TTD
తిరుమల తిరుపతి దేవస్థానం (TTD)లో జరిగిన శ్రీవారి పరకామణి దొంగతనం కేసు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆదేశాలతో మళ్లీ తెరపైకి రావడంతో.. రాజకీయ, న్యాయ రంగాల్లో హాట్ టాపిక్ అవుతోంది. హైకోర్టు ఈ కేసు విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయడంతో, రాష్ట్ర సీఐడీ (CID) తాజాగా ఈ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టింది.
ఈ కేసు 2023 ఏప్రిల్‌లో జరిగింది. తిరుమలలోని పరకామణి విభాగంలో పనిచేస్తున్న సీ. రవికుమార్ అనే ఉద్యోగి ఏకంగా 920 అమెరికన్ డాలర్లను దొంగిలించినట్లు టీటీడీ(TTD) విజిలెన్స్ అధికారులు గుర్తించారు. ఈ విషయం వెలుగులోకి వచ్చిన తర్వాత, రవికుమార్ కుటుంబం పాప పరిహారంగా అంటూ రూ.14 కోట్ల విలువైన ఆస్తులను టీటీడీ పేరుతో రాసిచ్చింది.
ఆ తరువాత, 2023 సెప్టెంబర్‌లో లోక్ అదాలత్ ముందు ఈ కేసు రాజీ చేసి ముగించబడింది. అయితే, దొంగతనం వంటి క్రిమినల్ కేసును లోక్ అదాలత్‌లో రాజీ చేయడం చట్టబద్ధమా అనే వివాదం మొదలైంది. దీంతో పలువురు జర్నలిస్టులు ఈ రాజీ నిర్ణయాన్ని సవాలు చేస్తూ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు, పరకామణి దొంగతనం కేసులోని రికార్డులు, లోక్ అదాలత్ ఒప్పంద పత్రాలు, పోలీసు రిపోర్టులు, మరియు టీటీడీ తీర్మానాలను సీజ్ చేయాలని ఆదేశించింది.
అయితే, కోర్టు ఆదేశాలు సక్రమంగా పాటించకపోవడంతో, న్యాయస్థానం పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిని అనుసరించి, సీఐడీ డీజీ రవి శంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో ఒక ప్రత్యేక బృందం తిరుమల చేరుకుని, కేసుకు సంబంధించిన ఫైల్స్, సీసీటీవీ ఫుటేజ్, అసలు ఫిర్యాదుతో పాటు ఛార్జ్ షీట్ వంటి ముఖ్య డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకుంది.
ఈ కేసు మళ్లీ తెరపైకి రావడంతో తిరుమల వేదికగా రాజకీయ రంగు పులుముకుంది. అప్పటి టీటీడీ(TTD) పాలక మండలి మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డిపై, ప్రస్తుత బోర్డు సభ్యుడు భానుప్రకాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. రవికుమార్ నుండి స్వీకరించిన ఆస్తుల విలువ అలాగే రాజీ ప్రక్రియ అవినీతికి నిదర్శనమని భానుప్రకాశ్ రెడ్డి పేర్కొన్నారు.
అయితే, భూమన కరుణాకర్ రెడ్డి ఈ ఆరోపణలను ఖండించారు. ఆయన దొంగతనం జరిగింది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడని, తన హయాంలో అలాంటి చర్యలకు చోటు లేదని స్పష్టం చేశారు. “నా పాలనలో జరిగిందని నిరూపిస్తే తల నరుక్కుంటాను” అంటూ భూమన బహిరంగ సవాల్ విసిరారు. అదే సమయంలో, ఈ కేసుపై సీబీఐ దర్యాప్తునకు సహకరించడానికి తాను సిద్ధంగా ఉన్నానని ప్రకటించారు.
సీఐడీ అధికారులు పరకామణి ఫుటేజ్‌లు, రికార్డులు,లెక్కింపుల పత్రాలను సీజ్ చేశారు. ప్రాథమిక అనుమానాల ప్రకారం, ఈ దొంగతనం వెనుక రూ.100 కోట్ల విలువైన మోసాలు, బినామీ ఆస్తులు ఉన్నాయనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ వ్యవహారంలో అప్పటి టీటీడీలోని ఉన్నతాధికారుల ప్రమేయం ఉందా లేదా అనే దానిపైనా సీఐడీ సమగ్రంగా విచారణ కొనసాగిస్తోంది.
ప్రస్తుతం, సీసీ ఫుటేజ్‌ల పరిశీలన, ఆస్తుల రిజిస్ట్రేషన్ వివరాలు, లోక్ అదాలత్ రాజీ ప్రక్రియ వంటి అంశాలపై సీఐడీ లోతైన దర్యాప్తు కొనసాగిస్తోంది. సీజ్ చేసిన డాక్యుమెంట్లను సీల్డ్ కవర్‌లో హైకోర్టుకు సమర్పించనుంది. ఈ పరకామణి చోరీ వ్యవహారం ఎవరెవరిని నిందితులుగా తేలుస్తుందో అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.