లో ఏదైనా గడ్డలు ఉన్నాయేమోనని అనుమానించాలి.

Urine

యూరిన్ నీళ్లలాగా పూర్తిగా పారదర్శకంగా (Clear) ఉంటే, అవసరానికి మించి ఎక్కువగా నీళ్లు తాగుతున్నారని అర్థం. అయితే ఇది కూడా అంత మంచిది కాదట. ఎందుకంటే శరీరంలోని లవణాలు(Electrolytes) తగ్గిపోయే ఛాన్స్ ఉంటుంది. నురుగుతో కూడిన యూరిన్ వస్తుంటే, అది బాడీలో ప్రోటీన్ లీక్ అవుతుందనడానికి సంకేతం కావొచ్చని డాక్టర్లు అంటున్నారు.

ఇంకా చెప్పాలంటే మూత్రం రంగులో మార్పులు వచ్చినప్పుడు కంగారు పడకుండా ముందుగా తగినంత నీళ్లు తాగి గమనించాలి. ఒకవేళ నీరు తాగినా, ఆహారంలో మార్పులు చేసినా కూడా 2,3 రోజులకు మించి రంగు ముదురుగానే ఉంటే వెంటనే వైద్యుడిని సంప్రదించి లివర్ లేదా కిడ్నీ పరీక్షలు చేయించుకోవడం మంచిది.

ఏమైనా మందులు వాడేటప్పుడు కూడా యూరిన్ కలర్ మారుతుంది కాబట్టి.. ఆ విషయాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో చూపించే ఇలాంటి చిన్న అప్రమత్తతే రేపటి పెద్ద ప్రమాదాలను తప్పిస్తుందని డాక్టర్లు చెబుతున్నారు.

Necessity:అవసరం అనే వంతెన.. స్వార్థమే ఊపిరిగా సాగుతున్న బంధాలు

Exit mobile version