Malkapuram
ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిలో భాగమైన తుళ్ళూరు మండలంలోని మందడం, మల్కాపురం గ్రామాలు చరిత్రలో ఎంతో ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి. కాకతీయుల కాలం నుంచి నేటి వరకు ఈ గ్రామాలు వర్ధిల్లుతూ వచ్చాయి. చరిత్రకారుల ప్రకారం, ఈ ప్రాంతాలు కాకతీయ కమ్మ దుర్జయ వంశ మహారాణి రుద్రమదేవి , గణపతి దేవుడు తిరిగిన ప్రదేశాలుగా ప్రసిద్ధి చెందాయి. ముఖ్యంగా, కృష్ణా నది ఇక్కడ ఉండటం వల్ల కాకతీయుల కాలంలో ఈ ప్రాంతం ఒక ముఖ్యమైన కేంద్రంగా వెలిసింది.
మల్కాపురంలో(Malkapuram) రుద్రమదేవి వేయించిన ఒక శిలాశాసనం నేటికీ సందర్శకులకు కనిపిస్తుంది. 14 అడుగుల ఎత్తు ఉన్న ఈ శిలాశాసనంపై 200 వాక్యాలతో 1261వ సంవత్సరంలో రాసిన శాసనం చెక్కబడి ఉంది. ఈ శాసనంలో కాకతీయుల రాజవంశం, గోళకీమఠ సంప్రదాయం, గణపతిదేవుడు తన గురువు విశ్వేశ్వరశంభునకు మందడం, వెలగపూడి, మల్కాపురం గ్రామాలు దానం చేసిన విషయం ఉంది. ఈ శాసనం చారిత్రక ప్రాధాన్యం కలిగి ఉంది.
మల్కాపురం(Malkapuram) శివాలయం కూడా ఈ గ్రామాల చరిత్రలో ఒక ముఖ్యమైన భాగం. ఈ ఆలయాన్ని రాణి రుద్రమదేవి నిర్మించారని చరిత్రకారులు చెబుతున్నారు. ఇది శిథిలావస్థకు చేరుకున్న తర్వాత, అమరావతి ప్రభువు రాజా వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు ఈ శివలింగానికి మళ్ళీ ఆలయం కట్టించారని ప్రతీతి. ఈ శివలింగం అమరావతి అమరలింగేశ్వరస్వామి ఆలయంలోని శివలింగం అని, అది దొంగల నుంచి రక్షించబడి ఇక్కడకు వచ్చిందని ఒక కథనం. అందుకే మల్కాపురం శిలాశాసనంపై ఉన్న నంది అమరావతి వైపు చూస్తున్నట్లు ఉంటుంది.
మల్కాపురం(Malkapuram అనే పేరు కూడా ఒక ఆసక్తికరమైన కథనంతో ముడిపడి ఉంది. శ్రీ కృష్ణదేవరాయలు కొలువులో ఉన్న నర్తకి మల్లికకు ఈ గ్రామాన్ని బహుమతిగా ఇవ్వడం వల్ల ఈ ప్రాంతం మల్లికాపురంగా, ఆ తర్వాత మల్కాపురంగా మారిందని చెబుతారు. ఆంధ్రా భోజుడుగా పేరొందిన కృష్ణదేవరాయలు అమరావతిలో అమరేశ్వరస్వామిని దర్శించుకుని, ఆలయానికి భూమిని దానమిచ్చినట్లుగా, తన బరువుతో సమానమైన బంగారాన్ని పంచిపెట్టినట్లుగా ఇక్కడ ఉన్న రాజశాసనం ద్వారా తెలుస్తోంది.
ఎంతో చారిత్రక బ్యాక్ గ్రౌండ్ ఉన్న మందడం, మల్కాపురం గ్రామాలు ఇప్పుడు రాజధానిలో భాగంగా ఉండటం పట్ల స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అమరావతి నిర్మాణ పనుల్లో భాగంగా, చారిత్రక ప్రాముఖ్యత ఉన్న విఘ్నేశ్వరుడి ఆలయం, రుద్రమదేవి శాసనం వంటి వాటిని పునరుద్ధరించే పనులు చురుగ్గా సాగుతున్నాయి. మల్కాపురం శివాలయం కూడా పురావస్తుశాఖ ఆధీనంలోకి వెళ్లనుందని సమాచారం. ఈ చర్యలు చరిత్రను కాపాడుతూనే, ఆ ప్రాంతానికి కొత్త గుర్తింపు తీసుకొస్తాయని ఆశిస్తున్నారు.