APSRTC:ఏపీఎస్ఆర్టీసీ చరిత్రలో సరికొత్త రికార్డు.. ఒక్కరోజే రూ.27.68 కోట్ల ఆదాయం..

APSRTC: ఆదాయం మాత్రమే కాదు, ప్రయాణికులకు సురక్షితమైన , సరసమైన జర్నీని అందించడంలో ఆర్టీసీ తన సాటిలేదని మరోసారి నిరూపించుకుంది.

APSRTC

తెలుగువారి అతిపెద్ద పండుగయిన సంక్రాంతి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSRTC) ఖజానాలో కాసుల వర్షాన్ని కురిపించింది. పండుగ ముగించుకుని తిరుగు ప్రయాణమైన ప్రజలతో ఆర్టీసీ బస్సులు కిక్కిరిసిపోయాయి. దీనిలో భాగంగానే జనవరి 19వ తేదీన సంస్థ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా అత్యధిక ఆదాయాన్ని ఆర్జించి సరికొత్త మైలురాయిని అధిగమించింది.

గతంలో ఏనాడూ లేని విధంగా ఒక్కరోజులోనే రూ. 27.68 కోట్ల ఆదాయం రావడం ఇప్పుడు రవాణా రంగంలో హాట్ టాపిక్ గా మారింది. కేవలం ఆదాయం మాత్రమే కాదు, ప్రయాణికులకు సురక్షితమైన , సరసమైన జర్నీని అందించడంలో ఆర్టీసీ తన సాటిలేదని మరోసారి నిరూపించుకుంది.

ఈ భారీ విజయానికి ప్రధాన కారణం ప్రయాణికులు ఆర్టీసీపై (RTC) చూపించిన నమ్మకమే. పండుగ సమయంలో ప్రైవేట్ బస్సులు ఇష్టారాజ్యంగా ఛార్జీలు పెంచేసి ప్రయాణికులను నిలువు దోపిడీ చేశాయి. దానికి తోడు ఈ మధ్య కాలంలో ప్రైవేట్ బస్సుల్లో వరుస ప్రమాదాలు జరగడం ప్రయాణికులను భయాందోళనకు గురిచేసింది.

ఇలాంటి పరిస్థితుల్లో ఆర్టీసీ యాజమాన్యం సంక్రాంతి పండుగ సందర్భంగా..ఎక్స్‌ట్రా ఛార్జీలు వసూలు చేయకూడదని తీసుకున్న నిర్ణయం సామాన్య ప్రజలకు కొండంత అండగా నిలిచింది. తక్కువ ఖర్చుతో, సురక్షితంగా డెస్టినేషన్‌ను చేరుకోవడానికి ప్రజలు ఆర్టీసీ బస్సులకే మొదటి ప్రాధాన్యత ఇచ్చారు.

నిజానికి జనవరి 19న నమోదైన గణాంకాలు చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. ఒక్క రోజులోనే ఏకంగా 50.6 లక్షల మంది ప్రయాణికులను ఆర్టీసీ తన బస్సుల్లో గమ్యస్థానాలకు చేర్చింది. పండుగ రద్దీని ముందుగానే అంచనా వేసిన ఎండీ ద్వారకా తిరుమల రావు , అధికారులు, రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రధాన రూట్లలో అదనపు సర్వీసులను అందుబాటులోకి తెచ్చారు.

APSRTC

గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే ప్రయాణికుల కోసం ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయడం, ఆన్‌లైన్ బుకింగ్ వ్యవస్థను కంటెన్యూగా పర్యవేక్షించడం వల్ల ప్రయాణికులు ఎక్కడా ఇబ్బంది పడకుండా ప్రయాణం సాగింది. బస్సుల ఆక్యుపెన్సీ రేషియో (OR) గరిష్ట స్థాయికి చేరడం ఈ ఆదాయ రికార్డుకు తోడ్పడింది.

ఈ చారిత్రాత్మక విజయం సాధించడంలో క్షేత్రస్థాయి సిబ్బంది పాత్ర మరువలేనిదని.. పండుగ సెలవుల్లో కూడా కుటుంబాలకు దూరంగా ఉండి, నిరంతరం బస్సులు నడిపిన డ్రైవర్లు, కండక్టర్లు, గ్యారేజీ సిబ్బందిని ఎండీ ప్రత్యేకంగా అభినందించారు. అధికారులు , సిబ్బంది మధ్య ఉన్న సమన్వయం వల్లే ఇంతటి భారీ స్థాయిలో ప్రయాణికుల రవాణా సాధ్యమైందని ఆయన అన్నారు.

మొత్తంగా దీంతో ఏపీఎస్ఆర్టీసీ (APSRTC) కేవలం ఒక సంస్థ మాత్రమే కాదు, అది ప్రజల ఆస్తి అని, ప్రజలకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని ఆర్టీసీ యంత్రాంగం మరోసారి చాటి చెప్పినట్లు అయింది. ఈ సంక్రాంతి ఆదాయం ఆర్టీసీని మరింత బలోపేతం చేయడానికి దోహదపడనుంది.

Krishnam Raju:రెబల్ స్టార్ కృష్ణంరాజు స్మృతిలో సేవా యజ్ఞం.. డయాబెటిక్ పేషెంట్లకు నిజంగా వరమే..

Exit mobile version