Global Tariff: కొత్త గ్లోబల్ టారిఫ్ భారత్‌లో ఎలా ఉండబోతోంది?..మోదీ-ట్రంప్ దోస్తీ ఎలా పనికొస్తుంది?

Global Tariff :భారత్ కూడా అమెరికా వస్తువులైన మొక్కజొన్న, సోయా వంటి వాటిపై టారిఫ్‌లను తగ్గించడానికి అంగీకరించింది.

Global Tariff

ఎవరు ఏమన్నా.. ఏ దేశం తనను తిట్టుకున్నా తాను చేయాల్సింది మాత్రం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేసేస్తారు..చెప్పాల్సింది కూడా అలాగే చెప్పేస్తారు. తాను చెప్పిందే వేదం, తాను చేసిందే చట్టం అన్నట్లుగా మిగిలిన దేశాలను తన చెప్పుచేతల్లో పెట్టుకుంటారు.

నయానో,భయానో తాను అనుకున్నది సాధించేవరకూ నిద్రపోరు. దీనికోసం యుద్ధాలు చేయడానికి కూడా వెనుకాడరు. ఇలా చేసే ఇప్పుడు మరోసారి హాట్ టాపిక్ అయ్యారు. సుప్రీంకోర్టు చీవాట్లు పెట్టినా వెనక్కి తగ్గకుండా తన పంథాను కొనసాగిస్తుండటంపై ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిపోయారు.

డొనాల్డ్ ట్రంప్ తన అమెరికా ఫస్ట్ విధానంలో భాగంగా భారీగా విధించిన టారిఫ్‌లను ఫిబ్రవరి 20, 2026న అక్కడి సుప్రీంకోర్టు చట్టవిరుద్ధమని తేల్చి చెప్పింది. ఈ తీర్పుతో ట్రంప్ పాత పద్ధతిలో విధించిన సుంకాలు రద్దయినా కూడా, ఏమాత్రం తగ్గకుండా వెంటనే కొత్త అస్త్రాన్ని ప్రయోగించారు.

ట్రేడ్ యాక్ట్ 1974 కింద ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల వస్తువులపై 10 శాతం యూనిఫామ్ టారిఫ్‌(Global Tariff)ను ప్రకటించారు. ఇది ఫిబ్రవరి 24 నుండి అమల్లోకి రానుంది. సుప్రీంకోర్టు తీర్పును ఏకంగా పిచ్చి తీర్పు అని విమర్శించిన ట్రంప్, తన పంతాన్ని నెగ్గించుకోవడానికి ఇప్పుడు కొత్త చట్టాలను ఆశ్రయించడం అంతర్జాతీయ వాణిజ్య వర్గాల్లో చర్చనీయాంశమైంది.

అయితే ఈ గందరగోళంలో భారతదేశానికి ఒక రకంగా మంచి వార్తే వినబడుతోంది. గతంలో భారత్‌పై 18 శాతం నుంచి ఏకంగా 50 శాతం వరకు టారిఫ్‌లు (Global Tariff)ఉండేవి. ముఖ్యంగా రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్నందుకు భారత్‌పై ట్రంప్ కక్షతో విధించిన 25 శాతం శిక్షాత్మక సుంకాలతో మన ఎగుమతిదారులు విలవిలలాడిపోయారు.

కానీ తాజా నిర్ణయంతో ఆ భారం కేవలం 10 శాతానికి పడిపోయింది. దీనివల్ల మన దేశానికి చెందిన ఫార్మా, టెక్స్‌టైల్స్, జ్యువెలరీతో పాటు లెదర్ రంగాలకు భారీ ప్రయోజనం కలగబోతోంది . అంతేకాదు అమెరికా మార్కెట్‌లో మన వస్తువుల ధరలు 15 శాతం వరకు తగ్గే ఛాన్స్ ఉండటంతో, పోటీ పెరిగి ఎగుమతులు 20 నుంచి 30 శాతం పుంజుకుంటాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.

Global Tariff

అయితే మోదీ-ట్రంప్ మధ్య ఉన్న స్నేహపూర్వక సంబంధాలు ఇప్పుడు ఈ ట్రేడ్ డీల్‌ను మరింత ఈజీగా చేస్తున్నాయని నిపుణులు అంటున్నారు. భారత్ కూడా అమెరికా వస్తువులైన మొక్కజొన్న, సోయా వంటి వాటిపై టారిఫ్‌లను తగ్గించడానికి అంగీకరించింది.

మార్చి 2026 నాటికి పూర్తి స్థాయి ట్రేడ్ అగ్రిమెంట్ కనుక కన్ఫమ్ అయితే , భారత దేశానికి మరిన్ని మినహాయింపులు లభించే అవకాశం ఉంటుంది. రష్యా చమురు విషయంలో కూడా ట్రంప్ కొంత మెత్తబడటం మనకు ప్లస్ పాయింట్ అనే చెప్పొచ్చు.

మొత్తం మీద డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఈ 10 శాతం గ్లోబల్ టారిఫ్(Global Tariff) నిర్ణయం అలాగే పాత భారీ సుంకాలతో పోలిస్తే భారత్‌కు ఒక పెద్ద రిలీఫ్ అని చెప్పాలి. వచ్చే వారం వాషింగ్టన్‌లో జరగబోయే చర్చల్లో భారత ప్రతినిధులు మరిన్ని వెసులుబాట్లు సాధిస్తే మాత్రం, మన దేశ ఆర్థిక వ్యవస్థకు ఇది సరికొత్త ఊపునిస్తుందనడంలో అనుమానం అక్కర్లేదు.

మరిన్ని ఇంటర్నేషనల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version