Siddaramaiah
కర్ణాటక రాజకీయ చరిత్రలోనే ఒక అరుదైన మైలురాయికి సమయం ఆసన్నమైంది. రాష్ట్రంలో అత్యధిక కాలం సీఎంగా సేవలందించిన నేతగా సిద్దరామయ్య(Siddaramaiah) త్వరలోనే అగ్రస్థానానికి చేరుకోబోతున్నారు. ప్రస్తుతం ఈ రికార్డు మాజీ సీఎం దేవరాజ్ ఉర్స్ పేరిట ఉంది. అధికారిక లెక్కల ప్రకారం దేవరాజ్ ఉర్స్ తన సీఎం పదవీ కాలంలో రెండు విడతలుగా కలిపి మొత్తం 2,792 రోజులు ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు.
కాగా 2026 జనవరి 3 నాటికి సిద్దరామయ్య(Siddaramaiah) సుమారు 2,785 రోజులను పూర్తి చేసుకున్నారు. ఈ లెక్కన మరో నాలుగు రోజుల్లో అంటే 2026 జనవరి 7వ తేదీన సిద్దరామయ్య అధికారికంగా కర్ణాటక చరిత్రలో సుదీర్ఘకాలం పనిచేసిన ముఖ్యమంత్రిగా కొత్త చరిత్రను లిఖించబోతున్నారు.
అయితే ఈ రికార్డు విషయంలో కొంత గందరగోళం నెలకొన్నా.. అసలు నిజాలు ఇలా ఉన్నాయి. సిద్దరామయ్య
(Siddaramaiah) మొదటిసారి 2013 మే 13 నుంచి 2018 మే 15 వరకు దాదాపు 1,829 రోజులు పదవిలో ఉన్నారు. ఆ తర్వాత 2023 మే 20న రెండోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. అయితే జనవరి 1వ తేదీనే ఆయన రికార్డు సృష్టించారని కొన్ని ప్రభుత్వ గెజిట్ నోటిఫికేషన్లు పేర్కొన్నాయి.
దీనికి కారణం పదవీ కాలాన్ని ప్రమాణ స్వీకారం చేసిన తేదీ నుంచి కాకుండా నియామకం జరిగిన తేదీ నుంచి లెక్కించడమే. కానీ నిజంగా అధికారిక రికార్డుల ప్రకారం జనవరి 7వ తేదీనే..కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య(Siddaramaiah) ..మాజీ సీఎం దేవరాజ్ ఉర్స్ కన్నా ఒక రోజు అదనంగా పదవిలో ఉండి నంబర్ వన్ స్థానానికి చేరుకుంటారు.
దేవరాజ్ ఉర్స్, సిద్దరామయ్య మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసాన్ని గమనిస్తే, ఉర్స్ 1972 నుంచి 1980 వరకు మధ్యలో విరామం లేకుండా నిరాటంకంగా ఏడున్నర ఏళ్ల పాటు పదవిలో కొనసాగారు. ఇప్పటికీ నిరాటంకంగా అత్యధిక కాలం సీఎంగా ఉన్న రికార్డు ఉర్స్ పేరుతోనే ఉంది.
కానీ మొత్తం రోజుల లెక్కలో (Cumulative Tenure) మాత్రం సిద్దరామయ్య ఆయనను అధిగమించబోతున్నారు. కర్ణాటక రాజకీయాల్లో వీరశైవ లింగాయత్ , వొక్కలిగ వర్గాల ప్రాబల్యం ఎక్కువగా ఉన్నా సరే.. వెనుకబడిన తరగతికి చెందిన సిద్దరామయ్య (Siddaramaiah) సుదీర్ఘకాలం పదవిలో నిలబడటం అంటే చాలా గొప్ప విషయం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
బీసీలు, దళితులు , మైనారిటీలను ఏకం చేస్తూ ఆయన నిర్మించిన అహిండ సమీకరణం ఆయనకు బలమైన రక్షణ కవచంగా నిలిచింది. ఒక సాధారణ లాయర్ స్థాయి నుంచి మొదలైన సిద్దరామయ్య రాజకీయ ప్రస్థానం ఇప్పుడు కర్ణాటక చరిత్రలో ఒక చెరగని ముద్ర వేయబోతోంది.
సిద్దరామయ్య రాజకీయ ప్రస్థానాన్న గమనిస్తే అది ఒక సాధారణ లాయర్ నుంచి అత్యున్నత పదవి వరకు సాగిన స్ఫూర్తిదాయక ప్రయాణం. మైసూరు తాలూకా నుంచి స్వతంత్ర భావజాలంతో ఎమ్మెల్యేగా గెలిచిన ఆయన, రామకృష్ణ హెగ్డే, దేవెగౌడ వంటి దిగ్గజాల నీడలో పెరిగారు. ఆ తర్వాత జేడీఎస్ నుంచి కాంగ్రెస్ లోకి చేరి తనకంటూ ఒక ప్రత్యేక వర్గాన్ని సృష్టించుకున్నారు.
కర్ణాటక జనాభాలో దాదాపు 50 శాతం ఉన్న వెనుకబడిన తరగతులు, దళితులు , మైనారిటీలను ఏకం చేస్తూ ఆయన రూపొందించిన ‘అహిండ’ (AHINDA) అనే సమీకరణే ఆయనను ఇన్నాళ్లు అధికారంలో ఉంచింది. బీజేపీ హిందుత్వ ఎజెండాతో దూసుకుపోతున్న సమయంలో కూడా, సెక్యులర్ వాదాన్ని నమ్ముకుని అహిండ బలాన్ని నమ్ముకోవడం వల్లే ఆయన కాంగ్రెస్ అధిష్టానానికి విడదీయలేని నాయకుడిగా మారారు.
ఇక దేవరాజ్ ఉర్స్ , సిద్దరామయ్య మధ్య చాలా పోలికలు ఉన్నాయి. ఇద్దరూ కాంగ్రెస్ వారే, ఇద్దరూ బీసీ వర్గానికి చెందిన వారే, పైగా ఇద్దరూ భూసంస్కరణలు , సంక్షేమ పథకాలను ఆయుధంగా మలుచుకున్న వారే. ఉర్స్ కాలంలో భూమి లేని పేదలకు భూ పంపిణీ జరగగా, సిద్దరామయ్య హయాంలో అన్నభాగ్య, క్షీరభాగ్య , గృహలక్ష్మి వంటి గ్యారెంటీ పథకాలు ప్రజల్లోకి బలంగా వెళ్లాయి.
సామాజిక న్యాయం , సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆయన చూపిన చొరవ ఆయనను జననేతగా నిలబెట్టింది. జాతీయ స్థాయిలో కూడా అత్యధిక కాలం పనిచేసిన ముఖ్యమంత్రుల జాబితాలో సిద్దరామయ్య ఇప్పుడు ఒక ప్రముఖ స్థానాన్ని సంపాదించుకుంటున్నారు. అందుకే ఈ జనవరి 7వ తేదీ కర్ణాటక రాజకీయాల్లో ఒక నూతన అధ్యాయానికి వేదిక కానుంది.
జాతీయ స్థాయిలో లాంగెస్ట్ సర్వింగ్ సీఎంల జాబితాలో నవీన్ పట్నాయక్ , జ్యోతిబసు వంటి వారితో పోలిస్తే సిద్దరామయ్య పదవీకాలం తక్కువే కావొచ్చు, కానీ సామాజిక సమతుల్యత దెబ్బతినకుండా ఆధిపత్య వర్గాల ఒత్తిడిని తట్టుకుని నిలబడటమే ఆయన గొప్పతనం.
ఈ రికార్డు వెనుక ఉన్న అసలు రహస్యం సిద్దరామయ్యకు క్షేత్రస్థాయిలో ఉన్న మాస్ ఇమేజే. డీకే శివకుమార్ వంటి బలమైన నాయకుడితో లోలోపల అధికారం కోసం పోటీ ఉన్నా, అహిండ వర్గాల మద్దతు ఉన్నంతవరకు సిద్దరామయ్యను తప్పించడం అధిష్టానానికి ఒక రిస్క్ వంటిదే. అందుకే ఆయన కేవలం ఒక సంఖ్యగా కాకుండా, కర్ణాటకలో అణగారిన వర్గాల ప్రతినిధిగా ఒక సింబల్ గా మారిపోయారు. రాబోయే కాలంలో కూడా ఆయన ఈ రికార్డును మరింత ముందుకు తీసుకువెళ్తారా లేదా అని రాజకీయ విశ్లేషకులు ఆసక్తిగా గమనిస్తున్నారు.
