India and Russia
మారుతున్న వరల్డ్ పొలిటికల్ కవర్ పేజీలో భారత్ , రష్యా దేశాల మధ్య ఉన్న బంధం.. కేవలం ఒక చారిత్రక అంశం మాత్రమే కాదు, అది కాలపరీక్షకు నిలబడిన ఒక ధృడమైన విశ్వాసం అనేలా పరిస్థితులు వచ్చాయి. ఇటీవలే రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ రెండు దేశాల దౌత్య, రక్షణ, వాణిజ్య సంబంధాలపై కీలక విషయాలను మీడియాతో పంచుకున్నారు.
ప్రపంచ దేశాల మధ్య ఎన్ని రాజకీయ సమీకరణాలు మారినా, భారతదేశానికి , రష్యా(India and Russia) ఎల్లప్పుడూ ఒక నమ్మకమైన నేస్తంగానే ఉంటుందని ఆయన క్లారిటీ ఇచ్చారు. దీనిలో భాగంగానే రెండు దేశాల మధ్య భాగస్వామ్యం ఇప్పుడు రక్షణ , ఇంధన రంగాల్లో ఒక సరికొత్త అధ్యాయానికి తెరలేపుతోంది.
ప్రధానంగా రక్షణ రంగంలో రెండు దేశాల సహకారం మరింత స్పీడుగా ముందుకు సాగుతోంది. భారతదేశం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఎస్-400 క్షిపణి వ్యవస్థలకు సంబంధించిన మిగిలిన విభాగాలను రష్యా త్వరలోనే అందజేయబోతోంది.
మేక్ ఇన్ ఇండియా నినాదంలో భాగంగా భారత దేశంలోనే తయారవుతున్న బ్రహ్మోస్ క్షిపణులు , ఏకే-203 రైఫిల్‌ల ప్రాజెక్టులను రెండు దేశాల విజయగాథలుగా అలిపోవ్ అభివర్ణించారు. అత్యాధునిక ఎస్‌యు-57 యుద్ధ విమానాల విషయంలో కూడా చర్చలు జరుగుతున్నాయని, భవిష్యత్తులో భారత రక్షణ వ్యవస్థను మరింత స్ట్రాంగ్ చేయడానికి రష్యా నుంచి పూర్తి సహకారం ఉంటుందని రష్యా రాయబారి హామీ ఇచ్చారు.
ఇంధన భద్రత విషయంలో భారతదేశానికి రష్యా ఒక కొండంత అండగా నిలుస్తోంది. అంతర్జాతీయంగా ఎన్ని ఆంక్షలు , ఒత్తిడులు ఉన్నా సరే, భారత్‌కు ముడి చమురు, ఎల్‌పీజీ సరఫరాలో ఎటువంటి ఆటంకాలు కలగకుండా రష్యా చూసుకుంటోంది. రెండు దేశాల మధ్య 100 బిలియన్ డాలర్ల వాణిజ్య లక్ష్యాన్ని అనుకున్నామని, ఇది సాధ్యం అవుతుందని అలిపోవ్ ధీమా వ్యక్తం చేశారు.
ప్రస్తుతం ఈ వాణిజ్యం ఎక్కువగా చమురు కొనుగోళ్ల వల్ల రష్యా వైపు మొగ్గు చూపుతున్నా కూడా, వ్యవసాయ ఉత్పత్తులు , యంత్రాల ఎగుమతులను పెంచడం ద్వారా దీనిని సమతుల్యం చేయొచ్చని అలిపోవ్ సూచించారు. ముఖ్యంగా 95 శాతం వాణిజ్య లావాదేవీలు సొంత కరెన్సీల్లోనే జరుగుతుండటం వల్ల అంతర్జాతీయ ఆంక్షల ఎఫెక్ట్ మన దేశంపై పడకపోవడం ఒక గొప్ప విశేషం.
2026 సెప్టెంబర్‌లో భారతదేశంలో జరగనున్న బ్రిక్స్ (BRICS) సదస్సు.. ఈ బంధానికి ఒక మైలురాయిగా నిలవబోతోంది. ఈ సదస్సుకు రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్(Putin) హాజరయ్యే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని, దీనికి సంబంధించి రెండు దేశాల ఉన్నత స్థాయి అధికారులు నిరంతరం చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
మరోవైపు పశ్చిమ ఆసియాలో నెలకొన్న ఉద్రిక్తతలపై స్పందించిన అలిపోవ్ .. ఏ దేశానికైనా ఆత్మరక్షణ చేసుకునే హక్కు ఉంటుందని అన్నారు. మొత్తంగా ఒకవైపు పశ్చిమ దేశాల ఒత్తిళ్లను తట్టుకుంటూనే, మరోవైపు ఒకరి అవసరాలను మరొకరు అర్థం చేసుకుంటూ భారతదేశం-రష్యా(India and Russia) బంధం ప్రపంచ రాజకీయాల్లో ఒక అజేయమైన శక్తిగా ఎదుగుతోంది.
Maharashtra : కామాంధుడికి బుల్డోజర్ ట్రీట్ మెంట్…మహారాష్ట్ర నిందితుడి ఇల్లు కూల్చివేత
