RCB : ఆర్సీబీ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్..చిన్నస్వామిలో ఐపీఎల్ మ్యాచ్ లు

RCB : ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్ అందింది.

RCB

ఐపీఎల్ 2026 సీజన్ కు ముందు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు అభిమానులకు గుడ్ న్యూస్ అందింది. అనుమానాలకు తెరదించుతూ చిన్నస్వామి స్టేడియం ఐపీఎల్ మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వడం ఖరారైంది. ఈ విషయాన్ని ఆర్సీబీ (RCB) సీఈఓ రాజేశ్‌ మీనన్‌ ధ్రువీకరించారు. ఐపీఎల్ ప్రారంభం నుంచీ పలువురు స్టార్ ప్లేయర్స్ ఉన్నా టైటిల్ గెలవని ఆర్సీబీ గత ఏడాది అదరగొట్టింది.

సుధీర్ఘ నిరీక్షణకు తెరదించుతూ రజత్ పటిదార్ సారథ్యంలో ఐపీఎల్ ఛాంపియన్ గా నిలిచింది. అయితే ఈ విజయోత్సాహం తీవ్ర విషాదాన్ని నింపింది. తమ వెన్నంటి ఉన్న అభిమానులతో సంబరాలు చేసుకోవాలనుకున్న ఆర్సీబీ ..బెంగళూరులో విజయోత్సవ ర్యాలీ నిర్వహించింది. ఈ ర్యాలీకి ఊహించని విధంగా అభిమానులు తరలిరావడంతో

స్టేడియం బయట తొక్కిసలాట జరిగి 11 మంది చనిపోయారు. పదుల సంఖ్యలో గాయాల పాలయ్యారు. అప్పట్లో దేశవ్యాప్తంగా ఈ ఘటన తీవ్ర విషాదాన్నే కాకుండా దుమారాన్ని కూడా రేపింది. సరైన అనుమతులు తీసుకోకుండానే ర్యాలీ నిర్వహించారని తేలడంతో ఆర్సీబీ ప్రతినిధులను అరెస్ట్ చేశారు.

అటు ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుంది. ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు చిన్నస్వామి స్టేడియంలో క్రికెట్ మ్యాచ్ లు నిర్వహించడాన్ని నిషేధించారు.

ఈ కారణంగానే మహిళల ప్రపంచకప్ మ్యాచ్ లు కూడా అక్కడి నుంచి తరలిపోయాయి. రంజీ మ్యాచ్ లను సైతం నిర్వహించలేకపోయారు. అయితే ఐపీఎల్ ముంగిట ఆర్సీబీ యాజమాన్యం, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ అక్కడి ప్రభుత్వానికి పదేపదే విజ్ఞప్తులు చేయడంతో ఎట్టకేలకు షరతులతో కూడిన అనుమతి లభించింది.

RCB

తాజా సమాచారం ప్రకారం ఈ సీజన్ లో చిన్నస్వామి స్టేడియం ఐదు మ్యాచ్ లకు ఆతిథ్యమివ్వనుంది. దీనిపై ఆర్సీబీ సీఈవో రాజేశ్ మీనన్ సంతోషం వ్యక్తం చేశారు. సుదీర్ఘ చర్చలు ఫలించాయని, అన్ని అనుమతులు తీసుకున్నట్టు వెల్లడించారు. ఆర్సీబీ తన హోం గ్రౌండ్ లో ఐదు మ్యాచ్ లు ఆడనుందని, అనుమతి ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి, సహకరించిన కర్ణాటక క్రికెట్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలిపారు.

బెంగళూరులో సజావుగా మ్యాచ్ లు నిర్వహించేలా పోలీసులతో కలిసి ఆర్సీబీ పనిచేస్తుందని వెల్లడించారు. కాగా సీజన్ లో మిగిలిన రెండు హోం గ్రౌండ్ మ్యాచ్ లను ఆర్సీబీ రాయ్ పూర్ లో ఆడనుంది. దీనికి సంబంధించి ఇప్పటికే అక్కడి స్టేడియం వర్గాలతో చర్చలు కూడా పూర్తయినట్టు తెలుస్తోంది.

మరిన్ని స్పోర్ట్స్ న్యూస్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Exit mobile version