CII conference
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పెట్టుబడుల వేటలో మరో మైలురాయిని అధిగమించింది. విశాఖపట్నం వేదికగా రెండు రోజుల పాటు జరిగిన ప్రతిష్ఠాత్మక 30వ సీఐఐ భాగస్వామ్య సదస్సు (CII Partnership Summit) ద్వారా రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయి. ఈ సదస్సు ముగింపు సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారిక ప్రకటన చేశారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించిన వివరాల ప్రకారం, ఈ సీఐఐ (CII conference )సదస్సు ద్వారా ఏపీకి మొత్తం రూ. 13 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. అంతేకాకుండా, 18 నెలల కాలంలోనే రాష్ట్రానికి అందిన మొత్తం పెట్టుబడులు రూ. 22 లక్షల కోట్లకు చేరాయని ఆయన స్పష్టం చేశారు. ఈ భారీ పెట్టుబడులు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు మరియు ఉపాధి అవకాశాలకు కొత్త ఊపునివ్వనున్నాయి.
సీఐఐ సమ్మిట్‌లో జరిగిన ఒప్పందాల వివరాలు..
సదస్సు (CII conference )మొదటి రోజు (శుక్రవారం).. రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా 41 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. వీటి విలువ రూ. 8 లక్షల 26 వేల 668 కోట్లు. ఈ ఒప్పందాల ద్వారా 4 లక్షల 15 వేల 890 మందికి ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి.
సదస్సు ప్రారంభానికి ముందు (గురువారం.. ప్రారంభానికి ముందే 35 సంస్థలతో ఒప్పందాలు కుదిరాయి, వీటి విలువ రూ. 3 లక్షల 65 వేల 304 కోట్లు.
శ్రీసిటీలో యూనిట్ల ప్రారంభం..సీఎం చంద్రబాబు విశాఖలో సీఐఐ సదస్సు వేదిక నుంచే శ్రీసిటీలోని మరికొన్ని యూనిట్లను వర్చువల్‌గా ప్రారంభించారు. వీటితో పాటు, 12 కొత్త ప్రాజెక్టుల ఏర్పాటుకు కంపెనీలతో అవగాహన ఒప్పందాలు (MoUలు) కుదుర్చుకున్నారు. ఈ 12 ప్రాజెక్టుల ద్వారా 12,365 మందికి ఉద్యోగావకాశాలు వస్తాయని ఆయన తెలిపారు. 2028 నాటికి శ్రీసిటీని ఉత్తమ పారిశ్రామిక ప్రాజెక్టుగా మారుస్తామని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.
రాయలసీమకు కీలక ప్రాజెక్టులు..రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిపై దృష్టి సారించిన సీఎం, ప్రాంతాల వారీగా రాబోయే కీలక ప్రాజెక్టులను వివరించారు.ఈ ప్రాంతానికి స్పేస్ సిటీ , డ్రోన్ సిటీ వంటి అధునాతన ప్రాజెక్టులు రాబోతున్నాయని, అలాగే ఇక్కడ బ్యాటరీ ఉత్పత్తి పరిశ్రమలు కూడా ఏర్పాటు కానున్నాయని తెలిపారు.
రాప్తాడులో వస్త్ర పరిశ్రమ ఏర్పాటు కానుంది. అనంతపురం జిల్లాలోని టేకులోడులో ఏరో స్పేస్ పరిశ్రమ రానున్నట్లు వివరించారు. ఏపీకి మూడు రేమాండ్ ప్రాజెక్టులు రాబోతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు.
ఈ పరిశ్రమలన్నింటి ద్వారా రాష్ట్రంలో మొత్తంగా 20 లక్షలకు పైగా ఉద్యోగాలు వస్తాయని చంద్రబాబు నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. సీఐఐ సదస్సు ద్వారా ఏపీ పెట్టుబడుల గమ్యస్థానంగా తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకుందని ఆయన పేర్కొన్నారు.
