AP Assembly
ఏపీ అసెంబ్లీ సమావేశాలు కొనసాగుతున్న వేళ వైసీపీ ఎమ్మెల్యేల డుమ్మా వ్యవహారం మరోసారి తెరపైకి వచ్చింది. గత కొంతకాలంగా వైసీపీ ఎమ్మెల్యేలు ఎప్పుడు ఏపీ అసెంబ్లీ(AP Assembly) జరిగినా తొలిరోజు హాజరు వేయించుకుని తర్వాత సభకు డుమ్మా కొడుతున్నారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే ఏపీ అసెంబ్లీ(AP Assembly)కి వస్తామంటూ ఇప్పటికే పలుసార్లు వైసీపీ అధినేత వైఎస్ జగన్ స్పీకర్ ను డిమాండ్ చేశారు. తన ఎమ్మెల్యేలకు సైతం ఇదే మాట చెప్పి అసెంబ్లీ సమావేశాలకు దూరంగా ఉంటూ వస్తున్నారు.
దాదాపు అధికారం కోల్పోయినప్పటి నుంచీ ఇదే పంథా అనుసరిస్తున్న వైసీపీ ఎమ్మెల్యేలపై విమర్శలు వస్తున్నాయి. ప్రెస్ మీట్లు పెట్టి గొంతు తన అనుకూల మీడియాలో గొంతు చించుకునే బదులు ఏపీ అసెంబ్లీలో(AP Assembly) ప్రజాసమస్యలు, ఇతర అంశాలపై గొంతెత్తి మాట్లాడొచ్చు కదా అన్నది చాలా మంది అభిప్రాయం.
కానీ వైఎస్ జగన్ మాత్రం ప్రతిపక్ష హోదా ఇచ్చి, తాము కోరినంత సమయం ఇస్తేనే సభకు వస్తామంటూ పట్టుపట్టుకుని కూర్చున్నారు. వీరి వ్యవహారశైలి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. తాజాగా స్పీకర్ అయ్యన్నపాత్రుడు సైతం వైసీపీ ఎమ్మెల్యేలకు అల్టిమేటం జారీ చేశారు. సభకు హాజరుకాకుంటే అనర్హత వేటు వేసే అంశాన్ని సైతం పరిశీలిస్తున్నారు.
వైసీపీ ఎమ్మెల్యేలు సభకు రాకుండా జీతాలు తీసుకుంటున్నారనీ, ఒకవిధంగా ప్రజల తీర్పును అవమానించడమేనని స్పీకర్ అయ్యన్న పాత్రుడు వ్యాఖ్యానించారు. ప్రజల పట్ల వైసీపీ ఎమ్మెల్యేల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. అయితే మాజీ సీఎం వైఎస్ జగన్ మాత్రం ఎమ్మెల్యేగా జీతం తీసుకోవడం లేదని స్పీకర్ చెప్పడం కొసమెరుపు. మిగిలిన ఎమ్మెల్యేలు మాత్రం అన్ని సదుపాయాలు అనుభవిస్తూ, అసెంబ్లీకి డుమ్మా కొట్టడం ఎంతవరకూ సబబో ఆలోచించాలని కోరారు.
ప్రస్తుతం ఈ వ్యవహారం రాజకీయపరంగా తీవ్ర చర్చకు దారితీసింది. కొందరు దీనిని నైతిక నిర్ణయంగా పేర్కొంటుంటే… మరికొందరు సభకు ఎమ్మెల్యేలు గైర్హాజరు కావడం సమర్థించే విషయం కాదంటున్నారు. అసెంబ్లీ సమావేశాలు జరిగే సమయంలో ప్రతీ ఎమ్మెల్యే సభకు హాజరు కావాలని స్పీకర్ కోరుతూనే ఉన్నారు. ఒకవేళ వరుసగా 65 రోజులు సభకు డుమ్మా కొడితే నోటీసులు జారీచేస్తామని కూడా వార్నింగ్ ఇచ్చారు.
తర్వాత నిబంధనలకు అనుగుణంగా చర్యలు తీసుకునే అవకాశాన్ని కూడా పరిశీలిస్తామని స్పష్టం చేశారు, దీనిపై లోక్‌సభ స్పీకర్‌ను సంప్రదిస్తానని కూడా చెప్పారు. తద్వారా ఈ అంశాన్ని జాతీయ స్థాయికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ జాతీయ స్థాయిలో దీనికి సంబంధించి నిబంధనలు మారిస్తే మాత్రం భవిష్యత్తులో సభకు గైర్హాజరు అవుతున్న సభ్యులపై కఠిన చర్యలు తప్పవు.
ఇదిలా ఉంటే ప్రతిపక్ష హోదా ఇవ్వడం జరగదని స్పీకర్ మరోసారి తేల్చి చెప్పారు. అసెంబ్లీలో అవసరమైన సంఖ్యా బలం లేకపోవడమే దీనికి కారణమన్నారు. స్పీకర్ అయ్యన్నపాత్రులు మరోసారి ప్రతిపక్ష హోదాపై తేల్చేసిన నేపథ్యంలో వైసీపీ రాజకీయ వ్యూహం ఏమిటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
సభలో పాల్గొని బలంగా ప్రశ్నించాలా లేక బహిష్కరణ ధోరణిని కొనసాగించాలా అనే దానిపై వైసీపీ నేతలు తర్జన భర్జన పడుతున్నారు. ఒకవేళ సభకు డుమ్మా కొట్టడం కొనసాగిస్తే స్పీకర్ తీసుకునే చర్యలకు సంబంధించి న్యాయపరమైన పోరాటాన్ని కూడా పరిశీస్తున్నట్టు సమాచారం. అటు ప్రతిపక్ష హోదాపైనా వైసీపీ కోర్టు ద్వారా పోరాడే అంశాన్ని పరిశీలిస్తోంది.
