Depression :శ్రీలంక వద్ద తీరం దాటిన వాయుగుండం.. ఈ జిల్లాల్లో తేలికపాటి వర్షాలు,పెరగనున్న చలి

Depression :వర్ష సూచన తక్కువగానే ఉన్నా కూడా , మిర్చి, మొక్కజొన్న, వరి వంటి పంటలు కోత దశలో ఉన్నందున రైతులు అప్రమత్తంగానే ఉండాలి.

Depression

ఆంధ్రప్రదేశ్‌కు వాతావరణ శాఖ ఒక తీపి కబురు అందించింది. బంగాళాఖాతంలో కొద్ది రోజులుగా ఆందోళన కలిగిస్తున్న వాయుగుండం(Depression ) ముప్పు ఏపీకి తప్పింది. శ్రీలంకకు ఈశాన్యంగా ముల్లయిట్టివు సమీపంలో శనివారం సాయంత్రం.. ఈ వాయుగుండం తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ (IMD) వెల్లడించింది.

ప్రస్తుతం వాయుగుండం (Depression )బలహీనపడి పశ్చిమ దిశగా కదులుతూ దక్షిణ తమిళనాడు వైపు పయనిస్తోంది. దీంతో దీని ప్రభావం ఆంధ్రప్రదేశ్‌పై స్వల్పంగానే ఉండనుంది. ఇది పంటలు చేతికి వచ్చే సమయంలో రైతులకు పెద్ద ఉపశమనమనే చెప్పాలి.

తీరం దాటిన వాయుగుండం ప్రభావంతో ఈరోజు (ఆదివారం) రాయలసీమ , దక్షిణ కోస్తాలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది.

ముఖ్యంగా తిరుపతి, నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య జిల్లాల్లో చిరు జల్లులు పడే అవకాశం ఉంది. అలాగే ప్రకాశం, బాపట్ల, పల్నాడు, కడప, అనంతపురం జిల్లాల్లో అక్కడక్కడ తుంపర్లు పడొచ్చు. మిగిలిన ప్రాంతాల్లో ఆకాశం మేఘావృతమై ఉంటుందని వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు.

వర్షాల ప్రభావం తక్కువగా ఉన్నాకూడా, చలి తీవ్రత మాత్రం ఏపీ వ్యాప్తంగా కొనసాగుతోంది. ఉత్తర దిశ నుంచి వీస్తున్న గాలుల కారణంగా ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. శనివారం అల్లూరి జిల్లా ముంచంగిపుట్టులో అత్యల్పంగా 6.4 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఇంకా తక్కువ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.

అటు తెలంగాణలోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. రాబోయే మూడు రోజుల్లో హైదరాబాద్ సహా తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో కనిష్ఠ ఉష్ణోగ్రతలు 11 నుంచి 15 డిగ్రీల మధ్య నమోదయ్యే అవకాశముంది. ప్రయాణికులు , చలికి త్వరగా ప్రభావితమయ్యే వారు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు సూచిస్తున్నారు.

Depression

వర్ష సూచన తక్కువగానే ఉన్నా కూడా , మిర్చి, మొక్కజొన్న, వరి వంటి పంటలు కోత దశలో ఉన్నందున రైతులు అప్రమత్తంగానే ఉండాలి. ధాన్యం తడవకుండా ముందస్తుగా పట్టాలు సిద్ధం చేసుకుంటే మంచిది. ముఖ్యంగా దక్షిణ కోస్తా రైతులు ఆకాశం మేఘావృతమై ఉండటంతో నూర్పిడి పనుల్లో వేగం పెంచాలని అధికారులు సూచించారు.

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Exit mobile version