Kidney Stones
బాడీలోని వ్యర్థాలను వడపోసి రక్తాన్ని క్లీన్ చేసే కిడ్నీలు మనందరి ఆరోగ్యానికి ఎంతో కీలకం. అయితే మనం తీసుకునే ఆహారం, లైఫ్ స్టైల్ వల్ల మూత్రపిండాలలో లవణాలు, ఖనిజాలు పేరుకుపోవడంతో అవి రాళ్లుగా మారుతుంటాయి. ఈ సమస్యను కొన్ని పద్ధతులు ఫాలో అయి ఈజీగా దూరం చేసుకోవచ్చు.
కిడ్నీలో రాళ్లు(Kidney Stones) రాకుండా ఉండాలన్నా, ఉన్నవి పోవాలన్నా మొదటి సూత్రం నీళ్లు.. శరీరాన్ని ఎప్పుడూ హైడ్రేటెడ్‌గా ఉంచుకోవాలి. రోజుకు కనీసం 3 నుంచి 4 లీటర్ల నీరు తాగాలి. మనం ఎంత ఎక్కువ నీళ్లు తాగితే, మూత్రం అన్ని ఎక్కువ సార్లు వస్తుంది.
వీలయితే బార్లీ నీళ్లు, మజ్జిగ లాంటివి కూడా తీసుకోవాలి. దీనివల్ల రాళ్లు ఏర్పడటానికి కారణమయ్యే కాల్షియం, ఆక్సలేట్ వంటి లవణాలు మూత్రం ద్వారానే బయటకు వెళ్లిపోతాయి. మూత్రం పసుపు రంగులో కాకుండా తెల్లగా కనిపిస్తే కనుక మీరు తగినంత నీరు తాగుతున్నారనే అర్థం.
ఆహారంలో ఉప్పు (సోడియం) ఎక్కువగా ఉంటే, అది యూరిన్‌లో కాల్షియం స్థాయిని పెంచుతుంది. ఇది కిడ్నీలో రాళ్లు ఏర్పడటానికి ప్రధాన కారణం. చిప్స్, ప్యాక్ చేసిన ఫుడ్స్, పచ్చళ్లు , అదనపు ఉప్పు ఉన్న పదార్థాలకు దూరంగా ఉండాలి.
నిమ్మకాయలు, నారింజ వంటి సిట్రస్ జాతి ఫ్రూట్స్‌లో సిట్రేట్ అనే పదార్థం ఉంటుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ ఏర్పడకుండా అడ్డుకుంటుంది. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగుతూ ఉండటం వల్ల కిడ్నీల ఆరోగ్యం బాగుంటుంది..
కిడ్నీలో ఏర్పడే స్టోన్స్‌లో ఎక్కువ శాతం కాల్షియం ఆక్సలేట్ రకానికి చెందినవి. కాబట్టి ఆక్సలేట్ ఎక్కువగా ఉండే పాలకూర, చాక్లెట్లు, నట్స్ లో బాదం వంటితో పాటు చిలగడదుంపలను మితంగా తీసుకోవాలి. ముఖ్యంగా వీటిని తీసుకున్నప్పుడు తగినంత క్యాల్షియం ఉండేలా పెరుగు లేదా పాలు కూడా కలిపి తీసుకుంటే ఆక్సలేట్ స్టోన్స్‌గా మారకుండా జీర్ణవ్యవస్థలోనే బయటకు వెళ్లిపోతాయి.
రెడ్ మీట్, చికెన్, గుడ్లు వంటి వాటిలో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తింటే శరీరంలో యూరిక్ యాసిడ్ పెరుగుతుంది. ఇది కిడ్నీలో స్టోన్స్ రావడానికి దారి తీస్తుంది. కాబట్టి ప్రోటీన్ కోసం నాన్ వెజ్ కాకుండా పప్పు ధాన్యాలు, గింజల మీద కూడా దృష్టి పెట్టాలి.
అలాగే ఎవరైనా సరే అంటే కిడ్నీలో రాళ్లు (Kidney Stones)ఉన్నవారు లేని వారు కూడా బరువును అదుపులో ఉంచుకోవాలి. అనవసరంగా పెయిన్ కిల్లర్ టాబ్లెట్లు వాడకూడదు.
కూల్ డ్రింక్స్, సోడాలకు దూరంగా ఉంటూ ఉండాలి. ఇలా జాగ్రత్తలు తీసుకుంటే కిడ్నీలో రాళ్లు పెరగకుండా ఉండటమే కాకుండా.. వచ్చిన రాళ్లు కూడా మెల్లమెల్లగా కరిగిపోతాయి.
