smart meters : ఆంధ్రప్రదేశ్‌లో స్మార్ట్ మీటర్ల ఏర్పాటు వ్యవహారం హీటెక్కుతోంది. స్మార్ట్ మీటర్ల వల్ల ప్రజలకు నిజంగా ప్రయోజనం కలుగుతుందా, లేదా కొత్త సవాళ్లను ఎదుర్కోవాల్సి వస్తుందా అనే చర్చ విస్తృతంగా సాగుతోంది. ఈ అంశంపై ప్రజల్లో నెలకొన్న ఆందోళనలను దృష్టిలో పెట్టుకున్న ప్రభుత్వం, కీలక హామీని ఇచ్చింది.
smart meters
తాజాగా ప్రజల అనుమతి, అంగీకారం లేకుండా తమ ఇళ్లకు స్మార్ట్ మీటర్లు(smart meters) అమర్చబోమని ఏపీ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్(Gottipati Ravikumar) స్పష్టం చేశారు. విశాఖపట్నంలో జరిగిన విద్యుత్ శాఖ సమీక్షా సమావేశంలో ఆయన దీనిపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ రంగానికి కూడా స్మార్ట్ మీటర్లు బిగించబోమని, ప్రస్తుతం కేవలం వాణిజ్య సంస్థలకు మాత్రమే వీటిని అమర్చినట్లు మంత్రి వివరించారు.
అయితే ఈ స్మార్ట్ మీటర్ల అంశం గత ప్రభుత్వ హయాంలోనూ చర్చనీయాంశమైంది. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం స్మార్ట్ మీటర్లను ప్రవేశపెట్టాలని భావించినప్పుడు, ప్రస్తుత అధికార కూటమిలోని టీడీపీ(TDP), వాటిని తీవ్రంగా వ్యతిరేకించింది. ప్రజలపై ఆర్థిక భారం పడుతుందని, బిల్లులు పెరుగుతాయని అప్పట్లో విమర్శలు గుప్పించింది.
ఇప్పుడు అదే టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటు ప్రక్రియను ముందుకు తీసుకెళ్లే ఆలోచనలో ఉంది. ఈ రాజకీయ వైఖరి మార్పుపై వామపక్ష పార్టీలు సహా కొన్ని ప్రజా సంఘాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి. ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని అవలంబించాలని డిమాండ్ చేస్తున్నాయి.
కాగా స్మార్ట్ మీటర్ల వల్ల విద్యుత్ సరఫరా, వినియోగాన్ని మరింత సమర్థవంతంగా పర్యవేక్షించవచ్చు. మానవ తప్పిదాలకు తావు లేకుండా బిల్లింగ్‌లో పారదర్శకత ఉంటుంది. విద్యుత్ అంతరాయాలను త్వరగా గుర్తించి, పరిష్కరించొచ్చు. వినియోగదారులకు తమ విద్యుత్ వినియోగాన్ని డిజిటల్‌గా తెలుసుకొని, అవసరాలకు తగ్గట్టు సర్దుబాటు చేసుకునే అవకాశం ఉంటుందని విద్యుత్ అధికారులు చెబుతున్నారు.
అయితే మీటర్ల నిర్వహణ, అద్దె పేరుతో విద్యుత్ బిల్లులపై అదనపు భారం పడుతుందనే ఆందోళనతో పాటు..ఇప్పటికే కొన్నిచోట్ల స్మార్ట్ మీటర్లు బిగించాక బిల్లులు పెరిగాయనే ఆరోపణలున్నాయి. అలాగే సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన లేని గ్రామీణ ప్రాంత ప్రజలకు వీటి వినియోగం సవాలుగా మారొచ్చు. ప్రభుత్వం ప్రజల ఆమోదంతోనే ముందుకు వెళ్తామని హామీ ఇవ్వడంతో, ఈ పథకం అమలు తీరు, ప్రజలపై దాని ప్రభావం ఎలా ఉండబోతుందో చూడాలి.