PMEGP: పీఎంఈజీపీతో సొంత వ్యాపారం చేసుకోవాలనుకుంటున్నారా? రూల్స్ తెలుసుకోండి
PMEGP:18 సంవత్సరాలు నిండిన నిరుద్యోగులు పీఎంఈజీపీ పథకం కింద సబ్సిడీతో కూడిన రుణాలు పొంది, తమ సొంత వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు.

PMEGP
ప్రధానమంత్రి ఉపాధి కల్పన పథకం (PMEGP) అనేది దేశంలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన ఒక ప్రతిష్టాత్మక కార్యక్రమం. 18 సంవత్సరాలు నిండిన నిరుద్యోగులు ఈ పథకం కింద సబ్సిడీతో కూడిన రుణాలు పొంది, తమ సొంత వ్యాపారాలను ప్రారంభించుకోవచ్చు.
ఈ పథకానికి అర్హతలకు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఎనిమిదో తరగతి పాసైన వారు ఉత్పత్తి యూనిట్ ఏర్పాటు చేసుకోవాలంటే పది లక్షల రూపాయల పెట్టుబడి వరకు, సర్వీస్ యూనిట్ కోసం ఐదు లక్షల రూపాయల పెట్టుబడి వరకు రుణాలు పొందవచ్చు. ఒకవేళ ఎనిమిదో తరగతి పాసవ్వని వారికి కూడా అవకాశం ఉంది. వారు పది లక్షల వరకు ఉత్పత్తి యూనిట్లకు, ఐదు లక్షల వరకు సర్వీస్ యూనిట్లకు రుణాలు పొందవచ్చు.
ఈ పథకాన్ని అమలు చేసేందుకు పలు ప్రభుత్వ సంస్థలు పని చేస్తున్నాయి. జిల్లా పరిశ్రమల కేంద్రం (DIC), ఖాదీ , గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC), ఆంధ్రప్రదేశ్ ఖాది, గ్రామీణ పరిశ్రమల మండలి (APKVIB) ,కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు కాయర్ బోర్డు కూడా సహకారాన్ని అందిస్తున్నాయి. దరఖాస్తుదారులు ఈ పథకానికి ఆన్‌లైన్‌లో www.kviconline.gov.in/pmegpeportal/ అనే వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే, ఈ సబ్సిడీ కేవలం కొత్తగా స్థాపించే వ్యాపారాలకు మాత్రమే వర్తిస్తుంది.

ఈ పథకం కింద లభించే సబ్సిడీ వివరాలు లబ్ధిదారుల కేటగిరీ, ప్రాంతాన్ని బట్టి మారుతాయి. జనరల్ కేటగిరీకి చెందిన వారికి పట్టణ ప్రాంతాల్లో 15% సబ్సిడీ లభిస్తుంది. అదే వారు గ్రామీణ ప్రాంతంలో యూనిట్‌ను ప్రారంభిస్తే 25% సబ్సిడీ పొందవచ్చు. ఈ కేటగిరీ లబ్ధిదారులు ప్రాజెక్ట్ వ్యయంలో 10% తమ వాటాగా పెట్టుబడి పెట్టాలి.
ప్రత్యేక కేటగిరీలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మహిళలు, మైనారిటీలు, వికలాంగులు, మాజీ సైనికులు వారికి మరింత ఎక్కువ సబ్సిడీ లభిస్తుంది. పట్టణ ప్రాంతంలో 25% , గ్రామీణ ప్రాంతంలో 35% సబ్సిడీ లభిస్తుంది. ఈ కేటగిరీ వారికి కేవలం 5% మాత్రమే తమ వాటాగా పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా, ఈ పథకం గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో యువతను ప్రోత్సహించి, ఆర్థికంగా నిలదొక్కుకునేలా సహాయం చేస్తుంది.