Train
తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామితో పాటు షిర్డీ సాయిబాబా భక్తులకు శుభవార్త వినిపించింది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు. పవిత్ర పుణ్యక్షేత్రాలైన తిరుపతి, షిర్డీ మధ్య రోజువారీ రైలు(Train) సర్వీస్ ప్రారంభమైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన వినతికి స్పందించి, కేంద్ర రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. దశాబ్దాలుగా భక్తులు ఎదుర్కొంటున్న ప్రయాణ కష్టాలకు ఈ రైలు సేవలు ఒక శాశ్వత పరిష్కారాన్ని అందించనున్నాయి.
భక్తుల కష్టాలు తీర్చే రైలు(Train)…ఇప్పటివరకు తిరుపతి నుంచి షిర్డీ కి వెళ్లాలంటే భక్తులకు సరైన డైరెక్ట్ రైలు సదుపాయం లేదు. బస్సులు, ప్రైవేట్ వాహనాలపై ఆధారపడటం, లేదా ముంబై, హైదరాబాద్ వంటి నగరాలకు వెళ్లి అక్కడ నుంచి మరో రైలు పట్టుకోవాల్సి వచ్చేది. ఈ ప్రయాణం చాలా ఖర్చుతో కూడుకోవడంతో పాటు, టైమ్ చాలా వృధా అయ్యేది. ఈ కొత్త రైలు సర్వీస్ ప్రయాణ సమయాన్ని ఖర్చును గణనీయంగా తగ్గిస్తుంది. సుమారు 1,437 కిలోమీటర్ల దూరాన్ని ఈ రైలు 30 గంటల 45 నిమిషాల్లో చేరుకుంటుంది. ఇది భక్తులకు చాలా సౌకర్యాన్నిస్తుంది.
Temple: కోణార్క్ నుంచి చిదంబరం వరకు..ఆలయ నిర్మాణంలో ఖగోళ, గణిత శాస్త్రం
రైలు నెంబర్ 07637 (తిరుపతి-షిర్డీ ) రోజు ఉదయం 4 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10:45 గంటలకు శిర్డీ చేరుకుంటుంది. అలాగే రైలు నెంబర్ 07638 (షిర్డీ -తిరుపతి) రోజు మధ్యాహ్నం 1:50 గంటలకు షిర్డీ లో బయలుదేరి మరుసటి రోజు రాత్రి 8:30 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, ధర్మవరం, రాయచూర్, షోలాపూర్, దౌండ్ వంటి ప్రధాన స్టేషన్ల గుండా వెళుతుంది. ఇందులో స్లీపర్, ఏసీ 2-టైర్, ఏసీ 3-టైర్ మరియు జనరల్ కోచ్‌లు అందుబాటులో ఉన్నాయి.
మరోవైపు ఈ రైలు(Train) సేవలు కేవలం భక్తులకు సౌకర్యాన్ని మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా తోడ్పడతాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసిన అభ్యర్థనను కేంద్రం వెంటనే మన్నించడం రాష్ట్రానికి కేంద్రం నుంచి లభిస్తున్న సహకారానికి ఒక ఉదాహరణ. ఈ రైలు సేవలు ఆయా ప్రాంతాల్లో పర్యాటక రంగాన్ని ప్రోత్సహిస్తాయి. దీనివల్ల స్థానిక వ్యాపారాలు, ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయి. ప్రయాణికుల సంఖ్య పెరిగితే రైల్వేకు కూడా ఆర్థికంగా లాభాలు వస్తాయి.మొత్తంగా, ఈ రోజువారీ రైలు సేవలు భక్తుల జీవితాలను సులభతరం చేయడమే కాకుండా, రాష్ట్రానికి ఒక ముఖ్యమైన ఆర్థిక, పర్యాటక ప్రయోజనాన్ని కూడా చేకూరుస్తాయి.