France
ఫ్రాన్స్ దేశం ఎన్నడూ లేని విచిత్ర వాతావరణ పరిస్థితిని ఎదుర్కొంటోంది. గతంలో ఎప్పుడూ లేని విధంగా విపరీతమైన ఎండలతో అక్కడి ప్రజలు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత తీవ్రమైన, రికార్డు స్థాయి ఎండలు ఫ్రాన్స్(France) లో నమోదవుతున్నాయి..
ఈ జూన్ నెలలో దేశ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని ఫ్రెంచ్ వాతావరణ శాఖ వెల్లడించింది. ఫ్రాన్స్‌లోని చాలా ప్రధాన పట్టణాల్లో ఉష్ణోగ్రతలు 45 డిగ్రీల కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. గతంలో ఎప్పుడూ ఇంతటి తీవ్రస్థాయిలో ఎండలు లేకపోవడంతో ప్రస్తుతం ఫ్రెంచ్ ప్రజలు అల్లాడిపోతున్నారు.
కేవలం పగటివేళల్లోనే కాదు రాత్రివేళల్లోనూ ఉష్ణోగ్రతలు తగ్గడం లేదు. దీంతో పలు ప్రాంతాలకు అక్కడి ప్రభుత్వం రెడ్ అలర్ట్ ప్రకటించింది. దాదాపు దేశ జనాభాలో 90శాతానికి పైగా ప్రజలు ఎండవేడితో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎండల తీవ్రత ప్రభావం ఏ స్థాయిలో ఉందంటే అక్కడి ప్రజలు ఏసీలు, కూలర్లు కొనుక్కునేందుకు షాపింగ్ మాల్స్ కు క్యూ కడుతున్నారు.
కొద్ది గంటల్లోనే స్టాకులు అయిపోవడంతో ఏసీల కోసం కొట్టుకుంటున్నారు. పలు మాల్స్ లో ఘర్షణలు చోటు చేసుకోవడం అక్కడి పోలీసులకు తలనొప్పిగా మారింది. ఫ్రాన్స్ ఇళ్లలో సాధారణంగా ఎయిర్ కండిషనర్లు తక్కువగా ఉంటాయి. కానీ ప్రస్తుతం ఏర్పడిన అసాధారణ పరిస్థితుల వల్ల మార్కెట్లలో ఏసీలు, ఫ్యాన్లకు డిమాండ్ విపరీతంగా పెరిగింది.
మార్కెట్ లో కొరత ఏర్పడి మళ్లీ దొరకవేమో అన్న ప్రచారం జరుగుతుండడంతో కొనుగోలు చేసేందుకు ముష్టియుద్ధాలకు దిగుతుండడం అక్కడి పరిస్థితికి అద్దం పడుతోంది.విపరీతమైన ఏసీల వాడకం వల్ల పవర్ గ్రిడ్‌లపై ఒత్తిడి పెరిగి పలు ప్రాంతాలలో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలుగుతోంది.
ఫ్రాన్స్(France)లోని చాలా క్లాస్‌రూమ్‌లలో ఎయిర్ కండిషనింగ్ సదుపాయం లేకపోవడంతో వేలాది పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు. ఎండ తీవ్రత దృష్ట్యా పారిస్‌లోని ప్రసిద్ధ పర్యాటక ప్రాంతం ఈఫిల్ టవర్, లూవ్రే మ్యూజియం సందర్శన వేళలను కుదించారు.
కొద్ది రోజులుగా ఎండల తీవ్రత భరించలేక, వేడి తట్టుకోవడానికి నదులు, సరస్సులలో ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తూ మునిగిపోవడం వల్ల దాదాపు 40 మందికి పైగా మరణించారు. వాతావరణ మార్పుల వల్లే ఐరోపా ఖండంలో ఈ తరహా హీట్ డోమ్ ఏర్పడిందని, రాబోయే రోజుల్లో ఇవి మరింత పెరిగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
Numerology : నెంబర్ 8 అంటే నష్టమా, అదృష్టమా? శని దేవుడి నీడలో వారి జీవితం ఎలా ఉంటుంది?
