IND vs ENG : ఇంగ్లాండ్ తో సెమీఫైనల్..భారత తుది జట్టు ఇదే

IND vs ENG : టీ20 ప్రపంచకప్ లో ఇక నాకౌట్ సమరాలకు కౌంట్ డౌన్ మొదలైంది. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా తలపడనుండగా.. గురువారం టీమిండియా, ఇంగ్లాండ్ ఢీకొంటాయి.

IND vs ENG

టీ20 ప్రపంచకప్ లో ఇక నాకౌట్ సమరాలకు కౌంట్ డౌన్ మొదలైంది. బుధవారం జరిగే తొలి సెమీఫైనల్లో న్యూజిలాండ్, సౌతాఫ్రికా తలపడనుండగా.. గురువారం టీమిండియా, ఇంగ్లాండ్(IND vs ENG) ఢీకొంటాయి. ఈ మెగాటోర్నీలో టైటిల్ ఫేవరెట్ గా బరిలోకి దిగిన భారత జట్టు లీగ్ స్టేజ్ లో దుమ్మురేపింది.

అయితే సూపర్ 8లో మాత్రం సౌతాఫ్రికాపై ఓడిపోవడం ఇబ్బంది పెట్టింది. అసలు సెమీస్ కు చేరుతుందా లేదా అన్న అనుమానాలు కూడా వచ్చాయి. కానీ మళ్లీ గాడిలో పడిన భారత్(IND vs ENG) వరుసగా జింబాబ్వే, వెస్టిండీస్ లను చిత్తు చేసి సెమీఫైనల్ కు దూసుకొచ్చింది. ఇప్పుడు సెమీస్ లో ఇంగ్లాండ్ రూపంలో సవాల్ ఎదురుచూస్తోంది.

డిఫెండింగ్ ఛాంపియన్ హోదాలో టైటిల్ నిలబెట్టుకోవాలంటే మరొక రెండు మ్యాచ్ లు గెలవాలి. ముందు సెమీస్ లో ఇంగ్లీష్ టీమ్ కు చెక్ పెట్టాలి. ఈ క్రమంలో భారత తుది జట్టు కూర్పుపై ఆసక్తి నెలకొంది. విండీస్ పై గెలిచినా సరే కొన్ని లోపాలు మాత్రం బయటపడ్డాయి. మిడిలార్డర్ వైఫల్యం, ఫీల్డింగ్ లో పేలవ ప్రదర్శనతో పాటు బౌలర్లు భారీగా పరుగులిచ్చేయడం.. ఇప్పుడు సెమీస్ కు ముందు ఇవి అధిగమించకుంటే కష్టమే. అదే సమయంలో తుది జట్టు కూర్పుకు సంబంధించి అభిషేక్ శర్మపై చర్చ జరుగుతోంది.అతన్ని తప్పించాలని కొందరు, కొనసాగించాలని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.

నిజానికి ఈ మెగాటోర్నీకి ముందు సూపర్ ఫామ్ లో ఉన్న అభిషేక్ శర్మ దానిని కొనసాగించడంలో పూర్తిగా విఫలమయ్యాడు. ఈ టోర్నీలో అభిషేక్ ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. దీంతో సంజూ శాంసన్ , ఇషాన్ కిషన్ లను ఓపెనర్లుగా పంపి రింకూ సింగ్ లేదా స్పెషలిస్ట్ స్పిన్నర్ ను తుది జట్టులోకి తీసుకోవాలని పలువురు సూచిస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో తుది జట్టును మార్చే అవకాశాలు కనిపించడం లేదు. విండీస్ పై గెలిచిన జట్టునే సెమీస్ లో ఇంగ్లాండ్ పైనా కొనసాగించే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయి.

IND vs ENG

రింకూ సింగ్ కూడా పెద్దగా ఫామ్ లో లేడు. గతంలో ఇచ్చిన అవకాశాలను అతను వృథా చేసుకున్నాడు. అటు స్పెషలిస్ట్ స్పిన్నర్ అవసరం కూడా లేకపోవచ్చనే అభిప్రాయం వినిపిస్తోంది. ఎందుకంటే మ్యాచ్ కు ఆతిథ్యమిస్తున్న వాంఖేడే స్టేడియంలో అదనపు స్పిన్నర్ వల్ల పెద్దగా ఉపయోగం ఉండకపోవచ్చు. వాంఖేడేలో ఛేజింగ్ జట్టుకే ఎక్కువ అవకాశాలుంటాయి. ఈ నేపథ్యంలో వెస్టిండీస్ పై కీలక మ్యాచ్ లో ఆడిన జట్టునే కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.

సెమీస్ కు భారత తుది జట్టు అంచనా 
అభిషేక్ శర్మ, సంజూ శాంసన్, ఇషాన్ కిషన్, సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), హార్థిక్ పాండ్యా, శివమ్ దూబే, తిలక్ వర్మ, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి , అర్షదీప్ సింగ్, బుమ్రా

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version