Nepal: నేపాల్‌లో ఉద్రిక్తత..తెలుగు వారిని రప్పించడానికి ఏపీ ప్రభుత్వం ప్రత్యేక చర్యలు

Nepal: జెన్-జెడ్' యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో దేశంలో అల్లకల్లోలం రేగింది. ఈ పరిస్థితి అక్కడ ఉన్న తెలుగు వారితో పాటు, ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్లోనూ తీవ్ర ఆందోళనను పెంచుతుంది.

Nepal

ప్రకృతి అందాలకు నిలయమైన నేపాల్(Nepal) ఇప్పుడు హింసాత్మక నిరసనలతో అట్టుడుకుతోంది. ముఖ్యంగా, ‘జెన్-జెడ్’ యువత చేపట్టిన నిరసనలు తీవ్ర రూపం దాల్చడంతో దేశంలో అల్లకల్లోలం రేగింది. ఈ పరిస్థితి అక్కడ ఉన్న తెలుగు వారితో పాటు, ఇక్కడ వారి కుటుంబ సభ్యుల్లోనూ తీవ్ర ఆందోళనను పెంచుతుంది. దీంతో ఏపీ ప్రభుత్వం నేపాల్‌లో చిక్కుకున్న రాష్ట్ర వాసులను సురక్షితంగా రప్పించడానికి త్వరితగతిన చర్యలు చేపట్టింది.

నేపాల్‌లో(Nepal) ఏం జరుగుతోంది?..సోషల్ మీడియాపై నిషేధంతో మొదలైన ఈ నిరసనలు, ప్రభుత్వంపై యువతలో పేరుకుపోయిన కోపం, అవినీతి నిరుద్యోగం వంటి సమస్యల కారణంగా హింసాత్మకంగా మారాయి. నిరసనకారులు పార్లమెంట్, ప్రధాని నివాసం వంటి ప్రభుత్వ భవనాలకు నిప్పుపెట్టారు, ప్రభుత్వ వాహనాలను తగలబెట్టారు. ఈ ఉద్రిక్త పరిస్థితుల వల్ల ఎయిర్‌పోర్ట్‌లు మూసివేశారు, సైన్యం రంగంలోకి దిగింది. ఇలాంటి పరిస్థితులు అక్కడ ఉన్న తెలుగు వారి భద్రతపై ఆందోళనను పెంచాయి.

నేపాల్‌లో నెలకొన్న పరిస్థితిపై ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ఉన్నతాధికారులతో కలిసి సచివాలయంలోని ఆర్టీజీఎస్ (రియల్ టైమ్ గవర్నెన్స్) సెంటర్‌లో సమీక్ష నిర్వహించారు. అక్కడ చిక్కుకున్న తెలుగు వారితో ఆయన వీడియో కాల్‌లో మాట్లాడారు. తమ పరిస్థితిని వారు లోకేష్‌కు వివరించారు. ప్రాథమిక సమాచారం ప్రకారం, సుమారు 240 మంది తెలుగువారు నేపాల్‌లో చిక్కుకున్నట్లు అధికారులు గుర్తించారు. వీరిని సురక్షితంగా రప్పించడానికి కాఠ్‌మాండూ నుంచి విశాఖపట్నానికి ఒక ప్రత్యేక విమానం ఏర్పాటు చేయాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు.

Nepal

సహాయ కేంద్రాలు, హెల్ప్‌లైన్‌లు

నేపాల్‌లో చిక్కుకున్న తమవారిని సంప్రదించడానికి,వారి భద్రత గురించి తెలుసుకోవడానికి ఆందోళనగా ఉన్న కుటుంబాల కోసం ఏపీ ప్రభుత్వం ప్రత్యేక హెల్ప్‌లైన్‌లను ఏర్పాటు చేసింది.

ఢిల్లీలోని ఏపీ భవన్: +91 9818395787
రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీఎస్): 08632381000 (ఎక్స్‌టెన్షన్ నెంబర్: 8001, 8005)
APNRTS 24/7 హెల్ప్ లైన్: 0863 2340678 (వాట్సాప్: +91 8500027678)
ఇమెయిల్: helpline@apnrts.com, info@apnrts.com
భారత ప్రభుత్వం కూడా కాఠ్‌మాండూలోని రాయబార కార్యాలయంలో హెల్ప్‌లైన్లను ఏర్పాటు చేసింది: +977-980 860 2881 / +977- 981 032 6134.

ఈ పరిస్థితిలో అక్కడ చిక్కుకున్నవారు, ఇక్కడ వారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా తీసుకుంటున్న ఈ చర్యలు వారిలో కొంత ధైర్యాన్ని నింపుతున్నాయి. నేపాల్‌లో ఉన్న తెలుగు వారిని త్వరలో సురక్షితంగా వెనక్కి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి.

Varun Tej:మెగా వారసుడు వచ్చేశాడు.. వరుణ్ తేజ్, లావణ్యల పండంటి బిడ్డ!

Exit mobile version