Properties in AP
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వ్యవసాయ రంగంలో చాలా కాలంగా రైతులను ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు తాజాగా ఒక మంచి పరిష్కారాన్ని చూపించింది. అదేమిటంటే, వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూముల (Inherited Agricultural Lands) రిజిస్ట్రేషన్ ఫీజును భారీగా తగ్గించడం. ఇప్పుడు కేవలం నామమాత్రపు స్టాంప్ డ్యూటీతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కల్పించారు.
ఇప్పటివరకు వారసత్వంగా ఆస్తి (Properties in AP)పంపకాలు చేసుకునేటప్పుడు, కుటుంబ పెద్ద వీలునామా (Will) రాయకుండా చనిపోతే, ఆ ఆస్తిని వారసులు పంచుకోవడానికి రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి వచ్చేది. గతంలో దీనికి ఆ భూమి మార్కెట్ విలువలో 1 శాతం, కొన్ని సందర్భాల్లో 3 శాతం వరకు స్టాంప్ డ్యూటీ కట్టాల్సి వచ్చేది.
ఉదాహరణకు, ఒక భూమి విలువ రూ.15 లక్షలు ఉంటే, రిజిస్ట్రేషన్ కోసం రైతులు వేలల్లో ఫీజు చెల్లించాల్సి వచ్చేది. ఈ ఖర్చు చిన్న, సన్నకారు రైతులకు పెద్ద భారంగా మారేది. దాంతో చాలామంది రైతులు రిజిస్ట్రేషన్ చేయించుకోకుండా, కేవలం తెల్లకాగితాలపై లేదా స్టాంప్ పేపర్లపై పంచుకున్నట్టు రాసుకునేవారు. దీనివల్ల రెవెన్యూ రికార్డుల్లో (భూ రికార్డుల్లో) యాజమాన్యం మారే మ్యుటేషన్ (Mutation) ప్రక్రియ జరగకపోయేది. చివరికి, వారికి పట్టాదారు పాసుపుస్తకాలు కూడా రాక, ప్రభుత్వ పథకాలు, పంట రుణాలు (Crop Loans) వంటివి అందక చాలా ఇబ్బందులు పడేవారు.
ఈ ఇబ్బందులను గమనించిన ఏపీ ప్రభుత్వం వారసత్వ వ్యవసాయ భూముల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సులభతరం చేస్తూ ఒక కీలకమైన జీవోను విడుదల చేసింది. ఈ జీవో ప్రకారం.. రూ.10 లక్షల లోపు విలువ ఉంటే: సబ్-రిజిస్ట్రార్ కార్యాలయం నిర్ధారించిన మార్కెట్ విలువ ప్రకారం ఆస్తి విలువ రూ.10 లక్షల లోపు ఉంటే, వారసులు స్టాంప్ డ్యూటీగా కేవలం రూ.100 (వంద రూపాయలు) మాత్రమే చెల్లిస్తే సరిపోతుంది.
రూ.10 లక్షలకు పైగా విలువ ఉంటే.. ఒకవేళ ఆ(Properties in AP) భూమి మార్కెట్ విలువ రూ.10 లక్షల కంటే ఎక్కువగా ఉంటే, అప్పుడు స్టాంప్ డ్యూటీగా రూ.1,000 (వెయ్యి రూపాయలు) చెల్లించాలి. ఈ ఫీజులు కేవలం నామమాత్రం కావడం వల్ల, రైతులకు వేలల్లో రిజిస్ట్రేషన్ ఫీజు ఆదా అవుతుంది.
ఈ తగ్గింపు కేవలం వారసత్వ వ్యవసాయ భూముల(Properties in AP)కు మాత్రమే వర్తిస్తుంది. అంటే, ఆస్తి యజమాని చనిపోయిన తర్వాత వీలునామా రాయకుండా ఉంటే, చట్టపరమైన వారసులు ఆ ఆస్తిని తమ మధ్య ఏకాభిప్రాయంతో భాగపంపిణీ చేసుకునేటప్పుడు ఈ రాయితీ వర్తిస్తుంది.
రైతులకు కలిగే అసలైన ప్రయోజనాలు.. నామమాత్రపు ఫీజుతో రిజిస్ట్రేషన్ పూర్తి కావడం వల్ల, ఆర్థిక భారం తగ్గుతుంది.
ఆటో మ్యుటేషన్.. ఇక్కడే ముఖ్యమైన విషయం ఉంది. సబ్-రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ అయిన వెంటనే, రెవెన్యూ రికార్డుల్లో భూమి యాజమాన్యం ఆటోమేటిక్‌గా వారసుల పేర్ల మీదకు మారుతుంది. దీనికోసం మళ్లీ తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం ఉండదు.
ఆటో మ్యుటేషన్ జరగడం వల్ల రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు కూడా జారీ అవుతాయి. దీంతో వారు తమ భూములపై చట్టపరంగా పూర్తి హక్కులను పొందగలుగుతారు.
రికార్డులు క్లియర్‌గా ఉండటం వల్ల పంట రుణాలు తీసుకోవడం, ప్రభుత్వ సంక్షేమ పథకాలు పొందడం సులభమవుతుంది.
భూమి యాజమాన్య హక్కులు స్పష్టంగా, అధికారికంగా మారడం వల్ల భవిష్యత్తులో కుటుంబ సభ్యుల మధ్య లేదా ఇతరులతో వచ్చే భూవివాదాలు కూడా తగ్గుతాయి.
అంతేకాకుండా, ప్రభుత్వం భూముల రీసర్వేను డిసెంబర్ 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ లోపు ఈ తక్కువ ఫీజు విధానం వారసత్వ ఆస్తుల రిజిస్ట్రేషన్లను వేగవంతం చేస్తుందని భావిస్తున్నారు. భవిష్యత్తులో గ్రామ సచివాలయాలనే భూమి సంబంధిత పనులకు ‘వన్ స్టాప్ సొల్యూషన్’గా మార్చే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది.
