Amaravati
ఏపీ రాజధాని అయిన అమరావతి నిర్మాణ పనుల్లో.. మరో సరికొత్త అధ్యాయం మొదలైపోయింది. తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన 58వ సీఆర్డీఏ (CRDA) సమావేశంలో.. రాజధాని రూపురేఖలను మార్చేలా కీలక నిర్ణయాలను తీసుకున్నారు.
కేబినెట్ సబ్‌కమిటీ చేసిన సిఫార్సులకు ఆమోదం తెలపడంతో పాటు, ఎప్పటి నుంచో పెండింగ్‌లో ఉన్న హైకోర్టు, అసెంబ్లీ నిర్మాణ పనులకు లైన్ క్లియర్ చేయడంతో ఇప్పుడు సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది. ఇంకా చెప్పాలంటే.. కేవలం ప్రభుత్వ కార్యాలయాలే కాకుండా, బ్యాంకింగ్ సేవలు, పొలిటికల్ పార్టీ ఆఫీసులకు కూడా స్థలాలను కేటాయించడంతో రాజధానిలో అసలైన సందడి మొదలుకాబోతోంది.
ఈ రాజధాని నిర్మాణం ఏపీకి ఇప్పుడు ఒక పెద్ద గేమ్ ఛేంజర్ కాబోతోంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌కు వచ్చే ప్రధాన లాభం పెట్టుబడులు. ఒక నగరం అన్ని హంగులతో నిర్మాణం అవుతుందంటే అక్కడ వేల కోట్ల వ్యాపారం, లక్షలాది మందికి ఆటోమేటిక్‌గా ఉపాధి లభిస్తుంది.
కూటమి ప్రభుత్వం ప్రతిపాదించిన గ్రీన్ అండ్ బ్లూ డిజైన్ల ప్రకారం.. నీరు, పచ్చదనంతో నిండిన అమరావతి (Amaravati)సిటీ అంతర్జాతీయ పర్యాటకులను కూడా ఆకర్షిస్తుంది. ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పార్కులు, రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థలు ఉండటం వల్ల భవిష్యత్తులో ఒక ఐటీ , నాలెడ్జ్ హబ్‌గా అమరావతి మారుతుంది. ఇది ఏపీ జీఎస్డీపీ (GSDP)ని అమాంతం పెంచడంతో పాటు, ఏపీకి ఒక బలమైన బ్రాండ్ ఇమేజ్‌ను కూడా తెచ్చిపెడుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
అయితే అమరావతి (Amaravati) నగరం ఎప్పటికి పూర్తవుతుందనే ప్రశ్న చాలామందిలో తలెత్తుతుంది. ప్రస్తుతం ప్రభుత్వం ఉన్న స్పీడును చూస్తుంటే, వచ్చే 3 నుంచి 5 ఏళ్లలోనే అంటే 2029-2030 నాటికి రాజధానిలోని ప్రధాన మౌలిక సదుపాయాలు, కీలక భవనాలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.
హైకోర్టు, అసెంబ్లీ వంటి ఐకానిక్ కట్టడాలను రెండేళ్లలో పూర్తి చేయాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే పెండింగ్ పనులను ఏజీఐసీఎల్ (AGICL)కు ట్రాన్స్‌ఫర్ చేయడం వల్ల పనుల్లో మరింతగా పారదర్శకత, వేగం పెరుగుతుందనేది తెలిసిందే. ఇలా అన్నీ అనుకున్నట్లు జరిగితే, మరో ఐదేళ్లలోపే అమరావతి ఒక జీవకళతో కూడిన మహానగరంగా మన కళ్ల ముందు సాక్షాత్కరిస్తుంది.
