Lokesh
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ (Lokesh)అక్టోబర్ 19 నుంచి 24వ తేదీ వరకు ఆస్ట్రేలియాలో పర్యటించనున్నారు. ఆస్ట్రేలియా ప్రభుత్వం తరపున హైకమిషనర్ ఫిలిప్ గ్రీన్ పంపిన ప్రత్యేక ఆహ్వానం మేరకు (Special Visits Program) ఈ పర్యటన ఖరారైంది. మానవ వనరులు, సాంకేతిక , ఆర్థికాభివృద్ధి రంగాల్లో ఏపీ నాయకత్వాన్ని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రశంసించింది.
ఈ పర్యటనలో మంత్రి లోకేష్(Lokesh) రెండు ప్రధాన లక్ష్యాలపై దృష్టి సారించనున్నారు. ఆస్ట్రేలియాలోని అధునాతన బోధన ,విద్యావిధానాలపై అధ్యయనం చేయడంతో పాటు నవంబర్ 14, 15 తేదీల్లో విశాఖపట్నంలో జరగనున్న సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ (CII Partnership Summit) విజయం కోసం రోడ్ షోలలో పాల్గొనడంపై దృష్టి సారించారు.
మంత్రి లోకేష్(Lokesh) అక్టోబర్ 19న ఆస్ట్రేలియా కాలమానం ప్రకారం ఉదయం 11:30 గంటలకు సిడ్నీ చేరుకుంటారు. అదే రోజు సాయంత్రం, సిడ్నీ క్రికెట్ గ్రౌండ్స్‌లో నిర్వహించే తెలుగు డయాస్పోరా సమావేశంలో పాల్గొని, ఆస్ట్రేలియాలో నివసిస్తున్న తెలుగువారితో సమావేశమవుతారు.
అక్టోబర్ 20న, మంత్రి యూనివర్సిటీ ఆఫ్ న్యూసౌత్ వేల్స్ (UNSW) ని సందర్శిస్తారు. ఆ తరువాత బిజినెస్ కౌన్సిల్ ఆఫ్ ఆస్ట్రేలియా ఆధ్వర్యంలో న్యూసౌత్ వేల్స్ ఎంపీలు, బిజినెస్ ఎగ్జిక్యూటివ్‌ల సమావేశంలో పాల్గొంటారు. ముఖ్యంగా, ఆస్ట్రేలియా స్కిల్స్ & ట్రైనింగ్ మంత్రి ఆండ్రూ గిల్స్‌తో కలిసి TAFE NSW Ultimo క్యాంపస్‌ను సందర్శించి, సాంకేతిక విద్యపై అధ్యయనం చేస్తారు. సాయంత్రం NSW పార్లమెంట్ హౌస్‌లో ఆస్ట్రేలియా ఇండియా బిజినెస్ కౌన్సిల్ ప్రతినిధులతో నిర్వహించే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోలో పాల్గొంటారు.
అక్టోబర్ 21న మంత్రి పర్రమట్టలో సీఫుడ్స్ ఇండస్ట్రీ ఆస్ట్రేలియా నిర్వహించే ఆక్వా ప్రతినిధుల సమావేశంలో పాల్గొంటారు. ఆ తర్వాత వెస్ట్రన్ సిడ్నీ యూనివర్సిటీ (WSU)ని సందర్శించి వ్యవసాయ సాంకేతిక నిపుణులతో సమావేశమవుతారు. న్యూసౌత్ వేల్స్ ఇన్నొవేషన్, సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రులతో కూడా లోకేష్ భేటీ కానున్నారు.
అక్టోబర్ 22న గోల్డ్ కోస్ట్‌లోని గ్రిఫిత్ యూనివర్సిటీని సందర్శించిన తర్వాత, బ్రిస్బేన్‌లో క్వీన్స్‌లాండ్ ట్రేడ్ అండ్ ఇన్వెస్టిమెంట్ రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొంటారు. ఆంధ్రప్రదేశ్‌లో అధునాతన స్పోర్ట్స్ స్టేడియం నిర్మాణంపై ఆర్కిటెక్ట్ లీడర్‌షిప్ టీమ్‌తో ప్రత్యేకంగా సమావేశమవుతారు.
అక్టోబర్ 23న మెల్‌బోర్న్‌లోని యూనివర్సిటీ ఆఫ్ మెల్‌బోర్న్‌ను సందర్శిస్తారు. ఆ రోజు సాయంత్రం యర్రా వ్యాలీలోని ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వైన్ ఇండస్ట్రీని సందర్శించి, ట్రెజరీ వైన్స్ ఎస్టేట్ ప్రతినిధులతో సమావేశమవడం ఈ పర్యటనలో మరో ఆసక్తికర అంశం. విక్టోరియన్ స్కిల్స్ మంత్రితో కూడా లోకేష్ సమావేశమవుతారు.
అక్టోబర్ 24న ఆస్ట్రేలియన్ ట్రేడ్ ఇన్వెస్ట్‌మెంట్ కమిషన్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ ఎడ్యుకేషన్‌పై జరిగే రౌండ్‌టేబుల్ సమావేశంలో పాల్గొని, గెస్ట్ హోటల్‌లో జరిగే సీఐఐ పార్టనర్‌షిప్ సమ్మిట్ రోడ్ షోను ముగిస్తారు. ఆ రోజు మధ్యాహ్నం విక్టోరియా క్రికెట్ గ్రౌండ్‌ను సందర్శించి స్పోర్ట్స్ టెక్నాలజీ, మౌలిక సదుపాయాలను పరిశీలిస్తారు.
మంత్రి లోకేష్ 24వ తేదీ రాత్రి మెల్‌బోర్న్ నుంచి బయలుదేరి 25వ తేదీ రాత్రికి హైదరాబాద్ చేరుకుంటారు. ఏపీకి పెట్టుబడులు, అత్యాధునిక విద్యా విధానాలను తీసుకురావడానికి ఈ పర్యటన కీలకం కానుంది.