AP Tourism: ప్రకృతి అందాల మధ్య థ్రిల్లింగ్ అనుభవం కావాలా? కొద్ది రోజులు వెయిట్ చేయండి చాలు..

AP Tourism: కారవాన్ పార్కులతో అడ్వెంచర్ ప్రియులకు ఏపీ ప్రభుత్వం వెల్కమ్ చెప్పడానికి రెడీ అవుతోంది.

AP Tourism : ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి సరికొత్త వ్యూహాలతో దూసుకుపోతోంది. ముఖ్యంగా సాహసయాత్రలను ఇష్టపడే వారికి, ప్రకృతి ఒడిలో సేదతీరాలనుకునే వారికి శుభవార్త వినిపించబోతోంది. ఏపీ కారవాన్ టూరిజం పాలసీలో భాగంగా కారవాన్ పార్కులను ఏర్పాటు అభివృద్ధి చేసి, రాష్ట్రంలోని అద్భుతమైన పర్యాటక ప్రదేశాలకు సందర్శకులను పెద్ద ఎత్తున ఆకర్షించడమే లక్ష్యంగా పెట్టుకుంది. మరికొద్ది రోజుల్లోనే ఈ పాలసీకి అధికారిక ఆమోదం లభించే అవకాశం ఉంది.

AP Tourism

పర్యాటక రంగాన్ని ఒక కీలక పరిశ్రమగా గుర్తించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, దాని ఎదుగుదలకు అనేక ప్రోత్సాహకాలను అందిస్తోంది. హోమ్‌స్టేలు, ఏరోడ్రోమ్‌ల ఏర్పాటుతో పాటు, ఇప్పుడు కారవాన్ టూరిజం ద్వారా సందర్శకులకు సరికొత్త అనుభూతులను అందించేందుకు సిద్ధమవుతోంది. దేశంలోని వివిధ రాష్ట్రాలలో విజయవంతంగా నడుస్తున్న కారవాన్ టూరిజం పాలసీలను స్టడీ చేసి, వాటి స్ఫూర్తితో ఏపీ కూడా తనదైన ప్రత్యేక కారవాన్ టూరిజం పాలసీని రూపొందించింది. ఇందులో భాగంగా, వ్యూహాత్మక ప్రాంతాల్లో కారవాన్ పార్కులు ఏర్పాటు చేయనుంది.

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ అరకు లోయ, భీమిలి బీచ్‌తో పాటు, రాష్ట్రంలోని మరికొన్ని ప్రముఖ టూరిస్ట్ స్పాట్లలో ఈ కారవాన్ పార్కులను ఏర్పాటు చేయాలని ప్లాన్ చేస్తోంది. ముఖ్యంగా, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని ఐదు ప్రత్యేక లొకేషన్లలో ఈ పార్కులను అభివృద్ధి చేయనున్నారు. ఈ కారవాన్ పార్కుల ద్వారా, పర్యాటకులు ఇప్పటివరకు చూడని అందమైన, సహజసిద్ధమైన ప్రాంతాలను చూసే ఛాన్స్ దక్కుతుందని అధికారులు చెబుతున్నారు.

ఈ కారవాన్ పార్కుల (Caravan Parks)లో సందర్శకులకు కావాల్సిన అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉంటాయి. 24 గంటలూ అందుబాటులో ఉండే వాహనాలు, లగ్జరీ వసతి సౌకర్యాలు, సురక్షితమైన పార్కింగ్ స్థలం వంటివి ఇక్కడ ఏర్పాటు చేస్తారు. వీటితో పాటు, పర్యాటకుల ఆహ్లాదం కోసం వాకింగ్ ట్రాక్‌లు, సిట్-అవుట్ ప్రాంతాలు, బ్యాడ్మింటన్ కోర్టులు వంటి వినోద సదుపాయాలు కూడా ఉంటాయి. తాగునీరు, విద్యుత్ వంటి ప్రాథమిక అవసరాలను కూడా కారవాన్ పార్కులలో అభివృద్ధి చేయనున్నారు.

పర్యాటకుల కోసం సరికొత్త థ్రిల్లింగ్ అనుభవాలను అందించడానికి, అటవీ ప్రాంతాల్లోని సుందరమైన లొకేషన్లకు సమీపంలో ఈ కారవాన్ పార్కులను డెవలప్ చేస్తారు. పర్యాటక శాఖ అధికారులు కారవాన్ టూరిజం పాలసీ డ్రాఫ్ట్‌ను ఇప్పటికే ప్రభుత్వానికి సబ్మిట్ చేశారు. త్వరలో మంత్రివర్గ సమావేశంలో దీనిపై చర్చించి, ఆ తర్వాత ఫైనల్ అప్రూవల్ లభించే అవకాశం ఉంది.

ఏపీ టూరిజం శాఖ కారవాన్ టూరిజంను విస్తృతంగా ప్రోత్సహిస్తోంది. ఇటీవల విజయవాడలో జరిగిన టూరిజం కాన్‌క్లేవ్‌లో ప్రత్యేకంగా కారవాన్లను ప్రదర్శించారు. ఆంధ్రప్రదేశ్ పర్యాటకాభివృద్ధి సంస్థ (APTDC) ఒక ప్రైవేటు సంస్థతో కలిసి రెండు అధునాతన కారవాన్లను అభివృద్ధి చేయనుంది. వీటిలో ఒక కారవాన్‌లో 12 మంది, మరొక కారవాన్‌లో 8 మంది ప్రయాణించేలా డిజైన్ చేశారు. హైదరాబాద్‌ – గండికోట, హైదరాబాద్‌ – సూర్యలంక వంటి ప్రముఖ రూట్లలో ఈ కారవాన్‌లు నడిపే ఆలోచనలో ఉన్నారు.

ప్రతి కారవాన్‌లో బెడ్, కాన్ఫరెన్స్ హాల్, టీవీ, ఏసీ, ఫ్రిడ్జ్, మైక్రోవేవ్ ఓవెన్, కిచెన్, వాష్‌ రూం, సౌండ్ సిస్టమ్స్, సెక్యూరిటీ కెమెరాలు వంటి అన్ని లగ్జరీ సౌకర్యాలు ఉంటాయి. వీటితో, ప్రకృతి ప్రేమికులు తమ “కదిలే ఇల్లు” లాంటి కారవాన్లలో ప్రశాంతంగా, సురక్షితంగా ప్రకృతి ఒడిలో సేదతీరవచ్చు. ఈ కొత్త పాలసీ, ఏపీ పర్యాటక రంగానికి(AP Tourism) కొత్త ఊపునిస్తుందని భావిస్తున్నారు.

Exit mobile version