LPG :హర్మూజ్ దిగ్బంధం వేళ ఊరటనిచ్చే వార్త.. ఎల్‌పీజీ, ఇంధన కొరత ఉండదా?

LPG : ఇంధన సంక్షోభం తలెత్తుతుందేమో అన్న ఆందోళనలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక ఊరటనిచ్చే కబురును అందించింది

LPG

పశ్చిమాసియాలో రోజురోజుకు ముదురుతున్న ఉద్రిక్తతల మధ్య.. ఇంధన సంక్షోభం తలెత్తుతుందేమో అన్న ఆందోళనలో ఉన్న భారతీయులకు కేంద్ర ప్రభుత్వం ఒక ఊరటనిచ్చే కబురును అందించింది. యుద్ధ వాతావరణం వల్ల హర్మూజ్ జలసంధి వద్ద నిలిచిపోయిన సరుకు రవాణాలో కాస్త కదలిక రావడం దేశీయంగా గ్యాస్ సరఫరాకు కొత్త ఆశలు చిగురింపజేసినట్లు అయింది.

ముఖ్యంగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య కుదిరిన టెంపరరీ కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత, సుమారు 20వేల400 మెట్రిక్ టన్నుల ఎల్‌పీజీ(LPG ) లోడ్‌తో వస్తున్న జగ్ విక్రమ్ అనే భారతీయ నౌక సురక్షితంగా వివాదాస్పద జలాలను దాటడం ఇప్పుడు ఒక కీలక పరిణామంగా చెప్పొచ్చు. 24 మంది సిబ్బందితో ప్రయాణిస్తున్న ఈ భారీ నౌక ఏప్రిల్ 14 వ తేదీకి గుజరాత్‌లోని కాండ్లా తీరానికి చేరుకోనుంది. ఇంధన కొరత ఏర్పడవచ్చనే భయాందోళనల మధ్య ఈ నౌక రాక దేశానికి ఎంతో ఊరటనిస్తోంది.

కేంద్ర పోర్టులు, నౌకాయాన శాఖ అందించిన తాజా సమాచారం ప్రకారం, గల్ఫ్ సముద్ర జలాల్లో ఇప్పుడు మరో 15 భారతీయ నౌకలు ఉన్నాయి. వీటిని కూడా వీలైనంత త్వరగా భారత దేశానికి చేర్చడానికి విదేశాంగ శాఖ , రక్షణ విభాగాలు సమన్వయంతో పని చేస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో భారతీయ నావికులపై ఎటువంటి దాడులు జరగకపోవడం సానుకూల అంశమని అధికారులు స్పష్టం చేశారు.

యుద్ధం మొదలైనప్పటి నుంచి ఇప్పటివరకు వేల సంఖ్యలో భారతీయ నావికుల భద్రతను పర్యవేక్షిస్తున్న కేంద్ర ప్రభుత్వం, వారి క్షేమం కోసం రెగ్యులర్‌గా అంతర్జాతీయ మిషన్లతో చర్చలు జరుపుతూనే ఉంది. దీనికి తోడు ప్రధానమంత్రి ఆదేశాలతో విదేశాంగ మంత్రి జైశంకర్ స్వయంగా యూఏఈ పర్యటనకు వెళ్లి, పశ్చిమాసియాలో భారతీయుల రక్షణపై ఆయా దేశాల సహకారాన్ని కోరారు.

మరోవైపు ఇంధన నిల్వలపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర పెట్రోలియం శాఖ భరోసా ఇస్తోంది. దేశంలో ప్రస్తుతం అందరికీ తగినంత ఎల్‌పీజీ(LPG )స్టాక్ ఉందని, సిలిండర్ల పంపిణీ ఎక్కడా ఆగిపోకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

అయితే సరఫరా వ్యవస్థపై ఒత్తిడి పడకుండా ఉండటానికి ప్రజలు ఎల్పీజీ(LPG ) గ్యాస్‌ను బాధ్యతాయుతంగా వాడాలని, అలాగే అనవసర భయంతో అవసరానికి మించి సిలిండర్లను బుక్ చేసుకోవద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రస్తుతం 99 శాతం మంది కస్టమర్లు..ఆన్లైన్‌లోనే బుకింగ్స్ చేసుకుంటున్నారని, దీనివల్ల పంపిణీ మరింత వేగవంతంగా జరుగుతోందని అధికారులు వెల్లడించారు.

LPG

మరోవైపు చమురుపై ఆధారపడటాన్ని తగ్గించి, దీర్ఘకాలిక ప్రత్యామ్నాయాలను ప్రోత్సహించే దిశగా కేంద్ర ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాలపై సబ్సిడీలను పొడిగించింది. ఎలక్ట్రిక్ త్రీ-వీలర్లపై ఇచ్చే రాయితీని ఏకంగా 2028 మార్చి వరకు, అలాగే టూ-వీలర్లపై సబ్బిడీని 2026 జూలై వరకు పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.

ప్రస్తుతం అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న అనిశ్చితి వల్ల ఇంధన ధరలు పెరిగే అవకాశం ఉండటంతో, ప్రజలు విద్యుత్ వాహనాల వైపు మళ్లేలా ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుకున్న ప్రధాన ఉద్దేశం. అంతర్జాతీయ ఉద్రిక్తతల మధ్య ఇంధన భద్రతను కాపాడుకుంటూనే, మరోవైపు పర్యావరణ హితమైన ట్రాన్స్‌పోర్ట్ వ్యవస్థకు ప్రాధాన్యత ఇస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

Ram Charan : గ్లోబల్ స్టార్ సరికొత్త రికార్డు..ఎస్క్వైర్ ఇండియా కవర్‌పై రామ్ చరణ్ మెరుపులు

Exit mobile version