Khamenei
మధ్యప్రాచ్యంలో దశాబ్దాల పాటు తిరుగులేని శక్తిగా ఓ వెలుగు వెలిగిన ఇరాన్ అత్యున్నత నేత అయతుల్లా అలీ ఖమేనీ(Khamenei) మరణంతో ప్రపంచం ఉలిక్కిపడింది. ఫిబ్రవరి 28, 2026 రాత్రి అమెరికా ,ఇజ్రాయెల్ సంయుక్తంగా నిర్వహించిన ..ఆపరేషన్ ఎపిక్ ఫ్యూరీ దాడిలో ఖమేనీ హతమయినట్లు మార్చి 1 ఉదయం ఇరాన్ అధికారిక మీడియా ధృవీకరించింది.
టెహ్రాన్‌లోని ఖమేనీ(Khamenei) నివాసమే టార్గెట్‌గా జరిగిన ఈ భీకర వైమానిక దాడుల్లో.. ఆయనతో పాటు ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ (IRGC) కీలక నేతలు అలాగే రక్షణ మంత్రి కూడా ప్రాణాలు కోల్పోయారు. 86 ఏళ్ల వయసులో ఖమేనీ చనిపోవడం అనేది ఇరాన్ ఇస్లామిక్ రిపబ్లిక్‌కు కోలుకోలేని దెబ్బ అనే చెప్పాలి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ ఘటనపై స్పందిస్తూ.. ఇరాన్ ప్రజలకు ఇది ఒక గొప్ప అవకాశమని వ్యాఖ్యానించడం ప్రపంచ రాజకీయాల్లో వేడిని పెంచింది.
ఒక మతపరమైన కుటుంబం నుంచి మొదలైన ఖమేనీ(Khamenei) ప్రస్థానం..తర్వాత దేశాన్నే శాసించే సుప్రీం లీడర్ వరకు సాగింది. 1939లో జన్మించిన ఖమేనీ, పహ్లావీ షా పాలనకు వ్యతిరేకంగా పోరాడి చాలాసార్లు జైలు జీవితాన్ని కూడా గడిపారు. 1979 ఇస్లామిక్ విప్లవం తర్వాత కీలక బాధ్యతలు చేపట్టిన ఖమేనీ.. 1989లో ఏకంగా సుప్రీం లీడర్‌గా బాధ్యతలను తీసుకున్నారు.
ఖమేనీ 36 ఏళ్ల పాలనలో.. ఒక శక్తివంతమైన సైనిక దేశంగా ఇరాన్ ఎదిగేలా చేశారు. ముఖ్యంగా హిజ్బుల్లా, హమాస్ వంటి సంస్థల ద్వారా మధ్యప్రాచ్యంలో తమ దేశ పట్టును బిగించేలా చేశారు. అయితే అంతర్గతంగా మాత్రం ప్రజల నిరసనలు, ఆర్థిక సంక్షోభాలు ఖమేనీ పాలనను వెంటాడినట్లే అయింది. ముఖ్యంగా 2022లో జరిగిన హిజాబ్ నిరసనలు అయితే ఖమేనీ ఇమేజ్‌ను ప్రపంచవ్యాప్తంగా దెబ్బతీసేశాయి. ఇంతటి వ్యతిరేకత చోటుచేసుకోవడంతోనే కొన్ని చోట్ల ఖమేనీ మరణ వార్తతో అక్కడి ప్రజలు సంబరాలు చేసుకున్నారు.
అయితే ఇప్పుడు ఖమేనీ మరణంతో..మూడో ప్రపంచ యుద్ధానికి దారి తీస్తుందా అనే భయాలు మొదలయ్యాయి. ఇరాన్ ఓవైపు 40 రోజుల సంతాప దినాలను ప్రకటిస్తూనే, మరోవైపు శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. దీంతో ఇరాన్ తన క్షిపణులతో ఇజ్రాయెల్ ,అమెరికా స్థావరాలపై దాడులు చేసే అవకాశం 80 శాతం వరకు ఉన్నట్లు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఒకవేళ గల్ఫ్ ప్రాంతంలో యుద్ధం ముదిరితే మాత్రం ముడి చమురు ధరలు బారెల్‌కు 150 డాలర్ల వరకు పెరిగే ప్రమాదం ఉంటుంది. రష్యా, చైనా వంటి అమెరికాకు వ్యతిరేకంగా ఉండే దేశాలు ఇరాన్‌కు మద్దతుగా నిలిస్తే మాత్రం ఇది ప్రపంచ యుద్ధంగా మారొచ్చు.
భారత్ వంటి దేశాలపై దీని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. చమురు ధరలు పెరిగితే దేశంలో ద్రవ్యోల్బణం పెరిగి సామాన్యుడిపైనే ఎక్కువ భారం పడుతుంది. ఇక ఇరాన్ కొత్త లీడర్‌గా ఖమేనీ కుమారుడు మొజ్తబా లేదా అధ్యక్షుడు రైసీ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఏది ఏమైనా, ఖమేనీ మరణం ప్రపంచాన్ని ఒక అనిశ్చితిలోకి నెట్టేసింది.
