President: అనగనగా ఒక రాష్ట్రపతి… ఆయన ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని ఎలా రక్షించారంటే!

President: ఎన్టీఆర్‌కు పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా కూడా అప్పటి గవర్నర్ రామ్‌లాల్ అసెంబ్లీలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు.

President

తెలుగువారి ఆత్మగౌరవం.. ఆ పేరు చెబితే ఒక్కసారిగా మనకు గుర్తుకొచ్చేది ఎన్టీఆర్. ఆయన తెలుగు రాజకీయాల్లో ఓ సంచలనం. ఓ ప్రభంజనం. కేవలం 9 నెలల వ్యవధిలోనే ముఖ్యమంత్రి అయిన గొప్ప నాయకుడు. అయితే, ఆయన హయాంలోనే ఒకసారి ఆంధ్ర రాజకీయాలు అల్లకల్లోలం అయ్యాయి. గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లిన ఆయనకు నమ్మిన వ్యక్తే వెన్నుపోటు పొడిచారు. దీంతో ఎందరో అభిమానులు రోడ్లపైకి వచ్చారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడింది. ఇలాంటి క్లిష్ట సమయంలో ఒక వ్యక్తి.. కేవలం ఒకే ఒక వ్యక్తి రంగంలోకి దిగారు. ఏకంగా దేశ రాష్ట్రపతిగా ఉన్న ఆయన.. ఎన్టీఆర్ ప్రభుత్వాన్ని కాపాడారు.

1984లో తెలుగుదేశం పార్టీలో ఏర్పడిన సంక్షోభం తెలుగు రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేక అధ్యాయం. ఆ సమయంలో ఎన్టీ రామారావు గుండె ఆపరేషన్ కోసం అమెరికా వెళ్లారు. ఆయన లేని సమయాన్ని ఆసరాగా తీసుకుని సీనియర్ మంత్రిగా ఉన్న నాదెండ్ల భాస్కరరావు.. ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు చెప్పుకొని ముఖ్యమంత్రి పీఠాన్ని ఆక్రమించారు. నాటి ప్రధాని ఇందిరా గాంధీ మద్దతుతో, అప్పటి గవర్నర్ రామ్‌లాల్ కూడా నాదెండ్లకు అనుకూలంగా వ్యవహరించారు.

President

అమెరికా నుంచి గుండె ఆపరేషన్ చేయించుకుని హైదరాబాద్‌కు తిరిగి వచ్చిన రామారావుకు ఈ విషయం తెలిసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తన ఇంట్లోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాల కారణంగా నాదెండ్లను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని నిర్ణయించారు. ఆగస్టు 14 నుంచి సెప్టెంబర్ 16 వరకు నాదెండ్ల ముఖ్యమంత్రిగా కొనసాగారు. ఆ ఒక నెల రోజులు ఎన్టీఆర్‌కు మద్దతుగా బీజేపీ, కమ్యూనిస్టు పార్టీలు, జనతా దళ్ నాయకులు కూడా పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహించారు. అనంతపురం జిల్లాలో ఒక మహిళా నేత రోడ్డుపైకి వచ్చి నాదెండ్ల, ఇందిరా గాంధీల దిష్టిబొమ్మలను తగలబెట్టడంతో ఈ నిరసన జ్వాలలు రాష్ట్రమంతా వ్యాపించాయి.

ఎన్టీఆర్‌కు పూర్తిస్థాయిలో ఎమ్మెల్యేల మద్దతు ఉన్నా కూడా అప్పటి గవర్నర్ రామ్‌లాల్ అసెంబ్లీలో బలం నిరూపించుకునే అవకాశం ఇవ్వలేదు. ఈ పరిస్థితుల్లో రామారావు అప్పటి రాష్ట్రపతి(President) జ్ఞానీ జైల్ సింగ్‌కు ఫోన్ చేసి మొరపెట్టుకున్నారు. అప్పుడు జైల్ సింగ్ ఒక కీలకమైన సలహా ఇచ్చారు. తన మద్దతుదారులైన ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌ వద్దకు తీసుకువచ్చి, బలం నిరూపించుకోమని చెప్పారు. ఎందుకంటే అలా చేస్తే తప్ప వాస్తవాలు ఇందిరా గాంధీకి తెలియవని చెప్పారు.

President

జైల్ సింగ్ ఇచ్చిన సలహాతో ఎన్టీఆర్ తన ఎమ్మెల్యేలందరినీ ఢిల్లీకి తరలించి రాష్ట్రపతి భవన్‌ ముందు బలం ప్రదర్శించారు. ఆ తర్వాత జైల్ సింగ్ ఇందిరా గాంధీకి ఒక నోట్ పంపారు. అందులో స్పష్టంగా ఎమ్మెల్యేల మద్దతు ఎన్టీఆర్‌కే ఉందని, మార్చాల్సింది రామారావును కాదని, గవర్నర్ రామ్‌లాల్‌ను అని స్పష్టం చేశారు. దాంతో మనసు మార్చుకున్న ఇందిరా గాంధీ తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకునే అవకాశం రామారావుకు ఇచ్చారు. అలాగే గవర్నర్ రామ్‌లాల్‌ను ఉన్నపళంగా మార్చివేశారు.

ఇటీవల, నాటి రాష్ట్రపతి(President) ప్రెస్ సెక్రటరీ, మాజీ రాజ్యసభ సభ్యుడు టార్లోచన్ సింగ్ ఒక ఇంటర్వ్యూలో ఈ ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. జైల్ సింగ్ లేకపోతే నాదెండ్లను తొలగించినా, ఇందిర రాష్ట్రపతి పాలనకు మొగ్గు చూపే అవకాశం ఉండేదని చెప్పారు. కొందరు ప్రజా ఉద్యమాలకు తలొగ్గి ఇందిర ఈ నిర్ణయం తీసుకున్నారని, మరికొందరు కాంగ్రెస్ సీనియర్లు ఆమెకు వాస్తవాలు చెప్పారని అంటారు. ఈ రెండు వెర్షన్‌లకు భిన్నంగా జైల్ సింగ్ పాత్రను వెల్లడించడం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. చివరకు, సెప్టెంబర్ 16న ఎన్టీ రామారావు తిరిగి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు.

NTR: ఎన్టీఆరే కాదు తారక్ ఫ్యాన్స్ కూడా సెన్సేషనే.. ఎందుకలా అంటారా?

Exit mobile version