Peanuts
మనం రెగ్యులర్‌గా స్నాక్స్‌కు, చట్నీలకు పల్లీలను ఎక్కువగా వాడుతుంటాం. పల్లీల(Peanuts)లో ప్రొటీన్లు, విటమిన్-ఇ, మెగ్నీషియం, గుండెకు మంచి చేసే మోనో అన్‌శాచురేటెడ్ కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. అందుకే వీటిని పోషకాల గని అని, పేదవారి బాదం అని పిలుస్తుంటారు.
నిజానికి ఆరోగ్యానికి మంచివని తినే పల్లీలు అందరి బాడీకి సెట్ కావు. కొన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులు, శారీరక రుగ్మతలతో బాధపడే వారు శనగపలుకులను తింటే.. అవి బాడీలో పరిస్థితిని మరింత విషమంగా మారుస్తాయి.
కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ లేదా ఇరిటబుల్ బౌల్ సిండ్రోమ్ (IBS) వంటి జీర్ణకోశ సమస్యలతో ఇబ్బంది పడే వారు పల్లీలకు దూరంగా ఉండాలి. పల్లీలలో ఉండే ఎక్కువ శాతం ప్రొటీన్లు, కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్లు , పీచు పదార్థాలను డైజెస్ట్ చేసుకోవడానికి జీర్ణవ్యవస్థ చాలా కష్టపడాల్సి ఉంటుంది. ఇప్పటికే పొట్ట సెన్సిటివ్‌గా ఉన్నవారు వీటిని తిన్నప్పుడు, జీర్ణక్రియ డౌన్ అయి కడుపులో గ్యాస్ విపరీతంగా పేరుకుపోతుంది. ఇది తీవ్రమైన కడుపు నొప్పికి, అసౌకర్యానికి దారితీస్తుంది.
కిడ్నీలో రాళ్లు ఉన్నవారు, కిడ్నీ స్టోన్స్ సమస్యను ఎదుర్కొన్నవారు వేరుశనగలను అస్సలు తినకూడదు. పల్లీలలో ఆక్సలేట్లు అనే కెమికల్ కాంపౌండ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి బాడీలోకి చేరిన తర్వాత, మనం తీసుకునే ఆహారంలోని క్యాల్షియంతో బాండ్ ఏర్పరచుకుంటాయి. ఈ క్యాల్షియం ఆక్సలేట్ స్ఫటికాలు మెల్లగా పేరుకుపోయి కిడ్నీలో రాళ్లుగా మారుతాయి. ఇప్పటికే రాళ్లు ఉన్నవారిలో ఇవి సైజు పెరిగేలా చేసి కిడ్నీల నొప్పిని కలిగిస్తాయి.
హైపోథైరాయిడిజం సమస్య ఉన్న రోగులు కూడా పల్లీలను తమ ఆహారం నుంచి పూర్తిగా పక్కన పెట్టేయడమే మంచిది. పల్లీలలో సహజసిద్ధంగానే గోయిట్రోజెన్స్ అనే సమ్మేళనాలు ఉంటాయి. ఇవి బాడీలో థైరాయిడ్ గ్రంథి యొక్క పనితీరును దెబ్బతీస్తాయి. ముఖ్యంగా థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తికి అవసరమైన అయోడిన్‌ను బాడీ గ్రహించకుండా ఇవి అడ్డుకుంటాయి. దీనివల్ల శరీరంలో థైరాయిడ్ హార్మోన్ల బ్యాలెన్స్ లోపించి, అలసట, బరువు పెరగడం వంటి సమస్యలు ఇంకా ఎక్కువవుతాయి.
ఫ్యాటీ లివర్, లివర్ ఇన్ఫెక్షన్లు, కాలేయ బలహీనత వంటి కాలేయ సంబంధిత వ్యాధులున్నవారు వేరుశనగల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. పల్లీలలో ఆరోగ్యకరమైన కొవ్వులు ఉన్నా.. వాటి శాతం చాలా ఎక్కువ. దెబ్బతిన్న కాలేయం ఈ అధిక కొవ్వును , నూనెలను బ్రేక్ డౌన్ చేయలేదు. దీనివల్ల కాలేయంపై అదనపు భారం పడి, లివర్ వాపు అంటే ఇన్‌ఫ్లమేషన్ వచ్చే ప్రమాదం ఉంది. ఇది కాలేయ వ్యాధి నెక్స్ట్ స్టేజ్‌కు చేరుకునేలా చేస్తుంది.
ఇక బరువు తగ్గడానికి డైట్ ఫాలో అవుతున్న వారు పల్లీలను బాగా తగ్గించాలి. వేరుశనగ పలుకులలో కేలరీలు , ఫ్యాట్ కంటెంట్ చాలా ఎక్కువ. ఒక గుప్పెడు పల్లీల(Peanuts) ద్వారా శరీరానికి భారీగా కేలరీలు అందుతాయి. బరువు తగ్గేటపుడు కేలరీల కంట్రోల్ చాలా ఇంపార్టెంట్. అలాంటి సమయంలో పల్లీలను(Peanuts) ఎక్కువగా తింటే, బరువు తగ్గడానికి బదులు బాడీ వెయిట్ పెరిగే ఛాన్స్ ఉంటుంది.
