Strait of Hormuz
ఏవో కొన్ని దేశాలకు మాత్రమే కాదు ఏకంగా ప్రపంచదేశాల ఆర్థిక వ్యవస్థకు గుండెకాయలా భావించే హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) ఇప్పుడు రణరంగాన్ని తలపిస్తోంది. ఇరాన్ సముద్ర గర్భంలో పన్నుతున్న వ్యూహాలతో అమెరికా గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
కేవలం మూడు కిలోమీటర్లు వెడల్పు మాత్రమే ఉన్న ఈ సముద్ర మార్గం.. ప్రపంచ చమురు రవాణాకు మృత్యుద్వారంగా మారిందా అన్న అనుమానాలు ఇప్పుడు వినిపిస్తున్నాయి. రాత్రికి రాత్రే ఇరాన్ సైన్యం నీటి అడుగున అమర్చుతూ వస్తున్న మందుపాతరలు ఈ అంతర్జాతీయ నౌకాయానాన్ని వణికిస్తున్నాయి.
హర్మూజ్ జలసంధి(Strait of Hormuz) అనేది పర్షియన్ గల్ఫ్ , ఓమన్ గల్ఫ్ దేశాలను కలిపే అతి ముఖ్యమైన మార్గమన్న విషయం తెలిసిందే. ప్రపంచానికి అందే చమురులో సుమారు ముప్పై శాతం ఈ ఇరుకైన దారి నుంచే ప్రయాణించాలి. సౌదీ, ఇరాక్, కువైట్ వంటి దేశాల నుంచి పెట్రోలియం ఎగుమతులు సజావుగా జరగాలంటే ఈ దారిని దాటాల్సిందే.
అయితే, ఈ మార్గంలో నౌకలు ప్రయాణించడానికి వీలున్న మార్గం కేవలం మూడంటే మూడే కిలోమీటర్లు మాత్రమే ఉండటంతో, ఇరాన్ దీన్నే తన అస్త్రంగా మార్చుకుంటోంది. రాడార్లకు కూడా చిక్కని విధంగా.. చిన్న చిన్న పడవల ద్వారా వెళ్లి సముద్రపు అడుగున అత్యంత ప్రమాదకరమైన బాంబులను అమరుస్తూ వస్తోంది. ఏ సమయంలో అయినా భారీ నౌక అయినా సరే వీటిని తాకగానే ..వెంటనే అది నీటిలో జల సమాధి కావాల్సిందే.
ఇరాన్ ఉపయోగిస్తున్న ఈ ‘సీమైన్స్’ టెక్నాలజీ ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనంగా మారింది. నౌకలు తగిలిన వెంటనే పేలిపోయే బాంబుల నుంచి, నౌకల శబ్దాన్ని కానీ అయస్కాంత తరంగాలను కానీ పసిగట్టి పేలే సెన్సార్ బాంబుల వరకు కూడా ఇరాన్ రకరకాల యుద్ధ తంత్రాలను ప్రయోగిస్తోంది.
సుమారు రెండు వేల నుంచి ఆరు వేల వరకు ఇటువంటి మందుపాతరలు ఇరాన్ వద్ద ఉన్నట్లు తెలుస్తోంది. ఈ పరిణామాలపై తీవ్రంగా స్పందించిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ .. నౌకల రాకపోకలకు ఆటంకం కలిగిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అంతేకాదు దీనిలో భాగంగానే ఇప్పటికే కొన్ని ఇరాన్ యుద్ధ నౌకలను అమెరికా సైన్యం ధ్వంసం చేసిందని గుర్తు చేశారు.
అయినా సరే..ఇరాన్ మాత్రం తన పంతాన్ని వీడకుండా సరికొత్త వ్యూహాలతో తమ దాడులను కొనసాగిస్తూనే ఉంది. ఒకవేళ ఈ జలసంధి గనుక పూర్తిగా మూతపడితే మాత్రం ప్రపంచ దేశాల ఆర్థిక పరిస్థితి ఒక్కసారే కుప్పకూలే ప్రమాదముంది.దీనివల్ల చమురు ధరలు ఆకాశాన్ని తాకడం ఒక్కటే కాదు.. అనేక రంగాల్లోనూ సంక్షోభం తలెత్తుతుంది.
