Postal Department
ఏపీ ప్రజలకు పోస్టల్ శాఖ(Postal Department) సరికొత్త టెక్నాలజీని అందిస్తూ తీపి కబురు అందించింది. ఇకపై పోస్టాఫీస్ టైమింగ్స్ ముగిసిపోయాయని ఆందోళన చెందాల్సిన పని లేదు. ఎందుకంటే రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో రోజుకు 24 గంటల పాటు సేవలు అందించేలా అధికారులు సరికొత్త ఏర్పాట్లు చేశారు.
ఈ నిర్ణయంతో అర్ధరాత్రి వేళ కూడా స్పీడ్ పోస్టులు,ఎమర్జెన్సీ పార్శిళ్లను పంపించుకునే వెసులుబాటు ఇప్పుడు ఏపీ వాసులకు అందుబాటులోకి వచ్చింది. విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు, తిరుపతి, రాజమండ్రి, ఒంగోలు, నెల్లూరు, కడప, కర్నూలు, అనంతపురం , గుంతకల్లు వంటి 11 మెయిన్ సీటీలలో ఈ 24/7 విధానాన్ని అమలు చేస్తూ పోస్టల్ శాఖ ఈ నిర్ణయాన్ని తీసుకుంది.
దీనివల్ల రాత్రివేళల్లో ఎమర్జెన్సీకి వాడే మందులు ,ఇంపార్టెంట్ డాక్యుమెంట్లు వంటివి పంపాల్సి వచ్చినా పనివేళలతో సంబంధం లేకుండా ప్రజలు తమ పార్శిళ్లను వేగంగా పంపొచ్చు. దీంతో పాటు ఏపీ వ్యాప్తంగా ఉన్న 242 పట్టణాల్లో ప్రస్తుతం ఉన్న పోస్టాఫీస్ పనివేళలను కూడా ఒకటి నుంచి రెండు గంటల పాటు పొడిగించారు. దీనివల్ల సాయంత్రం ఆఫీసుల నుంచి వచ్చే ఉద్యోగులకు, సామాన్యులకు కూడా పోస్టాఫీసు సేవలు అందుబాటులో ఉంటాయి.
ఇటీవల పోస్టల్ శాఖ(Postal Department)లో ప్రవేశపెట్టిన ఐటీ 2.0 సాఫ్ట్‌వేర్..ఈ విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. ఈ సాఫ్ట్‌వేర్ ద్వారా జీపీవోలు, సబ్ పోస్టాఫీసుల మధ్య కనెక్టివటీ పెరగడంతో డేటా ఎంట్రీ , ట్రాకింగ్ సర్వీసులు గతంలో కంటే చాలా స్పీడప్ అయ్యాయి. ఏ పోస్ట్ ఎక్కడుందో క్షణాల్లో తెలుసుకునే అవకాశం కలిగింది. టెక్నాలజీని వాడుకుంటూ ప్రజలకు సేవలను మరింత దగ్గర చేయడమే లక్ష్యంగా పోస్టల్ శాఖ ఈ భారీ మార్పులు చేపట్టింది.
అంతేకాకుండా పోస్టల్ ఏటీఎం లేదా స్మార్ట్ పార్శిల్ లాకర్స్ తో మరో వినూత్న ప్రయోగానికి కూడా తెర లేపింది. మనం ఇంట్లో లేని సమయంలో మనకు వచ్చిన పోస్ట్‌లను వెనక్కి తీసుకెళ్తే..దాని కోసం తిరిగి మనం పోస్టాఫీసు చుట్టూ తిరిగే బాధ లేకుండా ఈ వ్యవస్థను తెస్తున్నారు.
దీంతో పోస్టాఫీసుకు వెళ్లకుండానే..మీ ఫోన్‌కు వచ్చే ఒక సీక్రెట్ పిన్ నంబర్‌ను దగ్గరలోని పోస్టల్ ఏటీఎంలో ఎంటర్ చేస్తే చాలు, ఆ లాకర్ తెరుచుకుని మీ పార్శిల్ మీ చేతికి అందుతుంది. ఇప్పటికే హైదరాబాద్‌లోని కొన్ని సర్కిళ్లలో విజయవంతమైన ఈ ప్రాజెక్టును.. త్వరలోనే ఆంధ్రప్రదేశ్‌లోని అన్ని ప్రధాన సెంటర్లలో ప్రవేశపెట్టబోతున్నారు.
