Land Survey:ఏపీ భూసర్వేలో తప్పులు జరిగాయా? పాస్‌బుక్ లేదా? ఫిర్యాదు నుంచి పరిష్కారం వరకు ..

Land Survey: మీ భూమి సర్వేలో తప్పులు జరిగినా లేక మీకు ఇంకా పాస్‌బుక్ రాకపోయినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.

Land Survey

ఏపీలో ప్రతిష్టాత్మకమైన భూసర్వే (Land Survey)ప్రక్రియ కొనసాగుతోంది. అయితే ఈ సర్వేపై సుమారు 30 నుంచి 40 శాతం మంది రైతులు అసంతృప్తితో ఉన్నారని గణాంకాలు చెబుతున్నాయి. ముఖ్యంగా భూమి సరిహద్దుల లెక్కింపులో తప్పులు జరగడం, రికార్డుల వర్గీకరణలో లోపాలు, అధికారుల జాప్యంపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి.

ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఈ సమస్యల పరిష్కారానికి .. మార్చి 2026 నాటికి అన్ని ఫిర్యాదులను పరిష్కరించాలని డెడ్ లైన్ విధించింది. ఒకవేళ కనుక మీ భూమి సర్వే(Land Survey)లో తప్పులు జరిగినా లేక మీకు ఇంకా పాస్‌బుక్ రాకపోయినా మీరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. దీని కోసం ప్రభుత్వం మూడు రకాల మార్గాలను అందుబాటులోకి తెచ్చింది.

మొదటిది ఆన్‌లైన్ విధానం. దీనిలో మీరు నేరుగా మీ భూమి (meebhoomi.ap.gov.in) పోర్టల్‌లోకి వెళ్లి గ్రీవెన్స్ ట్యాబ్ ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. మీ ఆధార్ నంబర్, ఓటీపీ సహాయంతో లాగిన్ అయి, మీ జిల్లా, మండలం, గ్రామం , సర్వే నంబర్ వివరాలను ఎంటర్ చేయాలి. అక్కడ మీ సమస్యకు సంబంధించి అంటే సరిహద్దుల తప్పులు, విస్తీర్ణం తేడాలు లేదా తప్పుడు వర్గీకరణ వంటి ఆప్షన్లను ఎంచుకోవచ్చు. మీ దగ్గర ఉన్న అడంగల్ లేదా పాత పాస్‌బుక్ స్కాన్ కాపీని అప్‌లోడ్ చేసి సబ్మిట్ చేస్తే మీకు ఒక గ్రీవెన్స్ ఐడీ వస్తుంది. దీని ద్వారా మీ ఫిర్యాదు ఏ దశలో ఉందో ట్రాక్ చేయొచ్చు.

రెండవది స్పందన పోర్టల్‌లో కానీ హెల్ప్‌లైన్ ద్వారా కానీ ఫిర్యాదు చేయడం. 1100 లేదా 1800-425-4440 టోల్ ఫ్రీ నంబర్లకు ఫోన్ చేసి మీ సమస్యను నమోదు చేయెచ్చు. ఇది 24 గంటలూ అందుబాటులో ఉంటుంది.

ఇక మూడవది క్షేత్రస్థాయిలోనే ఫిర్యాదు చేయడం. ప్రతి శని, ఆదివారాల్లో జరిగే గ్రామ సభలు రైతులకు ఒక గొప్ప అవకాశం. అక్కడ విలేజ్ రెవెన్యూ ఆఫీసర్ (VRO) ను కలిసి ఫామ్-26 ద్వారా ఫిర్యాదు చేయొచ్చు. మీ పొరుగు రైతుల సాక్ష్యాలు ,పాత రికార్డులను చూపిస్తే వారు క్షేత్రస్థాయిలో రీ-సర్వే చేస్తారు.

అంతేకాకుండా చాలా మంది రైతులు ఎదుర్కొంటున్న మరో ప్రధాన సమస్య పాస్‌బుక్ లేకపోవడం.అయితే పాత పాస్‌బుక్ పోయినా లేదా ఇప్పటివరకు రాకపోయినా కొత్త క్యూఆర్ కోడ్ (QR Code) పాస్‌బుక్ పొందడం ఇప్పుడు చాలా ఈజీ. మీరు మీ భూమి వెబ్‌సైట్ నుం ిఈ-పాస్‌బుక్‌ను ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇది డిజిటల్ సంతకంతో ఉంటుంది కాబట్టి అన్ని రకాల రుణాలు , రాయితీలకు వర్తిస్తుంది. అయితే మీకు ఫిజికల్ పాస్‌బుక్ కావాలంటే మీసేవ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. కేవలం 15 నుంచి 30 రోజుల్లో మీ ఇంటికే కొత్త క్యూఆర్ కోడ్ పాస్‌బుక్ డెలివరీ అవుతుంది.

Land Survey

ఒకవేళ మీకు మీ భూమి సర్వే నంబర్ కూడా తెలియకపోతే ..విలేజ్ మ్యాప్ ద్వారా లేదా మీ పొరుగు రైతుల సర్వే నంబర్ల ఆధారంగా మీ భూమి వివరాలను తెలుసుకోవచ్చు. ప్రస్తుతం 2.2 కోట్ల కొత్త పాస్‌బుక్‌లను పంపిణీ చేసే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. ఫిర్యాదు చేసిన తర్వాత వారం రోజుల్లో క్షేత్రస్థాయి వెరిఫికేషన్ జరుగుతుంది .

తర్వాత 30 రోజుల్లోనే మీ సమస్యకు పరిష్కారం లభిస్తుంది. కాబట్టి రైతులు ఎలాంటి మధ్యవర్తులను నమ్మి మోసపోకుండా, ప్రభుత్వం కల్పించిన అధికారిక వెబ్‌సైట్లు, గ్రామ సభల ద్వారా తమ భూమి రికార్డులను సరిచేసుకోవచ్చు. మీ భూమి మీ హక్కు, దాన్ని కాపాడుకోవడంలో అప్రమత్తంగా ఉండాలన్న విషయాన్ని ఎప్పుడూ గుర్తు పెట్టుకోండి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version